ఎల్పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. ఆగస్టు 16లోగా eKYC పూర్తి చేయకపోతే ఇబ్బందులు తప్పవు!

LPG eKYC deadline : గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందడానికి ఆగస్టు 16, 2026లోగా ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఈ నిబంధన పాటించకుంటే వాణిజ్య ధరలకు సిలిండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Published on: Aug 8, 2026, 09:59:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ఉన్న గృహోపయోగ ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. దీనికోసం ఆగస్టు 16, 2026 వరకు గడువు విధించాయి. నకిలీ, డూప్లికేట్ గ్యాస్ కనెక్షన్లను తొలగించి, అర్హులైన నిజమైన వినియోగదారులకే ప్రభుత్వ సబ్సిడీ అందేలా చూడటమే ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఉద్దేశం.

ఎల్పీజీ సిలిండర్​ ఈ-కేవైసీకి సమీపిస్తున్న డెడ్​లైన్..
ఎల్పీజీ సిలిండర్​ ఈ-కేవైసీకి సమీపిస్తున్న డెడ్​లైన్..

నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే ఏమవుతుంది?

గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు సబ్సిడీ ధరకే ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని చమురు కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు కమర్షియల్ (వాణిజ్య) ధరలకే సిలిండర్లు కొనుగోలు చేయాల్సి రావచ్చు. అలాగే, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులు కూడా సరైన సమయంలో ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే సబ్సిడీ నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

భారీ సంఖ్యలో మిగిలిపోయిన వెరిఫికేషన్..!

దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ-కేవైసీ ప్రక్రియకు స్పందన చాలా మందకొడిగా సాగుతోంది. గ్యాస్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం ఏర్పడినప్పుడు కొంతమంది హడావుడిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ, సాధారణ సరఫరా ప్రారంభమయ్యాక ఈ ప్రక్రియ మళ్లీ మందగించిందని అధికారులు తెలిపారు.

వినియోగదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ అలర్టులు, డోర్-టూ-డోర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ మిశ్రా పేర్కొన్నారు.

ఎల్పీజీ సిలిండర్ ఈ-కేవైసీ పూర్తి చేయడం ఎలా?

వినియోగదారులు వివిధ మార్గాల ద్వారా ఎల్పీజీ ఈ-కేవైసీ ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు:

ఇండియన్ ఆయిల్ కస్టమర్లు అయితే 'ఇండియన్ ఆయిల్ వన్ యాప్' ద్వారా.

సంబంధిత ఎల్పీజీ కంపెనీ అధికారిక మొబైల్ యాప్ లేదా పోర్టల్ ద్వారా.

స్థానిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ ఏజెన్సీని నేరుగా సంప్రదించి.

సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది ద్వారా.

ఈ వెరిఫికేషన్ కోసం కస్టమర్లు తమ ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇతర గుర్తింపు వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఉజ్వల లబ్ధిదారులకు కూడా తప్పనిసరి..

ఈ నిబంధన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కూడా వర్తిస్తుంది. 2016లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతి సిలిండర్‌పై రూ. 300 చొప్పున ఏడాదికి నాలుగు రీఫిల్స్‌కు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) అందుతోంది. సబ్సిడీలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే ఉజ్వల లబ్ధిదారులు కూడా గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

ఎల్పీజీ సిలిండర్ ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి?

ప్రతి యాక్టివ్ కనెక్షన్‌ను నిజమైన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా ఎల్పీజీ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం. దీనివల్ల మోసపూరిత, డూప్లికేట్ కనెక్షన్లు తొలగిపోతాయి. చివరి నిమిషంలో ఏర్పడే రద్దీని, బుకింగ్స్ లేదా సబ్సిడీల్లో సమస్యలను నివారించడానికి ఆగస్టు 16 కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More