...
...
Next Story

LPG price hike : 'బండ' బాదుడు- ఇళ్లల్లో వాడే గ్యాస్ సిలిండర్ల ధర పెంపు, హైదరాబాద్​లో రేటు ఇలా..

LPG price hike Hyderabad : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై పడిన ప్రభావంతో గృహావసర వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 29 పెంచారు. మూడు నెలల వ్యవధిలోనే ధర పెరగడం ఇది రెండోసారి. పెరిగిన ధరలు ఆదివారం (జూన్ 7) నుంచి అమల్లోకి వచ్చాయి.

Published on: Jun 7, 2026, 05:58:00 IST
Advertisement

LPG price hike today : ద్రవ్యోల్బణంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలపై మరో భారం పడింది! అంతర్జాతీయ మార్కెట్​లో నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశీయంగా వంటగ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. గృహావసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరపై తాజాగా రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు.. (Sanjeev Verma/HT photo)
వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు.. (Sanjeev Verma/HT photo)

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

ఈ తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో 14.2 కిలోల గృహావసర ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కి చేరిందని చమురు రంగానికి చెందిన అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. పెరిగిన ఈ కొత్త ధరలు జూన్ 7, ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. అంతకుముందు.. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో, మార్చి నెలలో కూడా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరపై ఒకేసారి రూ. 60 పెంచిన సంగతి తెలిసిందే.

తాజా పెంపుతో హైదరాబాద్​లో 14.2 కేజీల సిలిండర్​ ధర రూ. 994కి చేరింది. విజయవాడలో ఇది రూ. 966.50గా ఉంది.

వంటగ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయి?

ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఉన్న ఆంక్షలు, అంతరాయాల కారణంగా ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్)తో పాటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. ఇప్పుడు అదే బాటలో గృహావసర వంటగ్యాస్ ధర కూడా పెరిగింది. అయితే, ఇప్పుడు పెంచిన రూ. 29 అనేది చమురు కంపెనీలకు వంటగ్యాస్ విక్రయాలపై వస్తున్న నష్టాలను కేవలం కొంత మేరకే పూడ్చగలదని మార్కెట్ వర్గాలు పీటీఐ సంస్థకు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతున్న తరుణంలోనే ఈ ఎల్పీజీ ధరల పెంపు కూడా చోటు చేసుకుంది.

గృహాల్లో వినియోగించే సిలిండర్లతో పోల్చుకుంటే.. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ ధరలను చివరిగా జూన్ 1న సవరించారు. అప్పుడు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ. 42 పెంచడంతో దాని ధర రూ. 3,113కి చేరింది.

వ్యాపార వర్గాలపై పడుతున్న భారాన్ని చూస్తే.. అంతకుముందు మే నెలలో ఏకంగా రూ. 1,000, ఏప్రిల్‌లో రూ. 195.5, మార్చి నెలలో రూ. 114.5 చొప్పున కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. గృహావసర గ్యాస్‌తో పోలిస్తే కమర్షియల్ గ్యాస్ ధరలు ప్రతి నెల భారీగా మారుతుండటం వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో రెస్టారెంట్లు సహా ఇతర చోట్ల ప్రాడక్టుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe