Jantar Mantar Protest : ఓవైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు సీజేపీ మార్చ్! దిల్లీలో తీవ్ర ఉత్కంఠ..
CJP Protest : నీట్ యూజీ పరీక్షల అక్రమాలకు నిరసనగా, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అదే సమయంలో, నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతుండగా, దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల వేళ ఒక్కసారిగా రాజకీయ సంచలనం రేగింది. నీట్-యూజీ పరీక్షల అక్రమాలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ 'చలో సంసద్' నిరసన ప్రదర్శన నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా జాతీయ రాజధాని నడిబొడ్డున భారీగా జనసమీకరణను నిషేధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 163 కింద ఈ నిషేధాజ్ఞలు విధించినట్లు ప్రకటించారు.

అనేక రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చి, సీజేపీ నేతృత్వంలో సోమవారం జరుగుతున్న పార్లమెంట్ మార్చ్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
"ఈ విధమైన నిరసన ప్రదర్శన లేదా ర్యాలీ కోసం ఎలాంటి అనుమతి కోరలేదు, అలాగే ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదు," అని దిల్లీ పోలీసులు ఒక అధికారిక ప్రకటనలో స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం దిల్లీ జిల్లా పరిధిలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో అమల్లో ఉందని వారు వెల్లడించారు.
సెక్షన్ 163 బీఎస్‌ఎస్‌ఎస్ అమలులో ఉన్నందున, ముందస్తు అనుమతి లేకుండా సెంట్రల్ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్దేశించిన నిరసన స్థలంలో మినహా, మరెక్కడా ఎలాంటి నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టడానికి వీల్లేదు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకచోట గుమికూడటం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 223తో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
"పౌరులందరూ చట్టాన్ని గౌరవించాలని, ఎలాంటి అనుమతి లేని నిరసన ప్రదర్శనలలో పాల్గొనవద్దని కోరుతున్నాం. నగరంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతను కాపాడటంలో పోలీసులకు సహకరించాలి," అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్ వేళ భారీ భద్రత!
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఈ ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. దిల్లీకి వచ్చే పలు ప్రవేశ మార్గాలను (ఎంట్రీ పాయింట్స్) హై-సెక్యూరిటీ జోన్లుగా మార్చారు. బహుళ అంచెల బారికేడ్లు, అధునాతన నిఘా కెమెరాలు, యాంటీ-సబోటేజ్ తనిఖీలతో పాటు న్యూదిల్లీ, సెంట్రల్ దిల్లీ, నార్త్ దిల్లీ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలలో 24 గంటల పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారించడానికి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సీనియర్ పోలీస్ వర్గాలు తెలిపాయి. దిల్లీ జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కీలకమైన కూడళ్లలో అదనపు పికెట్లను ఏర్పాటు చేయడంతో పాటు, రిజర్వ్ పోలీసు బలగాలను సైతం అప్రమత్తంగా ఉంచారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీ నిఘాను మరింత ముమ్మరం చేశారు. ముఖ్యంగా జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్, శంకర్ చౌక్ వంటి కీలక ప్రభుత్వ సంస్థలు, ప్రాంతాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏ అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించారు.
ఎవరీ అభిజీత్ దిప్కే?
ఈ నిరసన ప్రదర్శన వెనుక ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 30 ఏళ్ల అభిజీత్ దిప్కే విదేశాల్లో చదువుకుని వచ్చిన ఒక పొలిటికల్ సటైరిస్ట్ (రాజకీయ వ్యంగ్య రచయిత). గతంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కూడా పనిచేశారు. బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ పూర్తి చేసిన దిప్కే, అమెరికాలో ఉన్న సమయంలోనే 'కాక్రోచ్ జనతా పార్టీ' వెబ్‌సైట్‌తో పాటు దాని సోషల్ మీడియా హ్యాండిళ్లను ప్రారంభించి వార్తల్లో నిలిచారు. కేవలం ఒక పొలిటికల్ సెటైర్‌గా దీనిని స్థాపించినట్లు ఆయన చెబుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో ఆయన చేసే కామెంట్లు సాధారణంగా అందరికీ తెలిసిన రాజకీయ విషయాలనే మళ్లీ మళ్లీ పాత పద్ధతిలోనే ప్రస్తావిస్తున్నాయంటూ కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
ఏదేమైనా, ఈ రోజు జరగనున్న చలో సంసద్ మార్చ్ దిల్లీలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


