200 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ క్రూయిజర్- కోమాకి ఎంఎక్స్16 ప్రో ధర..
కోమాకి ఎంఎక్స్16 ప్రో ఎలక్ట్రిక్ క్రూయిజర్ తాజాగా భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇది అత్యంత స్టైలిష్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ధర, ఫీచర్లు, రేంజ్ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
కోమాకి ఎలక్ట్రిక్ సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ని లాంచ్ చేసింది. దాని పేరు కోమాకి ఎంఎక్స్16 ప్రో. ఇదొక స్టైలిష్ ఎలక్ట్రిక్ క్రూయిజర్! దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1,69,999. రోడ్డుపై ప్రత్యేకమైన ‘ప్రెజెన్స్’, తక్కువ రన్నింగ్ ఖర్చులు, అలాగే ఎక్కువ కాలం మన్నే ధృఢత్వం కోసం చూస్తున్న రైడర్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను రూపొందించారు. ఇది డ్యూయల్ టోన్, జెట్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కోమాకి ఎంఎక్స్16 ప్రో: డిజైన్, బాడీ నాణ్యత..
పూర్తి మెటల్ బాడీతో తయారు చేసిన ఎంఎక్స్16 ప్రో ఎలక్ట్రిక్ బైక్.. ప్రమాదాల సమయంలో దెబ్బతినకుండా ఉండేలా, ఎక్కువ కాలం విశ్వసనీయంగా ఉండేలా ఇంజనీరింగ్ చేయడం జరిగింది. స్థిరమైన, పటిష్టమైన రైడింగ్ అనుభూతిని అందించే లక్ష్యంతో దీన్ని ఒక క్రూయిజర్‌గా కోమాకి సంస్థ తీర్చిదిద్దింది.
ఈ క్రూయీజర్ కోసం స్ట్రెచ్డ్ ఫ్రేమ్, వెడల్పాటి సీటింగ్, తక్కువ వైబ్రేషన్ సెటప్ వంటి వాటిని అందించారు.
కోమాకి ఎంఎక్స్16 ప్రో: పనితీరు, రేంజ్..
ఎంఎక్స్16 ప్రో ఎలక్ట్రిక్ క్రూయిజర్‌లో 5 కిలోవాట్ బీఎల్డీసీ హబ్ మోటార్‌తో పాటు 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీని జత చేశారు.
దీనివల్ల ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కి.మీ నుంచి 220 కి.మీ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.
రైడర్లు సుమారు 200 కి.మీ దూరం ప్రయాణించడానికి కేవలం రూ. 15–20 మాత్రమే ఖర్చవుతుందని కోమాకి హైలైట్ చేసింది. ఇదే దూరం పెట్రోల్ ద్విచక్ర వాహనంపై ప్రయాణించాలంటే సుమారు రూ. 700 వరకు ఖర్చవుతుంది. ఇది రన్నింగ్ కాస్ట్ ఎంత తక్కువగా ఉంటుందో స్పష్టం చేస్తుంది.
ఈ మోటార్ 6.7 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రూయిజర్ గరిష్టంగా 80 కి.మీ./గం వేగాన్ని అందుకోగలదు. వివిధ రకాల రోడ్డు పరిస్థితులలో సాఫీగా పనిచేసే విధంగా టార్క్ను ట్యూన్ చేశారు.
కోమాకి ఎంఎక్స్16 ప్రో: భద్రత, రైడ్ నాణ్యత
బ్రేకింగ్ సమయంలో స్థిరత్వాన్నిపెంచేందుకు ఎంక్స్16 ప్రోలో ట్రిపుల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ని కోమాకి అందించింది.
వెడల్పాటి సీటు, సాఫీ టార్క్ డెలివరీ, సౌకర్యవంతమైన రైడింగ్‌ను అందించే ఫ్రేమ్ అన్నీ కలిసి ఎలాంటి శ్రమలేని రైడింగ్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ తెలిపింది.
కోమాకి ఎంఎక్స్16 ప్రో: ఫీచర్లు
రోజువారీ వినియోగాన్ని మెరుగుపరచడానికి ఎంఎక్స్16 ప్రోలో అనేక సాంకేతిక ఫీచర్లను జోడించారు:
- ఫుల్-కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లే
- బ్లూటూత్ కనెక్టివిటీ
- క్రూయిజ్ కంట్రోల్
- రివర్స్ అసిస్ట్ (వెనక్కి నడపడానికి సహాయం)
- రీజెనరేటివ్ బ్రేకింగ్
- ఆటో-రిపేర్ స్విచ్
- పార్క్ అసిస్ట్ (పార్కింగ్ సహాయం)
ఈ లాంచ్‌పై కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సహ-వ్యవస్థాపకురాలు గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ.. పనితీరు, సాంకేతికత, సౌకర్యాన్ని మిళితం చేసి ఎంఎక్స్16 ప్రోని రూపొందించామని తెలిపారు. ఇది బ్రాండ్‌కు ఒక మైలురాయి లాంటిదన్నారు. ఈ మోడల్ రోజువారీ ప్రయాణాలు, వారాంతపు రైడ్‌లను మరింత ఆనందదాయకంగా మారుస్తుందని అభిప్రాయపడ్డారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


