...
...
Next Story

FASTag local pass : టోల్​ ప్లాజాల దగ్గర ఉండే వారికి గుడ్​ న్యూస్! ఈ యాప్‌ ద్వారా డిజిటల్ లోకల్ పాస్..

FASTag local pass : టోల్ ప్లాజాల వద్ద స్థానికులు గంటల తరబడి క్యూలలో నిలబడే తిప్పలు తప్పాయి. 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే నివాసితులు ఇకపై రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా నేరుగా డిజిటల్ లోకల్ పాస్ పొందవచ్చని భారత జాతీయ రహదారుల సంస్థ వెల్లడించింది.

Published on: Jul 23, 2026, 06:06:57 IST
Advertisement

టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) తీపి కబురు అందించింది. టోల్ ప్లాజాల వద్ద స్థానిక నెలవారీ పాస్‌ల కోసం ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా డిజిటల్ లోకల్ పాస్ పొందే నయా వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించింది. తమ అధికారిక ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్ ద్వారా ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎన్​హెచ్ఏఐ స్పష్టం చేసింది.

ఇక లైన్లలో నిలబడే పని లేదు!

టోల్​ ప్లాజాల దగ్గర ఉంటున్నారా? మీకోసమే ఈ వెసులుబాటు!
టోల్​ ప్లాజాల దగ్గర ఉంటున్నారా? మీకోసమే ఈ వెసులుబాటు!

టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారు ఈ డిజిటల్ లోకల్ పాస్ పొందడానికి అర్హులు. ఈ పాస్ ద్వారా నెలకు ఎన్నిసార్లయినా సదరు టోల్ ప్లాజా మీదుగా ఉచితంగా ప్రయాణించవచ్చు. గతంలో స్థానిక పాస్ కావాలంటే వాహనదారులు స్వయంగా టోల్ ప్లాజా వద్దకు వెళ్లి తమ నివాస ధ్రువీకరణ పత్రాలు, వాహన కాగితాలు సమర్పించాల్సి వచ్చేది. కానీ కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ వ్యవస్థతో కేవలం కొద్ది నిమిషాల్లోనే ప్రాసెస్ ముగిసిపోతుంది.

తొలిదశగా దిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-IIపై ఉన్న ముండ్కా-బక్కర్‌వాలా టోల్ ప్లాజా వద్ద ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రాబోయే కొద్ది నెలల్లోనే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ టోల్ ప్లాజాలలో ఈ డిజిటల్ లోకల్ పాస్ సౌకర్యాన్ని విస్తరించనున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది.

పేపర్‌లెస్ వెరిఫికేషన్.. జీఐఎస్ టెక్నాలజీ!

వాహనదారుల నివాస వివరాలు, వాహనం నంబర్, దానికి అనుసంధానమై ఉన్న ఫాస్టాగ్ సమాచారాన్ని ఆటోమేటిక్‌గా సరిచూసేందుకు కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లైన డిజిలాకర్, వాహన్ పోర్టళ్లతో ఈ యాప్‌ను అనుసంధానించారు. దీనితో పాటు, ప్రయాణికుడు నిజంగానే 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారా లేదా అనేది భౌగోళిక సరిహద్దుల ఆధారంగా సిస్టమే గుర్తిస్తుంది. ఫలితంగా ఎలాంటి పేపర్ ఆధారిత కాగితాలు అందించాల్సిన అవసరం లేకుండా, పారదర్శకంగా, వేగంగా పాస్ మంజూరవుతుంది.

22 భాషల్లో సహాయం అందించే 'మార్గ్‌మిత్ర'..

“దేశంలోని 22 అధికారిక భాషల్లో ప్రయాణికులు మార్గ్‌మిత్ర వేదికపై మాట్లాడవచ్చు లేదా టైప్ చేయవచ్చు. సిస్టమ్ వెంటనే సరైన సమాచారాన్ని అందిస్తుంది లేదా సంబంధిత విభాగానికి మార్గదర్శనం చేస్తుంది,” అని ఎన్​హెచ్ఏఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ హెల్ప్ సెంటర్ ద్వారా ఫాస్టాగ్ రీఛార్జ్, కేవైసీ అప్‌డేట్, రిఫండ్ స్టేటస్, యాన్యువల్, లోకల్ పాస్ సేవలు, తరచూ ఎదురయ్యే సందేహాలకు తక్షణ సమాధానాలు లభిస్తాయి.

రియల్ టైమ్‌లో ఫిర్యాదుల ట్రాకింగ్..

ఏదైనా సమస్య తీవ్రమైనదైతే, మార్గ్‌మిత్ర ద్వారా నేరుగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈ ఫిర్యాదు ఆటోమేటిక్‌గా సంబంధిత విభాగానికి చేరుతుంది. తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో రియల్ టైమ్‌లో ప్రయాణికులు ట్రాక్ చేయవచ్చు. ఇచ్చిన పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే పైఅధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

అంతేకాకుండా, ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, పెండింగ్‌లో ఉన్న ఇ-నోటీసులను చూడటం, హైవేలపై నిలిచిపోయిన వాహనాలు లేదా ఆక్రమణల వల్ల కలిగే రోడ్డు భద్రతా సమస్యలను నేరుగా అధికారులకు నివేదించే వెసులుబాటును కూడా ఈ యాప్ కల్పిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks