Passport fees : షాకిచ్చిన కేంద్రం- పాస్​పోర్ట్​ దరఖాస్తు ఫీజు భారీగా పెంపు..

Passport fees hike : వివిధ కేటగిరీల పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ). ఈ పెరిగిన కొత్త ధరలు జులై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణ 36 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ. 1,500 నుంచి ఏకంగా రూ. 2,500కు పెరిగింది.

Published on: Jun 26, 2026, 09:08:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది! వివిధ కేటగిరీల కింద పాస్‌పోర్ట్ సేవల రుసుములను సవరిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వానికి నిరూపణ కాదంటూ ఇటీవల రేగిన వివాదాల మధ్యే.. ఇప్పుడు వీటి ధరలను పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. సవరించిన కొత్త ధరల పట్టిక ప్రకారం.. సాధారణ, తత్కాల్, మైనర్, పోగొట్టుకున్న/పాడైపోయిన పాస్‌పోర్టుల రీప్లేస్‌మెంట్ ధరలు జులై 1, 2026 నుంచి భారీగా పెరగనున్నాయి.

పాస్​పోర్ట్​ దరఖాస్తు ఫీజు పెంపు.. (HT File)
పాస్​పోర్ట్​ దరఖాస్తు ఫీజు పెంపు.. (HT File)

సాధారణ పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు (పెద్దలకు)..

18 సంవత్సరాలు పైబడిన వారు (అలాగే 15-18 ఏళ్ల లోపు ఉండి అడల్ట్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వారు) 10 ఏళ్ల వ్యాలిడిటీతో వచ్చే పాస్‌పోర్టులకు ఇకపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

36 పేజీల పాస్‌పోర్ట్: ప్రస్తుతం ఉన్న ధర రూ. 1,500 నుంచి ఏకంగా రూ. 2,500కు పెరిగింది.

60 పేజీల పాస్‌పోర్ట్: మునుపటి ధర రూ. 2,000 నుంచి ఇప్పుడు రూ. 3,500కు చేరింది.

తత్కాల్ స్కీమ్ కింద కొత్త ధరలు..

అత్యవసరంగా పాస్‌పోర్ట్ కావాలనుకునే వారిపై కూడా భారం పడింది.

36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్: రూ. 3,500 నుంచి రూ. 5,000కు పెరిగింది.

60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్: రూ. 4,000 నుంచి రూ. 6,000కు పెరిగింది.

పోగొట్టుకున్న లేదా పాడైపోయిన పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్ ఫీజులు..

పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా పాడైపోయినా కొత్తది పొందేందుకు ఛార్జీలను సర్కార్ భారీగా సవరించింది.

సాధారణ కేటగిరీ: 36 పేజీల రీప్లేస్‌మెంట్ ఫీజు రూ. 3,000 నుంచి రూ. 5,000కు.. అలాగే 60 పేజీల ఫీజు రూ. 3,500 నుంచి రూ. 6,000కు పెరిగింది.

తత్కాల్ కేటగిరీ: పోగొట్టుకున్న/పాడైపోయిన 36 పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్ ధర రూ. 5,000 నుంచి రూ. 7,500కు పెరగ్గా.. 60 పేజీల ధర రూ. 5,500 నుంచి రూ. 8,500కు పెరిగింది.

మైనర్ల (పిల్లల) పాస్‌పోర్ట్ ఫీజులు..

18ఏళ్ల లోపు ఉన్న మైనర్లకు (5 ఏళ్ల వ్యాలిడిటీ లేదా వారికి 18 ఏళ్లు నిండే వరకు) ఇచ్చే పాస్‌పోర్ట్ ధరలు కూడా మారాయి.

కొత్త/రీఇష్యూ పాస్‌పోర్ట్: రూ. 1,000 నుంచి రూ. 1,750కి పెరిగింది.

పోగొట్టుకున్న/పాడైపోయిన పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్: రూ. 3,000 నుంచి రూ. 4,250కి పెరిగింది.

తత్కాల్ కేటగిరీ (మైనర్): కొత్త పాస్‌పోర్ట్ ధర రూ. 3,000 నుంచి రూ. 4,250కి.. రీప్లేస్‌మెంట్ ధర రూ. 5,000 నుంచి రూ. 6,750కి పెరిగింది.

పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) ఫీజు కూడా..

ఉద్యోగ లేదా ఇతర వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమయ్యే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) ఫీజును రూ. 500 నుంచి రూ. 750కి పెంచారు. ఇదే పెరిగిన ధర సరెండర్ సర్టిఫికేట్లు, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ (జీఈపీ) వెరిఫికేషన్, ఇతర వివిధ రకాల సర్టిఫికేట్లకు కూడా వర్తిస్తుంది.

గమనిక: పాస్‌పోర్ట్ ధరలు పెరిగినప్పటికీ, వాటి వ్యాలిడిటీ (పరిమితి) కాలంలో ఎలాంటి మార్పులు లేవు. పెద్దలకు ఎప్పటిలాగే 10 సంవత్సరాలు, మైనర్లకు 5 సంవత్సరాల కాలపరిమితి వర్తిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More