Tata Sierra EV : ‘లెజెండ్ ఎలక్ట్రిఫైడ్’- టాటా సియెర్రా ఈవీ ఫస్ట్ ఫొటో ఇదిగో! 30న గ్రాండ్ లాంచ్..
Tata Sierra EV India launch : భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'సియెర్రా ఈవీ' ఫస్ట్ అఫీషియల్ ఇమేజ్‌ని విడుదల చేసింది. జూన్ 30, 2026న లాంచ్ కాబోతున్న ఈ ఐకానిక్ మోడల్ ఫీచర్లు, డిజైన్ వివరాలు ఇప్పుడు చూద్దాము..
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో దూసుకుపోతున్న టాటా మోటార్స్.. తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. తన ఐకానిక్ బ్రాండ్ ‘సియెర్రా’ను ఇప్పుడు సరికొత్త మోడ్రన్ ఎలక్ట్రిక్ రూపంలో కంపెనీ తిరిగి తీసుకురాబోతోంది. ఈ క్రమంలోనే ఎంతోకాలంగా ఆటో ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాటా సియెర్రా ఈవీ’కి సంబంధించిన మొదటి అఫీషియల్ ఇమేజ్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. జూన్ 30, 2026న జరగబోయే గ్రాండ్ లాంచ్‌కు ముందే ఈ కారు ఎలా ఉండబోతోందనే విషయాలను ఈ లుక్ స్పష్టం చేస్తోంది.

తాజాగా విడుదలైన చిత్రం ఈ కారు ఫ్రంట్ ప్రొఫైల్ (ముందు భాగం) ను చూపిస్తోంది. భారత్ మొబిలిటీ షో 2025లో ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌కు చాలా దగ్గరగా, దాదాపు అదే డిజైన్‌తో ప్రొడక్షన్ మోడల్ రాబోతున్నట్లు ఇది సూచిస్తోంది. ఈ కారుకు సంబంధించిన ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వెర్షన్ బాడీ ఆకృతిలోనే ఇది ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం ముందు భాగంలో ప్రత్యేకమైన మార్పులు చేశారు.
ఈ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఈవీలకు మాత్రమే ఉండే క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ (పూర్తిగా మూసివేసిన గ్రిల్), సరికొత్తగా రీడిజైన్ చేసిన నోస్ ఏరియా, సరికొత్త ఫ్రంట్ బంపర్‌ను అందించారు. వీటితో పాటు ఐసీఈ వెర్షన్ తరహాలోనే ఉండే స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, కారుకు రగ్గడ్ లుక్‌ను ఇచ్చే సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తాజాగా విడుదలైన చిత్రం కేవలం ముందు భాగానికి మాత్రమే పరిమితమైనప్పటికీ, గతంలో ప్రదర్శించిన మోడళ్ల ఆధారంగా ఈ కారు మంచి హైట్, వెడల్పుతో రోడ్డుపై పవర్‌ఫుల్ స్టాన్స్‌ను కలిగి ఉండబోతోందని అర్థం చేసుకోవచ్చు. సియెర్రా కారుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పెద్ద పనోరమిక్ రియర్ విండోస్ (వెనుక వైపు పెద్ద గ్లాస్ విండోస్), ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, క్లామ్‌షెల్ టెయిల్‌గేట్, రూఫ్ రెయిల్స్ వంటి ఐకానిక్ ఎలిమెంట్స్ ఇందులోనూ కొనసాగనున్నాయి.
పెట్రోల్/డీజిల్ మోడల్స్ కంటే భిన్నంగా కనిపించడం కోసం ఈ ఈవీ వెర్షన్‌లో ఏరో-ఆప్టిమైజ్డ్ అలాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకమైన ఈవీ బ్యాడ్జింగ్, సూక్ష్మమైన డిజైన్ మార్పులు చేశారు. టాటా పంచ్ ఈవీ, టియాగో ఈవీ తరహాలోనే ఈ కారు కోసం కూడా ప్రత్యేకమైన సరికొత్త కలర్ ఆప్షన్లను టాటా మోటార్స్ పరిచయం చేయనుంది.
టాటా సియెర్రా ఈవీ- లగ్జరీ క్యాబిన్, అత్యాధునిక ఫీచర్లు..
టాటా సియెర్రా ఈవీ లోపలి భాగం (ఇంటీరియర్) వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఈ సియెర్రా ఈవీలో స్క్రీన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అత్యంత లగ్జరీగా ఉండే క్యాబిన్‌ను అందించబోతున్నట్లు సమాచారం.
ఇందులో ఉండబోయే కొన్ని ప్రధాన ఫీచర్లు:
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్
వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా
మూడు స్క్రీన్లతో కూడిన అత్యాధునిక డ్యాష్‌బోర్డ్ లేఅవుట్
డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న 12-స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్
వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) సేఫ్టీ ఫీచర్లు
వీటితో పాటు అవసరమైనప్పుడు ఒక కారు నుంచి మరో కారును ఛార్జ్ చేసుకునే వెహికల్-టు-వెహికల్ (వీ2వీ), ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను నడుపుకునే వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) ఛార్జింగ్ ఫీచర్లను కూడా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఇచ్చే అవకాశం ఉంది.
టాటా సియెర్రా ఈవీ- పవర్‌ఫుల్ ప్లాట్‌ఫారమ్, రేంజ్..
టాటా హారియర్ ఈవీని నిర్మించిన ‘Acti.EV+’ ప్లాట్‌ఫారమ్‌పైనే ఈ సరికొత్త సియెర్రా ఈవీని కూడా రూపొందించారు. బ్యాటరీ, రేంజ్ వివరాలను కంపెనీ ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ, ఇందులో 55 కేడబ్ల్యూహెచ్, 65 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. అలాగే ఇది సింగిల్-మోటార్ (ఫ్రంట్-వీల్ డ్రైవ్), డ్యూయల్-మోటార్ (ఆల్-వీల్ డ్రైవ్) కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది.
భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రాబోతున్న టాటా సియెర్రా ఈవీ, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మహీంద్రా బీఈ6 మోడళ్లతో పాటు రాబోయే రోజుల్లో మారుతీ సుజుకీ, టయోటా నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


