...
...
Next Story

జియో సంచలనం: 21% ప్రీమియంతో దలాల్ స్ట్రీట్‌లో గ్రాండ్ ఎంట్రీ

దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన జియో ప్లాట్‌ఫార్మ్స్ షేర్లు బుధవారం బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలలో 21 శాతం ప్రీమియంతో రూ.1,358 వద్ద ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 108.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Published on: Oct 28, 2026, 10:16:34 IST
Advertisement

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికాం విభాగం 'జియో ప్లాట్‌ఫార్మ్స్' షేర్లు బుధవారం దలాల్ స్ట్రీట్‌లో రికార్డు ప్రీమియంతో ఘనంగా ఎంట్రీ ఇచ్చాయి. ఇష్యూ ధర రూ.1,119 తో పోలిస్తే బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలలో ఏకంగా 21 శాతం లాభంతో రూ.1,358 వద్ద ఈ షేర్లు ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ మైలురాయితో సంస్థ మార్కెట్ మూల్యాంకనం 108.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రిలయన్స్ గ్రూప్ నుంచి గత రెండు దశాబ్దాలలో ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడం ఇదే తొలిసారి.

గ్లోబల్ దిగ్గజాల మద్దతు.. 53 కోట్ల మంది వినియోగదారులు

జియో సంచలనం: 21% ప్రీమియంతో దలాల్ స్ట్రీట్‌లో గ్రాండ్ ఎంట్రీ
జియో సంచలనం: 21% ప్రీమియంతో దలాల్ స్ట్రీట్‌లో గ్రాండ్ ఎంట్రీ

మెటా ప్లాట్‌ఫార్మ్స్, గూగుల్ (ఆల్ఫాబెట్) వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాల పెట్టుబడులు ఉన్న జియో ప్లాట్‌ఫార్మ్స్, ప్రస్తుతం 53 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తోంది. ఈ రికార్డు స్థాయి లిస్టింగ్‌తో భారత మార్కెట్ క్యాపిటలైజేషన్ రేసులో జియో అత్యంత విలువైన కంపెనీల సరసన చేరింది. కేవలం చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారాలకే పరిమితమైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వినియోగదారు, సాంకేతిక రంగాల మహావృక్షంగా తీర్చిదిద్దాలనే ముకేశ్ అంబానీ వ్యూహంలో ఈ ఐపీఓ కీలక ఘట్టంగా నిలిచింది.

ఈ చారిత్రాత్మక ఘట్టానికి ముంబైలోని స్టాక్ ఎక్స్ఛేంజ్ వేదిక సాక్ష్యంగా నిలిచింది. ఈ లిస్టింగ్ వేడుకలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో పాటు ఆయన సతీమణి నీతా అంబానీ, జియో మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ, కుమార్తె ఈశా అంబానీ, చిన్న కుమారుడు ఆనంత్ అంబానీ పాల్గొన్నారు.

భావోద్వేగానికి లోనైన ముకేశ్ అంబానీ

ఈ వేడుకలో అనంత్ అంబానీ మాట్లాడిన తీరు సభలోని వారందరినీ ఆకట్టుకుంది. గుజరాత్‌లోని చోర్వాడ్‌లోని చిన్న ఇల్లు నుంచి ఏడెన్ పెట్రోల్ పంపు వరకు ధీరూభాయ్ అంబానీ పడిన కష్టాలను, ఆ తర్వాత రిలయన్స్, జియో ఆవిర్భావం వరకు సాగిన ప్రయాణాన్ని ఆనంత్ వివరించారు. తండ్రి శ్రమను, తాతయ్య ఆశయాలను తన కొడుకు వేదికపై వివరిస్తుంటే ముకేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఐపీఓ మార్కెట్లో భారత్ హవా

ఈ సంవత్సరంలో ఐపీఓల సంఖ్య పరంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న మార్కెట్‌గా భారత్ నిలిచింది. ఎల్‌ఎస్‌ఈజీ (LSEG) డేటా ప్రకారం, ఇప్పటివరకు భారత్‌లో 246 ఐపీఓలు వచ్చి 13.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. నిధుల సేకరణలో అమెరికా, చైనా, హాంకాంగ్‌ల తర్వాత భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది.

బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ

జియో ప్లాట్‌ఫార్మ్స్ 108.3 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్‌ను పలు అంతర్జాతీయ, దేశీయ బ్రోకరేజ్ సంస్థలు ఆకర్షణీయమైనదిగా అభివర్ణించాయి. భవిష్యత్తులో ఈ షేరు మరింతగా రాణించే అవకాశముందని అంచనా వేశాయి. అయితే, టెలికాం రంగంలో తీవ్ర పోటీ, నెట్‌వర్క్ విస్తరణకు అయ్యే భారీ మూలధన వ్యయం (క్యాపెక్స్), స్పెక్ట్రమ్, లైసెన్సింగ్ ఫీజులకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనల్లో వచ్చే మార్పులు ఈ రంగానికి ప్రధాన సవాళ్లుగా నిలుస్తాయని విశ్లేషకులు స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks