Kia Sorento : ఇట్స్ అఫీషియల్! ఇండియాలోకి కియా లగ్జరీ ఎస్​యూవీ- 'సోరెంటో' ఎలా ఉంటుందంటే..

Kia Sorento India : కియా ఇండియా తన ప్రీమియం ఎస్‌యూవీ 'సోరెంటో'ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సెల్టోస్ కంటే పవర్‌ఫుల్‌గా వచ్చే ఈ 3-రో ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jul 30, 2026, 14:03:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్'.. వాహన ప్రియులకు అదిరిపోయే వార్త చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో పాపులర్ అయిన తన గ్లోబల్ మోడల్ 'సోరెంటో' ఎస్‌యూవీని భారత్‌లోకి ప్రవేశపెడుతున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. దీనికి సంబంధించి తొలి టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం విక్రయిస్తున్న సెల్టోస్ కంటే పైన, కంపెనీలోనే అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) ఎస్‌యూవీగా ఇది భారత రోడ్లపైకి రానుంది.

ఇండియాలోకి రాబోతున్న కియా సోరెంటో..
ఇండియాలోకి రాబోతున్న కియా సోరెంటో..

రహదారిపై మెరిసే ఈ లగ్జరీ ఎస్‌యూవీ టీజర్‌లో ఎక్కువ వివరాలు వెల్లడించకపోయినప్పటికీ, భారతదేశంలో తన ప్రీమియం ఎస్‌యూవీల విభాగాన్ని మరింత విస్తరించాలనే కియా ప్రణాళికను ఇది స్పష్టం చేస్తోంది. భారత్‌లోకి అడుగుపెట్టాక ఇది స్కోడా కొడియాక్, వోక్స్‌వ్యాగన్ టైరాన్, హోండా జెడ్ఆర్-వీ వంటి ప్రముఖ 3-రో ప్రీమియం కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

డీలర్‌షిప్‌లలో అన్‌అఫీషియల్ బుకింగ్స్ షురూ!

కంపెనీ అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించకముందే, దేశంలోని కొన్ని ప్రధాన కియా డీలర్‌షిప్‌లు సోరెంటో కోసం అనధికారిక ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం. అయితే, కియా ఇండియా జాతీయ స్థాయిలో ఎలాంటి బుకింగ్స్ ప్రారంభించలేదు. ప్రస్తుతం జరుగుతున్నదంతా పూర్తిగా స్థానిక డీలర్ల స్థాయిలో జరుగుతున్న ప్రక్రియే.

డీలర్ వర్గాల సమాచారం ప్రకారం.. షోరూమ్‌ను బట్టి బుకింగ్ అడ్వాన్స్ మొత్తం మారుతోంది. కొన్ని డీలర్‌షిప్‌లలో రూ.51,000 అడ్వాన్స్ తీసుకుంటుండగా, మరికొన్ని చోట్ల రూ.1,00,000 వరకు అడుగుతున్నారు. కాబట్టి కస్టమర్లు ముందస్తు చెల్లింపులు చేసే ముందు రీఫండ్ పాలసీ, బుకింగ్ నిబంధనలను తమ సమీప డీలర్‌తో స్పష్టంగా సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కియా సోరెంటో వెయింటింగా పీరియడ్ 6 నుంచి 8 నెలల వరకు ఉండవచ్చని, 2026 అక్టోబర్ నాటికి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని డీలర్లు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కియా లాంచ్ ప్లాన్లు, ఉత్పత్తి షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది.

భారత్‌లోనే అసెంబ్లింగ్.. ధరకు కలిసొచ్చే అంశం!

కియా ఈ సోరెంటో ఎస్‌యూవీని భారతదేశంలోనే అసెంబుల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల దిగుమతి సుంకాలు తగ్గి, ప్రీమియం 3-రో ఎస్‌యూవీ విభాగంలో మిగిలిన కార్లకు పోటీగా అందుబాటు ధరలోనే దీనిని తీసుకొచ్చేందుకు కియాకు వీలవుతుంది.

హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు?..

భారత మార్కెట్ కోసం ఇంజిన్ వివరాలను కియా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ సోరెంటోను స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో తీసుకొచ్చే అవకాశముంది.

హైబ్రిడ్ వేరియంట్: గ్లోబల్ మార్కెట్లో ఉన్న హైబ్రిడ్ మోడల్ 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. ఇది సంయుక్తంగా 230 హెచ్​పీ పవర్, 380 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

డీజిల్ వేరియంట్: విదేశాల్లో విక్రయిస్తున్న డీజిల్ మోడల్‌లో 2.2-లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 202 హెచ్​పీ పవర్, 440 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇంటర్నేషనల్ వెర్షన్లలో ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. భారత్‌లో ఏ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తారో చూడాలి.

మూడు సీటింగ్ లేఅవుట్లలో లభ్యం!

ఈ ప్రీమియం ఎస్‌యూవీలో మరొక విశేషం ఏంటంటే.. సీటింగ్ ఫ్లెక్సిబిలిటీ. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా దీనిని 5-సీటర్, 6-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

పవర్ఫుల్ లుక్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రానున్న ఈ కియా ఫ్లాగ్‌షిప్ కార్ భారత్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More