...
...
Next Story

Gas Cylinder Shortage : దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత- నగరాల వారీగా పరిస్థితి ఇలా..

LPG Gas Cylinder : భారతదేశంలో కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాలో ఏర్పడిన తీవ్ర కొరత హోటల్, రెస్టారెంట్ పరిశ్రమను కుదిపేస్తోంది. గ్యాస్ అందక బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఇప్పటికే అనేక యూనిట్లు మూతపడగా, ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: Mar 11, 2026, 13:01:23 IST
Advertisement

దేశవ్యాప్తంగా ఉన్న హోటల్ యజమానులు వంటగ్యాస్ సరఫరాలో ఏర్పడిన కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, నిరంతరాయంగా ఇంధన సరఫరాను నిర్ధారించాలని ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​ఆర్​ఏఐ), ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఏహెచ్​ఏఆర్​), బెంగళూరు, చెన్నై, ఒడిశా హోటల్ సంఘాలు, పలువురు హోటల్ యజమానులు గ్యాస్ లభ్యత లేకపోతే అనేక యూనిట్లు మూతపడక తప్పదని హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా గ్యాస్​ సిలిండర్ల కొరత..
దేశవ్యాప్తంగా గ్యాస్​ సిలిండర్ల కొరత..

"రెస్టారెంట్ పరిశ్రమ ప్రధానంగా కమర్షియల్ ఎల్‌పీజీపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎలాంటి అంతరాయం కలిగినా మెజారిటీ రెస్టారెంట్లు మూతపడే విపత్కర పరిస్థితి వస్తుంది," అని ఎన్​ఆర్​ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా గ్యాస్​ సిలిండర్ల కొరత- నగరాల వారీగా పరిస్థితి:

బెంగళూరు: ఇక్కడ కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో అనేక ఈటరీలు ప్రభావితమయ్యాయి. మార్చి 7 నుంచి సిలిండర్ల రీఫిల్లింగ్ జరగలేదని డీలర్లు చెప్పడంతో, మంగళవారం (మార్చి 10) అనేక చిన్న రెస్టారెంట్లు తమ సేవలను కేవలం "టీ- కాఫీ"లకు మాత్రమే పరిమితం చేశాయి. అయితే గెయిల్ ద్వారా పైప్డ్ గ్యాస్ వాడుతున్న 10-15% సంస్థలు మాత్రం కొనసాగుతున్నాయి.

ముంబై: ఇక్కడ ఇప్పటికే 20% హోటళ్లు మూతపడ్డాయి. పరిస్థితి మెరుగుపడకపోతే మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య 50% కి చేరుతుందని 'ఆహార్' (ఏహెచ్​ఏఆర్​) ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం 25% సరఫరా అయినా కొనసాగించాలని వారు కోరుతున్నారు.

దిల్లీ- ఎన్​సీఆర్​: పెద్ద రెస్టారెంట్ల వద్ద అదనపు స్టాక్ ఉన్నప్పటికీ, చిన్న అవుట్‌లెట్ యజమానులు మాత్రం రెగ్యులర్ సరఫరా లేక బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లను రూ. 1,400 నుంచి 1,500 వరకు పెట్టి కొనాల్సి వస్తోంది. "నిన్న రూ. 1,200 ఉన్న సిలిండర్ ధర నేడు రూ. 1,500 అయింది," అని ఒక బిర్యానీ షాప్ యజమాని వాపోయారు.

దేశవ్యాప్తంగా గ్యాస్​ సిలిండర్ల కొరత..

గుజరాత్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల గృహ వినియోగానికి ఇబ్బంది కలగకుండా పరిశ్రమలకు గ్యాస్ సరఫరాను 50% వరకు తగ్గించారు. మోర్బీలోని 100 సిరామిక్ యూనిట్లు ఇప్పటికే మూతపడ్డాయి.

కేరళ: క్యాటరింగ్ యూనిట్లు మూతపడే దశకు చేరుకున్నాయి. రంజాన్ ఉపవాసాల వల్ల ప్రస్తుతానికి డిమాండ్ కొంత తక్కువగా ఉన్నా, మున్ముందు పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

ఉత్తర ప్రదేశ్ అండ్​ బీహార్: పట్టణాల్లో గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. పాట్నాలో గ్యాస్ అందక బొగ్గు, ఇండక్షన్ స్టౌల మీద వంటలు ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. ఏపీలో గ్యాస్ కొరత లేదని, విశాఖపట్నంలోని నిల్వల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఒక ఎల్‌పీజీ నౌక ఖతార్ నుంచి విశాఖ చేరుకోగా, మరొకటి 'స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్' వద్ద ఉద్రిక్తతల వల్ల ఆలస్యమైందని తెలిపారు.

దేశవ్యాప్తంగా గ్యాస్​ సిలిండర్ల కొరత- రాజకీయ, పారిశ్రామిక స్పందన..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రి హర్దీప్ పూరీకి లేఖ రాస్తూ.. గ్యాస్​ సరఫరాపై నెలకొన్న అనిశ్చితిని పరిష్కరించాలని కోరారు. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాస్తూ.. ఈ సంక్షోభం వల్ల ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, హోటళ్లు దెబ్బతినకుండా చూడాలని కోరారు.

ప్రముఖ రెస్టారెంట్ యజమాని జొరావర్ కల్రా మాట్లాడుతూ.. రెస్టారెంట్ పరిశ్రమ రూ. 6.6 లక్షల కోట్ల విలువైన వ్యవస్థ అని, ఒక్క రోజు సరఫరా నిలిచిపోతే ఆర్థిక వ్యవస్థకు రూ. 1,200 నుంచి 1,300 కోట్ల నష్టం వాటిల్లుతుందని చెప్పారు. హోటల్ రంగానికి 'అత్యవసర సేవల' హోదా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా గ్యాస్​ సిలిండర్ల కొరత- కేంద్రం చర్యలు:

వంట గ్యాస్ కొరతను సమీక్షించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రిఫైనరీల ఉత్పత్తిని పెంచాలని, గృహ వినియోగానికి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించింది.

కాగా, ఇటీవలే గృహ సిలిండర్ పై రూ. 60, కమర్షియల్ సిలిండర్ పై రూ. 114.5 చొప్పున ధరలు పెరిగాయి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. భారతదేశంలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత ఎందుకు ఏర్పడింది

సమాధానం: దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం. ముఖ్యంగా ఇరాన్ 'స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్' మార్గాన్ని మూసివేయడం వల్ల భారతదేశానికి రావాల్సిన ఎల్‌పీజీ దిగుమతులు నిలిచిపోయాయి. భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో దాదాపు 60% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల దేశీయంగా గ్యాస్ లభ్యత ఒక్కసారిగా తగ్గిపోయింది.

2. హోటళ్లు- రెస్టారెంట్లకే ఈ కొరత ఎక్కువగా ఎందుకు ఉంది

సమాధానం: గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం గృహ వినియోగదారులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మార్చి 9న ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల.. ఆయిల్ కంపెనీలు తమ వద్ద ఉన్న గ్యాస్ స్టాక్‌ను కేవలం ఇళ్లకే సరఫరా చేస్తున్నాయి.హోటళ్లు, రెస్టారెంట్లు వాడే కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా బాగా తగ్గించడం జరిగింది. ఫలితంగా, హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది, కానీ ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe