Kia Sorento : కియా నుంచి కొత్త 7 సీటర్​ ఎస్​యూవీ- సోరెంటో బుకింగ్స్​ షురూ! లాంచ్​ ఎప్పుడు?

Kia Sorento India launch : కియా సోరెంటో అన్​-అఫీషియల్ బుకింగ్స్​ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ 7 సీటర్​ ఎస్​యూవీ లాంచ్​ టైమ్​లైన్​, ఫీచర్స్​, ఇంజిన్ ఆప్షన్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jul 20, 2026, 06:45:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సైరోస్​ ఈవీ లాంచ్​తో మంచి జోరు మీదున్న దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్​.. ఇప్పుడు ఇండియాలో మరో మోడల్​ని లాంచ్​ చేసేందుకు శరవేగంగా ప్లాన్స్​ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో మంచి విజయం సాధించిన తన ప్రీమియం ఎస్‌యూవీ ‘కియా సోరెంటో’ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. 2026 దీపావళి పండుగ సీజన్ కానుకగా ఈ సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీని విక్రయానికి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడక ముందే, కొన్ని కియా డీలర్‌షిప్‌లు ఈ ఎస్​యూవీ కోసం ముందస్తు బుకింగ్స్‌ను కూడా స్వీకరించడం ప్రారంభించాయి.

కియా సోరెంటో ఎస్​యూవీ..
కియా సోరెంటో ఎస్​యూవీ..

లీకైన సమాచారం ప్రకారం.. సరికొత్త, 7 సీటర్ కియా సోరెంటో భారత మార్కెట్లో రెండు పవర్‌ట్రెయిన్ (ఇంజిన్) ఆప్షన్లతో లభించనుంది. ఇందులో ఒకటి 1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. అంతర్జాతీయ మోడల్‌ తరహాలోనే, ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో 1.6 లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ టీ-జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి తోడు 59 బీహెచ్‌పీ సామర్థ్యం గల పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్, 1.49 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను జత చేశారు. ఈ పూర్తి సెటప్ కలిపి గరిష్టంగా 227 బీహెచ్‌పీ పవర్‌ను, 350 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పవర్‌ఫుల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్..

ఈ 1.6 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ తక్కువ ఆర్‌పీఎమ్ వద్దే అద్భుతమైన టార్క్‌ను అందిస్తుంది. దీనివల్ల టర్బో లాగ్ (వేగం అందుకోవడంలో ఆలస్యం) చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, పర్యావరణానికి హాని చేసే కార్బన్ ఉద్గారాలు కూడా చాలా తక్కువగా విడుదలవుతాయి. గ్లోబల్ మార్కెట్లో ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను మాత్రమే జత చేశారు. ఈ ఎస్‌యూవీ ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే, భారత మార్కెట్లోకి కియా ఏ వెర్షన్‌ను తీసుకొస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు, డీజిల్ ప్రియుల కోసం రానున్న సోరెంటో వెర్షన్‌లో 2.2 లీటర్ సీఆర్‌డీఐ టర్బో ఇంజిన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 202 బీహెచ్‌పీ శక్తిని, 450 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఇంజిన్‌తో పాటు హ్యుందాయ్-కియాకు చెందిన 8-స్పీడ్ వెట్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు.

కియా సొరెంటో డైమెన్షన్స్, సీటింగ్ సామర్థ్యం..

కొలతల పరంగా చూస్తే, ఈ సరికొత్త కియా హైబ్రిడ్ ఎస్‌యూవీ 4,815 ఎంఎం పొడవు, 1,900 ఎంఎం వెడల్పు, 1,700 ఎంఎం ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,815 మిమీగా ఉంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ కారు 6-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 6-సీటర్ వెర్షన్‌లో రెండవ వరుసలో లగ్జరీ కెప్టెన్ సీట్లు వస్తాయి. అదే 7-సీటర్ మోడల్‌లో అయితే రెండవ వరుసలో సాధారణ బెంచ్ తరహా సీటింగ్ ఉంటుంది.

లాంచ్ సమయానికి కంపెనీ అధికారిక ఫీచర్లను వెల్లడిస్తుంది. అయినప్పటికీ, కియా సోరెంటో హైబ్రిడ్ ఎస్‌యూవీలో ప్రీమియం ఫీచర్లకు కొదవ ఉండదని తెలుస్తోంది. ఇందులో డ్యూయల్ 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం), పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, ప్రయాణికుల భద్రత కోసం లెవెల్ 2 అడాస్ సేఫ్టీ సూట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నాయి.

ధర, పోటీదారులు..

కియా సంస్థ ఈ సోరెంటో ఎస్‌యూవీని సీకేడీ పద్ధతిలో విదేశాల నుంచి విడిభాగాలుగా భారత్‌కు తీసుకురానుంది. ఇక్కడి ప్లాంట్‌లోనే దీనిని అసెంబుల్ చేస్తారు. మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో దూసుకుపోతున్న స్కోడా కొడియాక్, ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ మరియు జీప్ మెరిడియన్ వంటి ప్రీమియం కార్లకు ఈ సరికొత్త కియా 7-సీటర్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ లగ్జరీ కారు ధర భారత మార్కెట్లో రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More