IPL 2026 : ఎట్టకేలకు KKR బోణీ - ఆగని పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర..! ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే..?
ఐపీఎల్ 2026లో ఎట్టకేలకు కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్, అనుకుల్ రాయ్ అద్భుత పోరాటంతో కేకేఆర్ విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రికార్డు స్కోరుతో లక్నోపై గెలుపొందింది.
వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరాటంలో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రింకూ సింగ్ (53 నాటౌట్), అనుకుల్ రాయ్ (29 నాటౌట్) అసాధారణ భాగస్వామ్యంతో జట్టును గెలిపించి…. ఈ సీజన్‌లో తొలి పాయింట్లను అందించారు.

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్‌లోనే టిమ్ సీఫెర్ట్ డకౌట్ కాగా, కెప్టెన్ అజింక్యా రహానే కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
కేవలం 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రింకూ సింగ్, అనుకుల్ రాయ్ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ జంట కేవలం 37 బంతుల్లోనే 76 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను రాజస్థాన్ చేతుల్లోంచి లాగేసుకుంది. రింకూ 34 బంతుల్లో 53 పరుగులు చేయగా, అనుకుల్ రాయ్ 16 బంతుల్లో 29 పరుగులతో రాణించారు. ఆఖరి ఓవర్‌లో రింకూ వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో కేకేఆర్ విజయాన్ని పూర్తి చేశారు.
వరణ్ చక్రవర్తి మాయజాలం..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (46) మరోసారి తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ (39) కూడా రాణించడంతో ఒక దశలో రాజస్థాన్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే కోల్‌కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/14) తన మాయాజాలంతో రాజస్థాన్ మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. సునీల్ నరైన్ కూడా రెండు వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ పేసర్ కార్తీక్ త్యాగి ఇన్నింగ్స్ చివర్లో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను కట్టడి చేశాడు.
పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర… లక్నో మరో ఓటమి
చండీగఢ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో పంజాబ్ భారీ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్, ప్రియాంశ్ ఆర్య (93; 37 బంతుల్లో 4×4, 9×6), కూపర్ కనోలీ((87; 46 బంతుల్లో 8×4, 7×6)) వీరవిహారం చేయడంతో 254 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం.
ప్రియాంశ్ ఆర్య తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్సర్లు బాదగా, కనోలీ 7 సిక్సర్లు, 8 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 200 పరుగులకే పరిమితమైంది. మిచెల్ మార్ష్ (40; 28 బంతుల్లో 3×4, 2×6), రిషబ్ పంత్ (43; 23 బంతుల్లో 1×4, 4×6), మార్‌క్రమ్ (42; 22 బంతుల్లో 3×4, 3×6) పోరాడినా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ జట్టు…. టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మ్యాచ్‌ల్లో పంజాబ్‌కిది అయిదో విజయం కాగా.. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. 6 మ్యాచ్‌ల్లో లఖ్‌నవూకిది నాలుగో ఓటమి.

ఆదివారం(మార్చి 19) నాటి రిపోర్ట్ ప్రకారం… ప్రస్తుతం పంజాబ్ టీమ్ టాప్ ప్లేస్ లో ఉండగా… రెండో స్థానంలో బెంగళూరు ఉంది. ఇక 2 మ్యాచుల్లో ఓడిపోయి… 4 మ్యాచుల్లో గెలిచిన రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. ఇక కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసిన ముంబై ఇండియన్స్ చివరిస్థానంలో ఉన్నారు. ఇవాళ గుజరాత్ - ముంబై మధ్య మ్యాచ్ జరగనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

