...
...
Next Story

జంతర్ మంతర్ వద్ద నిరసన చేయబోమని హామీ.. సీజేపీ నేతల విడుదల

జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా ప్రభుత్వం మళ్లీ గుర్తించే వరకు అక్కడ ఎలాంటి ధర్నాలు చేపట్టబోమని హామీ ఇవ్వడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ కోర్టు బుధవారం విడుదల చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో వీరికి ముందస్తు షరతులతో విడుదల ఉత్తర్వులు ఇచ్చింది.

Published on: Oct 22, 2026, 08:42:16 IST
Advertisement

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద ఎలాంటి నిరసనలు, ధర్నాలు చేపట్టబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కోర్టు బుధవారం జుడీషియల్ కస్టడీ నుంచి విడుదల చేసింది. ఏడు రోజుల కస్టడీ అనంతరం రూ.50,000 చొప్పున వ్యక్తిగత బాండ్లు, పూచీకత్తులను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అక్టోబర్ 23న జరిగే తదుపరి విచారణకు పూచీకత్తుదారులతో సహా హాజరుకావాలని స్పష్టం చేసింది.

శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటాం

విడుదల అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీజేపీ నేతలు
విడుదల అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీజేపీ నేతలు

న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ ఎస్ఈఎం, ఏసీపీ రితు రాజ్ ఎదుట నేతలు దాఖలు చేసిన హామీ పత్రంలో కీలక అంశాలను వెల్లడించారు. జంతర్ మంతర్‌ను చట్టబద్ధంగా మళ్లీ నిరసన ప్రాంతంగా నోటిఫై చేసేంత వరకు అక్కడ ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వబోమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలు, శాంతియుత వాతావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. రాజ్యాంగబద్ధమైన పరిమితుల లోపే తమ పోరాటాలు ఉంటాయని, న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 135(3) కింద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, నేతలు ఇచ్చిన హామీ పత్రాలు, బాండ్లు సరిపోతాయని, వీరిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించారు.

విడుదలపై ప్రాసిక్యూషన్ అభ్యంతరం

ఈ కేసులో సీజేపీ నేతల విడుదలను ప్రాసిక్యూషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. వీరి నుంచి శాంతిభద్రతలకు ఇంకా ముప్పు పొంచి ఉందని, కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలని దర్యాప్తు అధికారి (ఐఓ) విజ్ఞప్తి చేశారు. నేతలు బయట ఇచ్చే ప్రకటనలు, మీడియా వ్యాఖ్యలు కోర్టులో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు భైరవ్ దాస్, ప్రశాంత్ ప్రకాశ్ వాదించారు. గతంలో వీరు తిహార్ జైలుకు వెళ్తున్న సమయంలో అనుచరులు చేసిన వ్యాఖ్యలు ఎస్ఈఎం కోర్టు ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని ఆరోపించారు.

శాంతిభద్రతల విచ్ఛిన్నానికి పూనుకుంటున్నారనే ఆరోపణలతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్లు 126, 170 కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 12న జంతర్ మంతర్ వద్ద ఇనుప గేటు ఎక్కి లోపలికి ప్రవేశించిన ఆరోపణలపై సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను మరుసటి రోజు అరెస్టు చేశారు. అక్టోబర్ 14న వీరిని 5 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపగా, సోమవారం నాటి విచారణలో మరో రెండు రోజులు కస్టడీ పొడిగించారు. పండుగల సీజన్ దృష్ట్యా వీరు బయటకు వస్తే మళ్లీ శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు వాదించినప్పటికీ, ధర్మాసనం షరతులతో కూడిన విడుదలకు అంగీకరించింది.

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఈ నేతలను అక్టోబర్ 10న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు (అక్టోబర్ 11న) ఒక సంవత్సరం పాటు శాంతికి భంగం కలిగించబోమని బాండ్ రాసిచ్చిన తర్వాత విడుదలయ్యారు. అయితే మరుసటి రోజే నిబంధనలు ఉల్లంఘించి జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడంతో ఈ అరెస్టు చోటుచేసుకుంది. అక్టోబర్ 23న పోలీసులు సమర్పించే పూచీకత్తుల పరిశీలన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks