...
...
Next Story

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంచలన రాజీనామా.. రేసులో ఆండీ బర్న్‌హామ్

బ్రిటన్ ప్రధానమంత్రి, లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీలోనే వ్యతిరేకత తీవ్రం కావడంతో డౌనింగ్ స్ట్రీట్ వేదికగా ఆయన ఈ సంచలన ప్రక్రియకు తెరలేపారు.

Published on: Jun 22, 2026, 20:36:41 IST
Advertisement

బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి పెద్ద అలజడి రేగింది. బ్రిటన్ ప్రధానమంత్రి, లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ (63) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. రాబోయే కొద్ది వారాల్లో కొత్త నాయకుడి ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. సెప్టెంబర్ నాటికి కొత్త ప్రధాని బాధ్యతలు చేపడతారు.

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంచలన రాజీనామా.. రేసులో ఆండీ బర్న్‌హామ్ (AP Photo/Thomas Krych)
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంచలన రాజీనామా.. రేసులో ఆండీ బర్న్‌హామ్ (AP Photo/Thomas Krych)

అంతవరకు తానే ప్రధానిగా కొనసాగుతానని స్టార్మర్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికయ్యే నాయకుడికి తన పూర్తి మద్దతు ఉంటుందని, అధికార మార్పిడి సజావుగా సాగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ప్రధాని రేసులో ఆండీ బర్న్‌హామ్ ముందంజ

గత వారం జరిగిన కీలక ఉపఎన్నికలో విజయం సాధించి, సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్ లోకి అడుగుపెట్టిన ఆండీ బర్న్‌హామ్ (56) ప్రధాని రేసులో అందరికంటే ముందున్నారు. "ఈ ఎన్నిక ప్రక్రియలో నేను కూడా పోటీ పడతాను," అని బర్న్‌హామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై స్టార్మర్ నిలబడి భావోద్వేగంగా మాట్లాడారు.

"రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని నడిపించడానికి నేనే సరైన వ్యక్తినా కాదా అని నా పార్లమెంటరీ పార్టీ ప్రశ్నిస్తోంది. వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ శ్రేయస్సు కోసమే. అందుకే లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను" అని స్టార్మర్ పేర్కొన్నారు. అంతకుముందు ఆయన కింగ్ చార్లెస్ IIIతో మాట్లాడి తన నిర్ణయాన్ని తెలియజేశారు.

ఎన్నికల షెడ్యూల్ ఖరారు

కొత్త నాయకుడి ఎంపిక కోసం టైమ్‌టేబుల్‌ను ఖరారు చేయాలని లేబర్ పార్టీ జాతీయ కార్యవర్గాన్ని (NEC) స్టార్మర్ కోరారు. జూలై 9 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వేసవి సెలవులు (జూలై 17) ప్రారంభమయ్యే నాటికే ఈ ప్రక్రియ ముగియనుంది.

"నేను రెండేళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించినప్పటి కంటే ఇప్పుడు బ్రిటన్ మరింత బలంగా, నిలకడగా ఉంది. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు, లేబర్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు పూర్తి సహకారం అందిస్తాను" అని స్టార్మర్ ధీమా వ్యక్తం చేశారు.

జూలై 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని భారీ విజయతీరాలకు చేర్చిన స్టార్మర్, ప్రారంభంలో మంచి ప్రజాదరణ పొందారు. అయితే ఇటీవల తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల ఆయన రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

ఆరు సంవత్సరాల క్రితం రాజకీయంగా, ఆర్థికంగా దివాళా తీసిన పార్టీని తానే నిలబెట్టానని, గత ఎన్నికల్లో 174 స్థానాల భారీ మెజారిటీతో విమర్శకుల నోళ్లు మూయించానని స్టార్మర్ గుర్తు చేసుకున్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ద్రవ్యోల్బణం కంటే వేగంగా వేతనాలు పెంచడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి విజయాలను ఆయన వివరించారు.

ఇదే సమయంలో తన కుటుంబం గురించి ప్రస్తావిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. "దేశంలోనే అత్యంత కీలకమైన పదవి నుంచి తప్పుకున్నాక, నా భార్య విక్, పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తాను" అని భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రధాని పదవిని ముంచిన వివాదాలు

స్టార్మర్ పదవి కోల్పోవడానికి ప్రధాన కారణం పీటర్ మండెల్సన్‌ను అమెరికా రాయబారిగా నియమించడమే. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో మండెల్సన్‌కు ఉన్న సంబంధాల వల్ల తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు మండెల్సన్‌ను తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

దీనికి తోడు సంక్షేమ సంస్కరణలు, పన్నులు, సామాజిక ప్రయోజనాలపై తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, యూ-టర్న్‌ల వల్ల క్యాబినెట్ మంత్రులే ఆయనను పక్కకు తప్పుకోవాలని సూచించారు.

బ్రిటన్ నాయకత్వ రేసులో మాజీ ఆరోగ్య కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ కూడా పోటీ పడే అవకాశం ఉంది. అభ్యర్థులకు కనీసం 20 శాతం ఎంపీల మద్దతుతో పాటు 5 శాతం నియోజకవర్గ లేబర్ పార్టీలు లేదా మూడు అనుబంధ సంఘాల మద్దతు తప్పనిసరి. స్టార్మర్ రాజీనామాతో బ్రిటన్ గత పదేళ్లలో ఏడో ప్రధానిని చూడబోతోంది.

భారత్‌తో కుదిరిన ఒప్పందంపై ప్రభావం ఎంత?

రాజీనామాకు కొన్ని రోజుల ముందే ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 ససస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్టార్మర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూలై 15 నుంచి అమలులోకి రానుందని ఇద్దరు నేతలు ప్రకటించారు.

48 బిలియన్ పౌండ్ల విలువైన ఈ భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) అమలులోకి వచ్చే సమయానికే బ్రిటన్‌కు కొత్త ప్రధాని రానుండటం గమనార్హం.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks