Skoda Peaq : 600 కి.మీ రేంజ్​తో స్కోడా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- ‘పీక్’ ఇంటీరియర్​ హైలైట్స్​ ఇవే..

Skoda Peaq launch date in India : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా తన సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'పీక్' లోపలి భాగం ఎలా ఉండబోతోందో అధికారిక స్కెచ్‌ల ద్వారా వెల్లడించింది. జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ కారు ఫీచర్లు, రేంజ్​ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 22, 2026, 05:32:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా.. గ్లోబల్ ఈవీ మార్కెట్లో సరికొత్త సంచలనానికి సిద్ధమవుతోంది. తన అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘స్కోడా పీక్’ను జూన్ 23న ప్రపంచ దేశాల ముందుకు తీసుకురాబోతోంది. అయితే, ఈ గ్రాండ్ లాంచ్‌కు ముందే కారు లోపలి భాగం (క్యాబిన్ డిజైన్) ఎలా ఉండబోతోందో చూపిస్తూ కొన్ని అధికారిక డిజైన్ స్కెచ్‌లను కంపెనీ విడుదల చేసింది. ఈ మోడల్ స్కోడా బ్రాండ్ నుంచి రాబోతున్న అత్యంత పెద్ద ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానుంది. భవిష్యత్తులో ఈ లగ్జరీ ఈవీ భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ కంపెనీకి ఇది ఒక ప్రీమియం మోడల్‌గా నిలవనుంది.

స్కోడా పీక్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ..
స్కోడా పీక్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ..

స్కోడా పీక్- స్పేస్, లగ్జరీకి పెద్ద పీట..

స్కోడా విడుదల చేసిన లేటెస్ట్ డిజైన్ స్కెచ్‌లను గమనిస్తే.. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు లోపల కూర్చునే ప్రయాణికుల సౌకర్యానికి, విశాలమైన స్పేస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. స్కోడా పీక్ కారును మూడు వరుసల సీట్ల లేఅవుట్‌తో 7-సీటర్‌గా డిజైన్ చేశారు. దీని ఇంటీరియర్‌ని ఒక లగ్జరీ లాంజ్ తరహాలో తీర్చిదిద్దారు. డ్యాష్‌బోర్డ్ వెడల్పుగా ఉంటూ, కిటికీల లైన్ చివరి మూడో వరుస వరకు సాగడం వల్ల కారు లోపల చాలా విశాలంగా కనిపిస్తుంది.

దీనితో పాటు కారు పైకప్పు భాగంలో ఇచ్చిన భారీ పనోరమిక్ గ్లాస్ రూఫ్ కారు లోపలి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. సెంటర్ కన్సోల్ తేలియాడుతున్నట్లు (ఫ్లోటింగ్) ఉండేలా డిజైన్ చేయడం, డ్యాష్‌బోర్డ్ పైభాగం ఫ్లాట్‌గా ఉండటం దీనికి మరింత ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చింది.

స్కోడా పీక్- సరికొత్త ‘లాడ్జ్’ ఇంటీరియర్ కాన్సెప్ట్..

స్కోడా పీక్ ఎస్‌యూవీ ద్వారా కంపెనీ తన సరికొత్త 'లాడ్జ్' ఇంటీరియర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తోంది. ఈ డిజైన్‌లో వస్త్రాలంకరణతో కూడిన సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌తో పాటు రోజువారీ వినియోగానికి తట్టుకునేలా అత్యంత మన్నికైన గట్టి పదార్థాలను ఉపయోగించారు. కారు ఇంటీరియర్ సర్ఫేస్‌లు త్వరగా మురికి కాకుండా, సులభంగా శుభ్రం చేసుకునేలా ప్రత్యేక కోటింగ్‌ను అందించినట్లు కంపెనీ పేర్కొంది.

స్కోడాలోనే తొలిసారి.. అదిరిపోయే ఫీచర్లు

కారులో తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు ఏమిటంటే.. నిలువుగా అమర్చిన భారీ ఫ్రీస్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే. స్కోడా చరిత్రలోనే ఇలాంటి వర్టికల్ స్క్రీన్ ఇవ్వడం ఇదే మొదటిసారి. డిజైన్ స్కెచ్‌లలో బటన్లు చాలా తక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. ఏసీ కంట్రోల్స్, ఆడియో వాల్యూమ్, వాహనానికి సంబంధించిన ముఖ్యమైన ఫంక్షన్ల కోసం ఫిజికల్ బటన్లను (ఫిజికల్ కంట్రోల్స్) అలాగే కొనసాగిస్తున్నట్లు స్కోడా స్పష్టం చేసింది.

మరికొన్ని అద్భుతమైన ఫీచర్ల విషయానికి వస్తే:

డ్రైవర్ కోసం చిన్న సైజు డిజిటల్ డిస్‌ప్లే

స్కోడా అక్షరాలతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్

డ్యాష్‌బోర్డ్ అంతటా సాగే ఏసీ వెంట్స్

అడ్జస్ట్ చేసుకునే వీలున్న ఆర్మ్‌రెస్ట్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు

కారు క్యాబిన్ లోపల సామాన్లు పెట్టుకోవడానికి బోలెడన్ని స్టోరేజ్ స్పేస్‌లు

ఇక ముందు సీట్లకు ఇరువైపులా మంచి సపోర్ట్ ఇచ్చేలా బోల్‌స్టర్లను అమర్చారు. ముఖ్యంగా ఫ్రంట్ ప్యాసింజర్ సీటును ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, లాంగ్ జర్నీలో కాళ్లకు హాయిగా ఉండేలా అదనపు సపోర్ట్ ఇచ్చే ఒట్టోమన్-స్టైల్ థై సపోర్ట్‌ను కూడా దీనికి అందించారు.

స్కోడా పీక్- పవర్‌ఫుల్ బ్యాటరీ.. రేంజ్ ఎంతంటే?

స్కోడా పీక్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో తీసుకురాబోతోంది. ఇందులో ఒకటి 63కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కాగా, మరొకటి 91కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. చిన్న బ్యాటరీ వేరియంట్‌లో వెనుక వైపు అమర్చిన మోటార్ గరిష్టంగా 286 బీహెచ్​పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇక పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన టాప్ వేరియంట్లలో డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌ను అందించారు. ఇది ఏకంగా 299 బీహెచ్​పీ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

రేంజ్ పరంగా ఈ కారు ఒకే ఒక్క పూర్తి ఛార్జింగ్‌పై ఏకంగా 600 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో ఈ కారు కేవలం 27 నుంచి 28 నిమిషాల్లోనే 10 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లుగా నిర్ణయించారు!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More