యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు? లోక్‌సభలో పన్నుల సవరణ బిల్లుకు ఆమోదం
యూపీఐ, రూపే లావాదేవీలపై బ్యాంకులు ఛార్జీలు (MDR) వసూలు చేసేందుకు మార్గం సుగమం చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన 'పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026'కు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. ఇదే బిల్లు ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా, ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేలా పన్ను నిబంధనలను సరళీకరించింది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల ముఖచిత్రాన్ని మార్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యూపీఐ (UPI), రూపే (RuPay) కార్డు లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026'ను లోక్‌సభ గురువారం ఆమోదించింది. విపక్షాల ఆందోళనల మధ్యే గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ మూజువాణి వోటుతో ఆమోదముద్ర వేసింది.

భారతదేశాన్ని గ్లోబల్ క్యాపిటల్, తయారీ కేంద్రంగా మార్చే సువిశాల లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లు.. గత జూన్ 5న కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను భర్తీ చేసింది.
యూపీఐ చెల్లింపుల ఉచిత శకం ముగిసినట్లేనా?
ప్రస్తుతం ఆర్టీజీఎస్ (RTGS), నెఫ్ట్ (NEFT) వంటి లావాదేవీలకు మాత్రమే బ్యాంకులు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. యూపీఐ, రూపే లావాదేవీలు ఉచితంగా (Zero-MDR) సాగుతున్నాయి. అయితే, ఈ బిల్లు ద్వారా 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం (సెక్షన్ 10A), ఆదాయపు పన్ను చట్టం-2025 (సెక్షన్ 269SU) నిబంధనలను సవరించారు.
దీంతో ఏయే ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఉచితంగా ఉండాలనేది ఇకపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తుంది. తాజా మార్పులతో భవిష్యత్తులో యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేసేందుకు బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లకు చట్టబద్ధత లభించింది. వ్యక్తిగత చెల్లింపులకు (Peer-to-Peer) మినహాయింపు ఇచ్చి, కేవలం వ్యాపారులకు చేసే భారీ లావాదేవీలపై మాత్రమే ఈ ఛార్జీలు విధించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పన్నుల ద్వారానా? వాడేవారి నుంచే వసూలు చేయాలా?
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) విధింపుపై వస్తున్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం స్పందించారు. దీనిపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
"చెల్లింపుల మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా ఖర్చవుతుంది, ఆ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందే. పన్నుల రూపంలో సామాన్య ప్రజలే భరించడం లేదా వాడుకునే వారి నుంచే (User pays) వసూలు చేయడం అనే రెండు మార్గాలు మన ముందు ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం చట్ట సవరణ మాత్రమే చేసింది. డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే మా లక్ష్యం, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం" అని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు.
విదేశీ నిధులకు రెడ్ కార్పెట్.. ఏఐ డేటా సిటీల దిశగా
ఈ చట్ట సవరణ కేవలం చెల్లింపులకే పరిమితం కాలేదు. గ్లోబల్ ఫండ్ మేనేజర్లను భారత్‌కు ఆకర్షించేందుకు నిబంధనలను భారీగా సరళీకరించింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (IFSC)తో సహా దేశవ్యాప్తంగా విదేశీ ఫండ్ మేనేజర్లు కార్యకలాపాలు సాగించేలా పన్ను మినహాయింపుల షరతులను సడలించింది. అలాగే, బిజినెస్ ట్రస్ట్‌ల (REITs, InvITs) ఆపరేటింగ్ కంపెనీ కొత్త పన్ను విధానానికి మారినా, ఇన్వెస్టర్లకు వచ్చే డివిడెండ్లపై పన్ను మినహాయింపును యథాతథంగా కొనసాగించనున్నారు.
భవిష్యత్తులో ఏఐ (AI) డేటా సిటీల నిర్మాణాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, డేటా సెంటర్ల ఏర్పాటు నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేసింది. ముందస్తు అనుమతుల అవసరాన్ని తొలగించడంతో పాటు, లీజుకు తీసుకున్న డేటా సెంటర్లకు కూడా 2047 వరకు పన్ను రాయితీలు వర్తించేలా మార్పులు చేసింది. అంతేకాకుండా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) ప్రభుత్వ సెక్యూరిటీల్లో (G-Secs) పెట్టే పెట్టుబడుల ద్వారా వచ్చే వడ్డీ, మూలధన లాభాలపై ఆదాయపు పన్ను మినహాయింపును ఈ బిల్లు ఖరారు చేసింది.
'మేక్ ఇన్ ఇండియా' అస్త్రం.. ఎలక్ట్రానిక్స్‌కు బూస్ట్
- భారత్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్ల తయారీని వేగవంతం చేసేలా చట్టంలో భారీ రాయితీలు పొందుపరిచారు.
- దేశీయ కర్మాగారాలకు యంత్రాలు సరఫరా చేసే విదేశీ కంపెనీల ఆదాయంపై ఉన్న పన్ను మినహాయింపును 2040-41 వరకు (మరో పదేళ్లు) పొడిగించారు.
- కస్టమ్స్-బాండెడ్ వేర్‌హౌస్‌ల ద్వారా విడిభాగాలను సరఫరా చేసే విదేశీ కంపెనీలకు 15 ఏళ్ల పాటు పూర్తి పన్ను మినహాయింపు కల్పించారు.
- ప్రపంచ వజ్రాల వ్యాపారాన్ని భారత్ వైపు తిప్పుకునే ఉద్దేశంతో, ముంబై, సూరత్‌లలోని స్పెషల్ జోన్లలో ముడి వజ్రాలను విక్రయించే విదేశీ డైమండ్ మైనర్లు, బ్రోకర్లు, ఆక్షన్ హౌస్‌లకు 15 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


