Kia cars : ఇండియా కోసం కియా క్రేజీ ప్లాన్- 10 కొత్త మోడళ్లతో రచ్చ రచ్చ! టాప్​-3 ఇవి..

భారత మార్కెట్లో 2030 నాటికి 10 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని కియా ఇండియా నిర్ణయించింది. ఇందులో 8 ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నాయి. టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీలకు పోటీగా 'సిరోస్ ఈవీ'ని కంపెనీ రంగంలోకి దించుతోంది.

Published on: Jun 23, 2026, 06:44:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న దక్షిణ కొరియా కార్ల దిగ్గజం 'కియా'.. దేశీయంగా తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఒక భారీ వ్యూహాన్ని ప్రకటించింది. 2026 ఇన్వెస్టర్ డే వేదికగా కంపెనీ తన దీర్ఘకాలిక కార్యాచరణను వెల్లడించింది. దీని ప్రకారం.. రాబోయే 2030 నాటికి భారత మార్కెట్లో ఏకంగా 10 సరికొత్త మోడళ్లను లాంచ్ చేయాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 మోడళ్లు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెర్షన్లలో వస్తుండటం విశేషం. ఈ సరికొత్త వ్యూహం ద్వారా భారతదేశంలో ఏడాదికి 4 లక్షల కంటే ఎక్కువ కార్లను విక్రయించాలని కియా భావిస్తోంది.

కియా సైరోస్..
కియా సైరోస్..

ఈ వ్యూహంలో భాగంగానే, భారత ఈవీ మార్కెట్లో దూసుకుపోతున్న టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ ఈవీ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కియా సంస్థ సరికొత్త ‘కియా సైరోస్ ఈవీ’ని సిద్ధం చేస్తోంది.

కియా నుంచి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్!

కియా సంస్థ తన 'కే1' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఈ సరికొత్త సైరోస్ ఈవీని రూపొందిస్తోంది. భారతదేశంలో కియా బ్రాండ్ నుంచి రాబోతున్న అత్యంత చిన్న, అలాగే తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. దీని రెగ్యులర్ పెట్రోల్/డీజిల్ వెర్షన్ లాగే, ఈ ఈవీ కారు కూడా మంచి బాక్సీ లుక్, పొడవాటి టాల్‌బాయ్ స్టాన్స్‌తో (ఎక్కువ ఎత్తుతో) చూడ ముచ్చటగా ఉంటుంది.

అయితే రెగ్యులర్ మోడల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, ఎయిరో ఆప్టిమైజ్డ్​ వంటి వాటితో డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, కారుపై 'EV' బ్యాడ్జీలు దీనికి ప్రత్యేక లుక్‌ను ఇస్తాయి. కారు లోపల క్యాబిన్‌లో కూడా ఈవీ రంగానికి తగినట్లుగా కొన్ని అత్యాధునిక మార్పులు ఉండనున్నాయి.

ఈ కారు ఇంజన్, పవర్‌ట్రెయిన్ వివరాలను లాంచ్ సమయంలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయినప్పటికీ, హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీలో ఉపయోగించే 42కేడబ్ల్యూహెచ్, 49కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లనే ఈ కియా సిరోస్ ఈవీలోనూ వాడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే, కియా సిరోస్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 15 లక్షల నుంచి ప్రారంభమై, టాప్-ఎండ్ వేరియంట్ ధర దాదాపు రూ. 20 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

లైన్‌లోకి రానున్న కియా హైబ్రిడ్ ఎస్‌యూవీలు..

సైరోస్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ తర్వాత, కియా సంస్థ బలమైన పట్టున్న హైబ్రిడ్ విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగా త్రీ-రో (మూడు వరుసల సీట్లు కలిగిన) ప్రీమియం ఎస్‌యూవీ ‘కియా సోరెంటో’, అలాగే పాపులర్ మోడల్ ‘కియా సెల్టోస్ హైబ్రిడ్’ కార్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు.

భారతదేశంలో లాంచ్ కాబోయే సోరెంటో, సెల్టోస్ హైబ్రిడ్ కార్లలో కియాకు మంచి పేరు తెచ్చిపెట్టిన 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌కు ఎలక్ట్రిఫైడ్ టెక్నాలజీని జోడించి అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం యూరప్ మార్కెట్లో అందుబాటులో ఉన్న కియా సోరెంటో మోడల్‌లో 1.6 లీటర్, 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు. అందులోని అన్ని వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా వస్తుంది.

భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత కియా సోరెంటో హైబ్రిడ్ ఎస్‌యూవీ.. మార్కెట్లో ఇప్పటికే ఉన్న స్కోడా కొడియాక్, వోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్, జీప్ మెరిడియన్ వంటి గట్టి కార్లతో పోటీ పడనుంది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. రాబోయే కియా సెల్టోస్ హైబ్రిడ్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ సెల్టోస్ పెట్రోల్/డీజిల్ కార్ల కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పర్యావరణహితమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను ఇష్టపడే భారతీయులకు కియా కొత్త ప్లాన్ ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ కానుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More