LSG vs CSK : లక్నో చేతిలో ఘోర ఓటమి.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!
IPL 2026 : లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయిన సీఎస్కే.. టాప్-4 లో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
CSK IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ చేరాలనే చెన్నై సూపర్ కింగ్స్ కలలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! లక్నోలో శుక్రవారం రాత్రి జరిగిన కీలక పోరులో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే జట్టు లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్స్ ప్లేఆఫ్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఎల్ఎస్జీ వర్సెస్ సీఎస్కే- స్కోర్ బోర్డు ఇలా..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్నో బౌలర్, మాజీ సీఎస్కే ప్లేయర్ ఆకాష్ సింగ్ మూడు వికెట్లతో చెన్నైని దెబ్బతీసినప్పటికీ.. కార్తీక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
అయితే 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు! ముఖ్యంగా మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లోనే 90 పరుగులు చేసి చెన్నైకి విజయాన్ని దూరం చేశాడు. అతనికి తోడుగా జోష్ ఇంగ్లిస్ 36 పరుగులతో రాణించడంతో, లక్నో జట్టు మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఊదేశింది.
ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతోనే ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో చెన్నై ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2026లో చెన్నై ప్లేఆఫ్స్ చేరాలంటే..
ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ (సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్) విజయం సాధిస్తే, 14 మ్యాచ్‌లకు గాను 16 పాయింట్లతో నిలుస్తుంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కేకు టాప్-4 లో చోటు దక్కించుకోవడానికి ఈ 16 పాయింట్లు సరిపోతాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మరో 5 జట్లకు కూడా 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం ఉండటంతో చెన్నైకి నెట్ రన్ రేట్ కీలకం కానుంది!
అలా కాకుండా, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నై కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే వారి ఖాతాలో 14 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ పరిస్థితిలో టాప్-4 లో నిలవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అప్పుడు చెన్నై జట్టు ఇతర జట్ల ఓటములపై, అలాగే తమ రన్ రేట్ పైనే పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది.
‘ఇప్పుడు చాలా క్లారిటీ ఉంది’
ఈ ఘోర పరాజయంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ అనంతరం స్పందించారు.
“మొదటి సవాలు చెన్నై చేరుకోవడం. అది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఆ తర్వాత తిరిగి వచ్చి, మనం ఏ ఏ రంగాల్లో మెరుగుపడాలో చూసుకోవాలి. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడాలి. మా ముందైతే ఇప్పుడు ఒకే ఒక సింపుల్ లెక్క ఉంది. ఇకపై ఆడబోయే ప్రతి మ్యాచ్‌నూ ఖచ్చితంగా గెలవాలి. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు, అంతా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మా పని సులువే. ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆ రోజు మాకు కలిసి వచ్చేలా చూసుకోవాలి. ఎవరికైతే మంచి రోజు ఉంటుందో వారు దాన్ని జట్టు విజయం కోసం ఉపయోగించుకోవాలి. రాబోయే మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా పుంజుకుంటామని ఆశిస్తున్నాను,” అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


