వాషింగ్టన్ పోస్ట్‌లో భారీ లేఆఫ్స్: బెజోస్‌పై విమర్శలు.. లక్షల కోట్ల సంపద ఉన్నా..
వాషింగ్టన్ పోస్ట్‌లో మూడో వంతు సిబ్బందిని తొలగించడంపై జెఫ్ బెజోస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 244 బిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న వ్యక్తికి ఈ నష్టాలు ఒక లెక్కా అని నెటిజన్లు, అమెరికా సెనేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆర్థిక నిర్ణయం కాదు, రాజకీయ కుట్ర అని విమర్శిస్తున్నారు.
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ లో భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత విధించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 145 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పత్రికలో ఏకంగా మూడో వంతు సిబ్బందిని తొలగిస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ సంస్థ అధినేత, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ లక్ష్యంగా రాజకీయ నేతలు, జర్నలిస్టులు విరుచుకుపడుతున్నారు.

కారణం నష్టాలా? మరేదైనా?
సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలు, వేగంగా మారుతున్న మీడియా రంగ పరిస్థితుల దృష్ట్యా ఈ ‘కఠిన నిర్ణయం’ తీసుకోక తప్పలేదని వాషింగ్టన్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. అయితే, ఈ వాదనను ఇంటర్నెట్ లోకం ససేమిరా అంటోంది. 244.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 20.5 లక్షల కోట్ల పైమాటే) వ్యక్తిగత సంపద ఉన్న బెజోస్‌కు, పత్రిక నష్టాలు చాలా స్వల్పమని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
సెనేటర్ల నిలదీత: 'ప్రజాస్వామ్యం ఖూనీ'
ఈ వ్యవహారంపై అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ ‘X’ వేదికగా తీవ్రంగా స్పందించారు. బెజోస్ విలాసాల కోసం పెడుతున్న ఖర్చును ఆయన ఏకిపారేశారు. “మెలానియా సినిమా కోసం 75 మిలియన్ డాలర్లు, విలాసవంతమైన యాచ్ కోసం 500 మిలియన్ డాలర్లు, పెళ్లి కోసం మరో 55 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగలిగిన జెఫ్ బెజోస్.. వాషింగ్టన్ పోస్ట్ సిబ్బందిని తొలగించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కుబేరుల వ్యవస్థలో ప్రజాస్వామ్యం అంతమైపోతోంది” అని సాండర్స్ మండిపడ్డారు.
మరో సెనేటర్ ఎలిజబెత్ వారెన్ కూడా ఇదే తరహాలో స్పందించారు. అమెజాన్ సంస్థను ప్రశ్నిస్తున్న రిపోర్టర్లను కావాలనే బెజోస్ తొలగించారని ఆమె ఆరోపించారు. “తమ కంపెనీని జవాబుదారీగా నిలబెడుతున్న అమెజాన్ బీట్ రిపోర్టర్లను బెజోస్ పంపించేశారు. 250 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వ్యక్తికి ఇది తగునా?” అని ఆమె ప్రశ్నించారు.
రాజకీయ ఎజెండానే కారణమా?
ప్రతినిధుల సభ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ (AOC) స్పందిస్తూ, ఇది యాదృచ్ఛికంగా జరిగిన కోత కాదని వ్యాఖ్యానించారు. “బెజోస్ వాషింగ్టన్ పోస్ట్‌ను కొనుగోలు చేసినప్పుడే ఎడిటోరియల్ సెక్షన్‌ను తన గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు అమెజాన్ గురించి రాసే జర్నలిస్టులను తొలగిస్తున్నారు. మీడియాను సంపన్న వర్గాలు చేజిక్కించుకుంటే ఇలాంటి ఫలితాలే ఉంటాయి” అని ఆమె విమర్శించారు.
వారెన్ గన్నెల్స్ అనే అధికారి మరిన్ని ఆసక్తికర గణాంకాలను బయటపెట్టారు. ట్రంప్ ఎన్నికైన తర్వాత బెజోస్ సంపద 40 బిలియన్ డాలర్లు పెరిగిందని, ఆయన పన్ను రేటు కేవలం 1.1 శాతంగానే ఉందని ఎద్దేవా చేశారు.
జర్నలిస్టుల ఆవేదన
“ఇది ఆర్థికపరమైన నిర్ణయం కాదు, వ్యక్తిగత, రాజకీయ నిర్ణయం” అని జర్నలిస్ట్ జాక్ మిర్కిన్సన్ అభిప్రాయపడ్డారు. బెజోస్ తన జేబులో చిల్లర డబ్బుతో ఈ పత్రికను నడపగలరని, కావాలనే ఒక గొప్ప వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మరో జర్నలిస్ట్ పాల్ ఓస్బోర్న్ ఆవేదన వ్యక్తం చేశారు.
సబ్‌స్క్రిప్షన్ల రద్దు..
రాజకీయ ఒత్తిడి గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించలేక ‘ఎండార్స్‌మెంట్’ విషయంలో వాషింగ్టన్ పోస్ట్ మౌనం వహించింది. అప్పట్లోనే వేలాది మంది పాఠకులు తమ డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు తాజా లేఆఫ్స్‌తో పత్రిక ప్రతిష్ట మరింత మసకబారుతోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


