...
...
Next Story

Southern Regional Politics : ఒకే వేదికపై జగన్, విజయ్, కేటీఆర్ - దక్షిణాది రాజకీయంలో కొత్త సమీకరణాలు..?

KTR Jagan Vijay Meeting : చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో కేటీఆర్, జగన్, తమిళనాడు సీఎం విజయ్ ఒకే వేదికపై కలిశారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులు, కూటమి సాధ్యాసాధ్యాలపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

Published on: Nov 6, 2026, 14:13:19 IST
Advertisement

KTR Jagan Vijay Meeting : దక్షిణ భారత రాజకీయంలో ఒక్కసారిగా ఆసక్తి రేకెత్తించే రీతిలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక ఇందుకు వేదికగా మారింది. తెలంగాణ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఒకే వేదికపై కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చెన్నై వివాహ వేడుకలో కేటీఆర్, జగన్, విజయ్
చెన్నై వివాహ వేడుకలో కేటీఆర్, జగన్, విజయ్

కుటుంబ శుభకార్యం వేదికగా ఈ ముగ్గురు కీలక నాయకులు ఒకే చోట కలుసుకున్నప్పటికీ, పరోక్షంగా ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ అవగాహన లేదా సమీకరణాలకు ఇది పునాది వేస్తుందా అన్న కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి.

కూటమికి ప్రాథమిక సంకేతమా?

ఈ నాయకుల కలయిక తక్షణమే ఏదో ఒక రాజకీయ కూటమికి దారితీస్తుందని భావించలేము. ఈ దిశగా నాయకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా సంకేతాలు కూడా వెలువడలేదు. అయినప్పటికీ….. వారి మధ్య నడిచిన సుదీర్ఘ సంభాషణలు, స్నేహపూర్వక కలయికలు మాత్రం దక్షిణాది రాజకీయాల్లో ప్రాంతీయ ఐక్యత అనే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి.

ముఖ్యంగా కేటీఆర్, వైఎస్ జగన్ మధ్య ఉన్న వ్యక్తిగత, రాజకీయ సాన్నిహిత్యం ప్రత్యేక శ్రద్ధను సంతరించుకుంది. గతంలో బెంగళూరులో జరిగిన ఒక వ్యక్తిగత వేడుకలో కలుసుకున్న వీరిద్దరూ, ఇప్పుడు చెన్నై వేదికగా మళ్లీ కలిసి సందడి చేయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. వేర్వేరు ప్రాంతీయ పార్టీల నాయకులు పలకరించుకోవడం సాధారణమే అయినప్పటికీ, మళ్లీ మళ్లీ ఇలా భేటీ కావడం భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు బాటలు వేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాంతీయ పార్టీల సవాళ్లు - సమైక్య స్ఫూర్తి..!

ఈ భేటీలో మరో కీలకమైన అంశం ఏమిటంటే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పార్లమెంటరీ(లోక్ సభ సీట్ల సంఖ్య) బలం. తమిళనాడులోని 39, ఆంధ్రప్రదేశ్‌లోని 25, తెలంగాణలోని 17 కలిపి మొత్తం 81 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని, హక్కులను బలమైన గొంతుతో వినిపించాలంటే ఈ 81 స్థానాల ఉమ్మడి శక్తి ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది.

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండియా' కూటమిలకు అతీతంగా మూడో ప్రత్యామ్నాయ ప్రాంతీయ వేదిక ఏర్పడే అవకాశాలపై కూడా విశ్లేషకులు దృష్టి సారిస్తున్నారు. కేంద్ర స్థాయిలో అధికార వికేంద్రీకరణ తగ్గడంపై ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల పొత్తు లేకపోయినా, రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కోసం ఒక ఉమ్మడి పోరాట వేదిక రూపుదిద్దుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

విజయ్ పాత్ర ఉంటుందా…?

ఈ సమీకరణాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ పాత్ర ఎంతో ఆసక్తికరంగా మారింది. సొంత రాజకీయం, స్పష్టమైన ప్రాధాన్యతలు కలిగిన విజయ్…. తన స్వతంత్ర వైఖరిని కొనసాగిస్తారా లేదా జాతీయ స్థాయి అంశాలపై ఇతర ప్రాంతీయ నాయకులతో కలిసి పనిచేస్తారా..? అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే ఆయన ఎలాంటి ముందస్తు ప్రణాళికలు వెల్లడించలేదు.

ఇలాంటి ప్రాంతీయ అవగాహన ఏర్పడటానికి అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ మూడు పార్టీల రాజకీయ నేపథ్యాలు, ప్రాంతీయ ప్రాధాన్యతలు, ఎన్నికల వ్యూహాలు వేర్వేరుగా ఉన్నాయి. ఒకవేళ ఏమైనా అవగాహన కుదరాలన్నా సీట్ల సర్దుబాటు, నాయకత్వం, ఐడియాలజీపై స్పష్టత రావాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి ఈ కలయిక కేవలం ఒక కుటుంబ శుభకార్యానికి పరిమితమైన సరదా భేటీగానే కనిపిస్తోంది. కానీ…. ఎప్పుడు ఏ క్షణమైనా మారే భారత రాజకీయ చిత్రపటంలో ప్రాంతీయ పార్టీల కొత్త సమీకరణాలను పూర్తిగా తోసిపుచ్చలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks