Jio : జియో అంటే సిమ్‌లు మాత్రమే కాదు.. అంతకు మించి! డేటా విప్లవం నుంచి AI సామ్రాజ్యం వరకు..
భారత డిజిటల్ స్వరూపాన్ని మార్చేసి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న రిలయన్స్ జియో, కేవలం టెలికాం నెట్‌వర్క్‌గానే కాకుండా ఏఐ, క్లౌడ్, కంప్యూటింగ్ శక్తిగా రూపాంతరం చెందింది. 52 కోట్ల మందికి పైగా కస్టమర్లతో దేశంలోనే తిరుగులేని టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన జియో ప్రయాణంపై ప్రత్యేక విశ్లేషణ..
సెప్టెంబర్ 2016లో ఉచిత కాల్స్, చౌకైన 4జీ డేటాతో భారత టెలికాం రంగాన్ని కుదిపేసిన రిలయన్స్ జియో.. నేడు ప్రతి భారతీయుడి స్మార్ట్‌ఫోన్‌కు కేవలం నెట్‌వర్క్ కనెక్షన్ మాత్రమే కాదు! పదేళ్ల నిరంతర ప్రయాణంలో 'జియో ప్లాట్‌ఫామ్స్' ఒక బహుముఖ టెక్నాలజీ శక్తిగా అవతరించింది. నెట్‌వర్క్ ఇంజనీరింగ్, డివైజ్ డిజైనింగ్, క్లౌడ్ స్టోరేజ్ నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వరకు విస్తరించిన ఈ డిజిటల్ దిగ్గజం.. నేడు 52 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. భారతీయులకు డిజిటల్ ప్రపంచాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా, ప్రతి ఇంటా డిజిటల్ విప్లవాన్ని నింపడంలో జియో కీలక పాత్ర పోషించింది.

సెప్టెంబర్ 5 2026న జియో 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో.. సంస్థకు చెందిన అనేక టెక్నాలజీలు, ఉత్పత్తులపై ప్రత్యేక కథనం..
రూ. 228 నుంచి రూ. 8కి పడిపోయిన డేటా ధర.. ఆకాశాన్నంటిన వేగం!
జియో రాకముందు భారతదేశంలో ఒక గిగాబైట్ 4జీ డేటా ధర సగటున రూ. 228 వరకు ఉండేది. నేడు అది రూ. 8 లోపుకే లభిస్తోంది! అంతేకాకుండా, అప్పట్లో 2.5 ఎంబీపీఎస్‌గా ఉన్న సగటు డౌన్‌లోడ్ స్పీడ్ నేడు 68 ఎంబీపీఎస్ దాటింది. భారతదేశ వైర్‌లెస్ డేటా ట్రాఫిక్‌లో దాదాపు 60 శాతం ఒక్క జియో నెట్‌వర్క్ ద్వారానే జరుగుతోంది. విశేషమేమిటంటే, ఈ ట్రాఫిక్‌లో 46 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. చైనా మినహా ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ డేటాను మోస్తున్న నెట్‌వర్క్‌గా జియో సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇంటింటికీ గాలి ద్వారానే గిగాబిట్ ఇంటర్నెట్!
కేవలం మొబైల్ ఫోన్లకే పరిమితం కాకుండా గృహాలకు బ్రాడ్‌బ్యాండ్ అందించేందుకు 2019లో జియో ఫైబర్, ఆ తర్వాత జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా ఎటువంటి కేబుల్ వైర్లు లేకుండానే గాలి ద్వారా 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలను తీసుకొచ్చింది. 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 2.7 కోట్లకు పైగా గృహాలు జియో బ్రాడ్‌బ్యాండ్‌ను వినియోగిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా వినియోగదారులు జియోఎయిర్‌ఫైబర్ ద్వారానే కనెక్ట్ అవ్వడం విశేషం. భారత్‌లో కొత్తగా వస్తున్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో మూడింట రెండు వంతులు జియో ఖాతాలోనే పడుతున్నాయి.

టీవీలనే కంప్యూటర్లుగా మారుస్తున్న డిజిటల్ గేట్‌వే!
ఒక్క మొబైల్ యాప్ 'MyJio' ద్వారా షాపింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న జియో.. జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా సాదాసీదా టీవీని గేమింగ్ కన్సోల్‌గా, కంప్యూటర్‌గా మార్చేసింది. 'JioPC' ద్వారా పర్సనల్ కంప్యూటర్ లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు టీవీ ద్వారానే పూర్తిస్థాయి కంప్యూటర్ అనుభూతిని అందిస్తోంది.
అలాగే, ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌లోనే ఉండిపోయిన 26 కోట్ల మంది సాధారణ ఫోన్ వినియోగదారుల కోసం సొంతంగా డిజైన్ చేసిన 'JioBharat' స్మార్ట్ ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చి, వారికి యూపీఐ చెల్లింపులు, వీడియో స్ట్రీమింగ్ సౌకర్యాన్ని కల్పించింది.

ప్రతి ఇంటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్..
ఏఐ సాంకేతికతను కేవలం సంపన్నులకే కాకుండా సామాన్యులకు సైతం చేరువ చేస్తోంది జియో. 'JioAICloud' ద్వారా ఫోటోలు, వీడియోలను ఫేస్ రికగ్నిషన్‌తో ఆటోమేటిక్‌గా క్రమబద్ధీకరించే వెసులుబాటు కల్పించింది. గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని జియో అపరిమిత 5జీ వినియోగదారులకు 18 నెలల పాటు 'Google AI Pro' ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా, నెట్‌వర్క్‌లో తలెత్తే సాంకేతిక లోపాలను కస్టమర్ గుర్తించడానికి ముందే సరిదిద్దేందుకు 'JioBrain' అనే ఏఐ ఇంజిన్‌ను స్వయంగా అభివృద్ధి చేసుకుంది.
మీకు తెలియకుండానే మీరు జియోను వాడుతున్నారు!
జియో సేవలు కేవలం సామాన్య వినియోగదారులకే కాకుండా దేశీయ మౌలిక వసతుల రంగానికి వెన్నుముకగా నిలిచాయి.
- భారత్‌లోని 90 శాతానికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు జియో కనెక్టివిటీనే వాడుతున్నాయి.
- దేశంలోని 80 శాతానికి పైగా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కాంలు) జియో సెన్సార్ నెట్‌వర్క్‌పైనే పనిచేస్తున్నాయి.
- దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాలలో 75 శాతానికి పైగా ఎయిర్‌పోర్టులకు జియోనే కనెక్టివిటీ అందిస్తోంది.
- ఇండియన్ రోడ్లపై తిరిగే ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో దాదాపు సగం వాహనాలు జియో కనెక్టివిటీ ఆధారంగానే నడుస్తున్నాయి.
భారతీయ సాంకేతికతతో స్వదేశీ ఆవిష్కరణలు..
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో 5జీ స్టాండలోన్ నెట్‌వర్క్‌ను నిర్మించిన ఐదవ దేశంగా భారత్‌ను జియో నిలిపింది. 4జీ, 5జీ, 6జీ కోర్ నెట్‌వర్క్ డిజైనింగ్, ఏఐ ఆటోమేషన్ విభాగాల్లో జియో ఇప్పటివరకు 6,800కి పైగా పేటెంట్ అప్లికేషన్లను దాఖలు చేసింది. 2025లో ప్రపంచంలోనే అత్యధిక పేటెంట్లు దాఖలు చేసిన టాప్-20 సంస్థలలో ఒకటిగా నిలిచింది.
కేవలం చౌకైన డేటాతో ప్రారంభమైన జియో పది సంవత్సరాల ప్రయాణం, నేడు అంతరిక్ష స్థాయి టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది వేసింది. రాబోయే దశాబ్దం కేవలం కనెక్టివిటీకి మాత్రమే పరిమితం కాకుండా, సంపూర్ణ 'కృత్రిమ మేధస్సు' మయంగా మారబోతోందని జియో స్పష్టం చేస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


