KTM 200 Duke : సరికొత్త అవతారంలో కేటీఎం 200 డ్యూక్- యూత్ కోరుకునే ఫీచర్లతో!

భారతీయ బైక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ‘కేటీఎం 200 డ్యూక్’ సరికొత్త ఫీచర్లతో త్వరలోనే విపణిలోకి రాబోతోంది. బిగ్ బైక్స్ 390 డ్యూక్‌లో ఉండే క్విక్‌షిఫ్టర్, రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఈ ఎంట్రీ-లెవెల్ బైక్‌లో జతకానున్నాయి.

Published on: Oct 29, 2026, 05:28:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లోని యవతను, బైక్ రైడింగ్ క్రేజ్ ఉన్న కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్న పాపులర్ పర్ఫార్మెన్స్ బైక్ ‘కేటీఎం 200 డ్యూక్’ త్వరలోనే మరింత పవర్‌ఫుల్ అప్‌డేట్‌తో పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఆస్ట్రియన్ బైక్ తయారీ దిగ్గజం కేటీఎం.. తమ 200 డ్యూక్ మోడల్‌ను సరికొత్త టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు టీజ్ చేసింది. షోరూమ్‌లు, డీలర్‌షిప్‌లలో లీకైన పిక్చర్స్ ఆధారంగా, ఈ బైక్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా కస్టమర్లు కోరుకునే విప్లవాత్మక ఎలక్ట్రానిక్ ఫీచర్లను జోడించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

కేటీఎం 200 డ్యూక్ అప్డేటెడ్ వర్షెన్..
కేటీఎం 200 డ్యూక్ అప్డేటెడ్ వర్షెన్..

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో స్పోర్ట్స్ బైక్ ప్రియుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న వేళ, రేసింగ్ అనుభూతిని సాధారణ రోడ్లపై అందించడానికి కేటీఎం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

పెద్ద బైక్స్ అయిన 250 డ్యూక్, 390 డ్యూక్ మోడళ్లలో ఉండే ప్రీమియం ఫీచర్లు ఇప్పుడు చిన్న డ్యూక్‌లోనూ లభించనుండటం బైక్ లవర్స్‌ను ఆనందానికి గురిచేస్తోంది.

కళ్లు చెదిరే కొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లు..

కేటీఎం కొత్త 200 డ్యూక్‌లో ప్రవేశపెడుతున్న ప్రధాన మార్పులు బైక్ రైడింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చివేయనున్నాయి:

రైడ్-బై-వైర్ టెక్నాలజీ : సాంప్రదాయ కేబుల్ త్రోటల్ స్థానంలో ఎలక్ట్రానిక్ థ్రాటిల్ కంట్రోల్‌ను అమర్చనున్నారు. దీనివల్ల బైక్ యాక్సిలరేషన్ మరింత స్మూత్‌గా, తక్షణమే స్పందిస్తుంది.

రైడింగ్ మోడ్స్ : రైడ్-బై-వైర్ రాకతో ఈ కేటీఎం బైక్‌లో రెయిన్, స్ట్రీట్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను అందించనున్నారు. వర్షం పడుతున్నప్పుడు లేదా రోడ్లు తడిగా ఉన్నప్పుడు 'రెయిన్ మోడ్' ఎంచుకుంటే థ్రాటిల్ రెస్పాన్స్ తగ్గి బైక్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది.

ట్రాక్షన్ కంట్రోల్ : రోడ్డుపై గ్రిప్ తగ్గినప్పుడు వెనుక చక్రం పట్టు తప్పకుండా కాపాడేందుకు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌ను జతచేస్తున్నారు. వర్షాకాలంలోనూ, మట్టి రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఇది రైడర్ల భద్రతను పెంచుతుంది.

బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ : ఈ అప్‌డేట్‌లో అత్యంత ఆకర్షణీయమైనది క్విక్‌షిఫ్టర్. దీనివల్ల క్లచ్ ఉపయోగించాల్సిన పనిలేకుండానే, గేర్ లివర్‌ను సులువుగా అప్-షిఫ్ట్ లేదా డౌన్-షిఫ్ట్ చేయవచ్చు. లాంగ్ రైడ్స్ చేసేవారికి, సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

అంతేకాకుండా, 390 డ్యూక్ తరహాలోనే కొత్త రైట్-సైడ్ స్విచ్‌గేర్‌ను ఈ బైక్‌లో అమర్చినట్లు లీకైన చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

ఇంజిన్, హార్డ్‌వేర్‌లో మార్పులు ఉన్నాయా?

సాంకేతిక విభాగంలో విపరీతమైన మార్పులు తెస్తున్నప్పటికీ, కేటీఎం 200 డ్యూక్ బైక్ ఇంజిన్, మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న 199.5 సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్​నే ఇందులోనూ కొనసాగించనున్నారు. ఇది 10,000 ఆర్‌పీఎం వద్ద 25 bhp పవర్, 8,000 ఆర్‌పీఎం వద్ద 19.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ యథాతథంగా ఉంటుంది.

ముందు భాగంలో 43 ఎంఎం డబ్ల్యూపీ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్, వెనుక భాగంలో డబ్ల్యూపీ మోనోషాక్ సస్పెన్షన్ ఉండనుంది. 2026 ప్రారంభంలోనే ఈ బైక్‌కు 320 ఎంఎం భారీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, లైట్‌వెయిట్ అల్లాయ్ వీల్స్, కొత్త ఫుట్‌పెగ్స్, మోడ్రన్ గ్రాబ్ రైల్స్. టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కంపెనీ అప్‌డేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఊహించిన ధర, పోటీ..

ప్రస్తుతం కేటీఎం 200 డ్యూక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.05 లక్షలుగా ఉంది. కొత్తగా క్విక్‌షిఫ్టర్, అడాప్టివ్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నందున, కొత్త వెర్షన్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్200 , టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వీ వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More