...
...
Next Story

భౌగోళిక రిస్క్‌లు, చమురు షాక్‌లను మార్కెట్లు సరిగ్గా అంచనా వేయలేదా?: బరోడా బీఎన్‌పీ పారిబాస్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెంపు వల్ల ముంచుకొచ్చే రిస్క్‌లను భారత ఈక్విటీ మార్కెట్లు ఇంకా పూర్తిగా డిస్కౌంట్ చేయలేదని బరోడా బీఎన్‌పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ జితేంద్ర శ్రీరామ్‌ విశ్లేషించారు.

Published on: Oct 14, 2026, 11:57:22 IST
Advertisement

భారత ఈక్విటీ మార్కెట్ ప్రస్తుతం అంతర్జాతీయ అనిశ్చిత వాతావరణం, ఎగిసిపడుతున్న ముడి చమురు ధరలు, కరెన్సీ ఒడిదుడుకులు, కార్పొరేట్ ఆదాయాల వృద్ధిపై ఆందోళనల నడుమ పయనిస్తోంది. వీటిలో కొన్ని ప్రతికూలతలు ఇప్పటికే మార్కెట్ విలువల్లో (వాల్యుయేషన్లలో) ప్రతిబింబించినప్పటికీ, ఇన్వెస్టర్లు ఇంకా పూర్తిస్థాయిలో గుర్తించని కొన్ని ప్రమాద హెచ్చరికలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం 2027 ద్వితీయార్థంలో (H2FY27) కార్పొరేట్ ఆదాయాల వృద్ధి అంచనాలు ప్రథమార్థంతో పోలిస్తే కొంత మితంగానే ఉన్నాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. చమురు మంటలు

బరోడా బీఎన్‌పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ జితేంద్ర శ్రీరామ్‌
బరోడా బీఎన్‌పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ జితేంద్ర శ్రీరామ్‌

ప్రస్తుతం మార్కెట్లు ఇంకా పూర్తిగా అంచనా వేయని కీలకమైన అంశాల్లో పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు ఒకటి.

ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిలో కొనసాగితే అది కేవలం ఇంధన వ్యయాల పెంపుకే పరిమితం కాదు.. ప్రపంచ ఆర్థిక వృద్ధిని మందగింపజేసి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం పెరగడం అనే ఈ రెండింటి కలయికను ప్రస్తుతం మార్కెట్లు పూర్తిస్థాయిలో అంచనా వేయకపోవచ్చు.

భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం

భారత్ తన ఇంధన అవసరాల కోసం ప్రధానంగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల భారం దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రూడాయిల్ నిరంతరం పెరిగితే ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ క్షీణత, కంపెనీల ఉత్పత్తి వ్యయాలు పెరగడమే కాకుండా సామాన్య కుటుంబాల కొనుగోలు శక్తి పడిపోతుంది. భారత్ ఇప్పటికే ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యమిస్తోంది. అయితే ఈ మార్పులు రాత్రికి రాత్రే సాధ్యం కావు కాబట్టి, ఈ మధ్యంతర కాలంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు.

కార్పొరేట్ ఆదాయాలు.. జీఎస్‌టీ కోతల ప్రభావం

2025 సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ కోతలు ఆర్థిక సంవత్సరం 2026 మూడో, నాలుగో త్రైమాసికాల్లో (Q3, Q4 FY26) డిమాండ్‌ను గణనీయంగా పెంచాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, వైట్ గూడ్స్, ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే గతేడాది నమోదైన ఈ భారీ సేల్స్ కారణంగా బేస్ ఎఫెక్ట్ పెరిగింది. ఫలితంగా, ఆర్థిక సంవత్సరం 2027 ద్వితీయార్థంలో (H2FY27) ఏడాది ప్రాతిపదికన నమోదయ్యే ఆదాయాల వృద్ధి కొంత మితంగా కనిపించే అవకాశముంది.

డీఐఐల నిధుల మద్దతు.. కరెన్సీ స్థిరత్వం

అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు రూపాయి మారకం విలువ మరో ముఖ్యమైన అంశం. రూపాయి బలహీనపడితే వారి రాబడులు క్షీణిస్తాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విజయవంతంగా నిర్వహించిన ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) [FCNR(B)] ప్రోగ్రామ్ రూపాయి పట్ల ఉన్న ప్రతికూల సెంటిమెంట్‌ను తగ్గించడానికి దోహదపడింది.

పెట్టుబడి అవకాశాలు: ఫార్మాపై ప్రత్యేక దృష్టి

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కేవలం మార్కెట్ ఊపును (మొమెంటమ్) అనుసరించడం కంటే స్థిరమైన, ముందస్తుగా అంచనా వేయగలిగే ఆదాయ వృద్ధిని ఇచ్చే రంగాలపై దృష్టి పెట్టాలి.

ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు ఆర్థిక మాంద్య ప్రభావానికి తక్కువగా గురవుతాయి. హెల్త్‌కేర్ ఉత్పత్తులు, సేవలకు మార్కెట్‌లో నిరంతరం డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ రంగానికి మేము అధిక ప్రాధాన్యత (Overweight) ఇస్తున్నాం.

కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ (CDMO), బయోసిమిలర్స్, పెప్టైడ్స్ వంటి విభాగాల్లో దీర్ఘకాలికంగా గణనీయమైన అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు యుటిలిటీస్, టెలికాం రంగాలు కూడా దేశీయ డిమాండ్ ఆధారంగా నడిచేవి కాబట్టి మెరుగైన పురోగతి సాధించవచ్చు. ఐటీ రంగానికి కరెన్సీ క్షీణత లాభించినప్పటికీ, కృత్రిమ మేధ (AI) తెస్తున్న మార్పులు ప్రతికూల సవాలుగా మారే అవకాశముంది.

యూఎస్ బాండ్ ఈల్డ్స్.. ఫెడ్ రేట్లు

అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించే పాలసీ వడ్డీ రేట్లకు, మార్కెట్ అంచనాల ఆధారిత బాండ్ ఈల్డ్స్‌కు మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణంలో తాత్కాలిక పెరుగుదలలు చోటుచేసుకుంటున్న వేళ ఈ రెండింటి మధ్య వ్యత్యాసంపై చర్చ కొనసాగే అవకాశం ఉంది.

సుదీర్ఘకాల దృక్పథం అవసరం

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో స్వల్పకాలిక అనిశ్చితికి, దీర్ఘకాలిక నిర్మాణాత్మక అవకాశాలకు మధ్య తేడాను ఇన్వెస్టర్లు గుర్తించాలి. ఈ దశలో మార్కెట్ మొమెంటమ్‌ను గుడ్డిగా అనుసరించకుండా, ఆదాయాలపై స్పష్టమైన అంచనా, స్థిరత్వం ఉన్న బలమైన వ్యాపార నమూనాలు కలిగిన రంగాలను ఎంచుకోవడమే శ్రేయస్కరం.

వ్యాసకర్త:

జితేంద్ర శ్రీరామ్‌,

సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌,

బరోడా బీఎన్‌పీ పారిబాస్‌ మ్యూచువల్‌ ఫండ్‌

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks