Jio IPO date : రూ. 37,700 కోట్ల జియో ఐపీఓకు వేళాయె.. దసరా, దీపావళికి మార్కెట్లలో సరికొత్త సంచలనం!

భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఆఫరింగ్​గా నిలవనున్న జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 37,700 కోట్ల ఐపీఓ అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే సెబీ ఆమోదం పొందిన ఈ మెగా ఐపీఓ పండగల సీజన్‌లో ఇన్వెస్టర్లకు పండగ వాతావరణం తేనుంది.

Published on: Sep 4, 2026, 10:01:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ స్టాక్​ మార్కెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికాం విభాగానికి చెందిన 'జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్' అత్యంత భారీ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సిద్ధమవుతోంది. సుమారు 4 బిలియన్ డాలర్ల (రూ. 37,700 కోట్లు) సమీకరించడమే లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓ.. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో సబ్‌స్క్రిప్షన్ కోసం మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

జియో ఐపీఓ లేటెస్ట్ అప్డేట్స్.. (Photo: AI generated )
జియో ఐపీఓ లేటెస్ట్ అప్డేట్స్.. (Photo: AI generated )

అక్టోబర్ మూడవ వారంలో మొదలయ్యే నవరాత్రుల పండుగ సమయాన్ని (అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 దసరా వరకు)జియో ఐపీఓ ప్రారంభానికి అనువైనదిగా కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగితే, నవంబర్ మొదటి వారంలో ధంతేరస్ (నవంబర్ 6), దీపావళి (నవంబర్ 8) పండగల శుభసమయాన్ని మరో విండోగా వినియోగించుకోవాలని రిలయన్స్ యోచిస్తోందని సమాచారం.

అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో సుదీర్ఘ రోడ్‌షోలు

జియో ఐపీఓ తేదీలు, ప్రైజ్ బ్యాండ్‌ను రాబోయే రెండు వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్ అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉంది. దీనికి ముందస్తుగా విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో మూడు వారాల పాటు, ఆ తర్వాత దేశీయ ఇన్వెస్టర్ల కోసం రెండు వారాల పాటు సంస్థ రోడ్‌షోలు నిర్వహించనుంది. దసరా పండుగ నాటికే రోడ్‌షోలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

జియో ప్లాట్‌ఫామ్స్ ఈ ఏడాది జూన్ నెలలో సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్​హెచ్​పీ)ను పరిశీలించిన మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెబీ' ఆగస్టు 28న ఈ ఇష్యూకు అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఈ ఆమోదంతో అంబానీ గ్రూప్​కి చెందిన జియో ఐపీఓ పనులు మరింత వేగవంతం చేసింది.

భారత ప్రైమరీ మార్కెట్లో సరికొత్త రికార్డు!

ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో రికార్డు స్థాయి నిధులు సమీకరించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా (రూ. 27,870 కోట్లు), ఎల్ఐసీ (రూ. 20,557 కోట్లు) ఐపీఓ రికార్డులను ఈ జియో అధిగమించనుంది. ఒకవేళ అనుకున్న విధంగా రూ. 37,700 కోట్ల మార్కును అందుకుంటే, దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా జియో ప్లాట్‌ఫామ్స్ చరిత్ర సృష్టిస్తుంది.

షేర్ల కేటాయింపు, నిధుల వినియోగం ఎలా?

జియో ప్లాట్‌ఫామ్స్ సమర్పించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ప్రకారం:

కొత్త షేర్ల జారీ: ఈ జియో ఐపీఓ ద్వారా దాదాపు 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఇది ఇష్యూ అనంతరం కంపెనీకి ఉండే మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో దాదాపు 2.9 శాతానికి సమానం. ఇందులో ఎటువంటి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) విభాగం లేదు.

రుణాల చెల్లింపు: ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో దాదాపు రూ. 27,500 కోట్లను తమ ప్రధాన సబ్సిడరీ సంస్థ ‘రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్’ పేరున ఉన్న పాత రుణాలను ముందుగానే చెల్లించడానికి ఉపయోగిస్తారు.

కార్పొరేట్ అవసరాలు: మిగిలిన నిధులను కంపెనీ సాధారణ కార్పొరేట్ అవసరాలు, భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టుల కోసం కేటాయించనున్నారు.

దిగ్గజ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు..

జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ, ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. కంపెనీలో దాదాపు 30.9 శాతం వాటా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల చేతుల్లోనే ఉంది.

మెటా : జాధూ హోల్డింగ్స్ ద్వారా 9.98% వాటా.

గూగుల్ : గూగుల్ ఇంటర్నేషనల్ ద్వారా 7.73% వాటా.

ఇతర ఇన్వెస్టర్లు: సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్), సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) వంటి సంస్థలు ప్రాధాన్య భాగస్వాములుగా ఉన్నాయి.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లలో డిజిటల్ టెక్నాలజీ, టెలికాం విభాగానికి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ఈ ఐపీఓ రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ప్రపంచ ఆర్థిక సంస్థలను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆర్థిక రంగానికి చెందిన విశ్లేషకులు భావిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More