మధ్యప్రదేశ్‌లో దారుణం: దివ్యాంగుడిపై మూత్ర విసర్జన చేసిన బంధువులు

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దివ్యాంగుడిపై బంధువులు మూత్ర విసర్జన చేశారు! ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్‌ య్యింది. స్థానికులు చూస్తూ ఉండిపోయారే తప్ప అడ్డుకోకపోవడం గమనార్హం.

Published on: Nov 23, 2025, 14:00:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మధ్యప్రదేశ్‌ రైసెన్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగు చూసింది. దివ్యాంగుడైన ఒక వ్యక్తిపై అతని సొంత బంధువులే దాడి చేశారు. అనంతరం అత్యంత హేయంగా అతనిపై మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. స్థానికులు ఆ ఆకృత్యాన్ని ఫోన్​లతో చిత్రీకరించారు కానీ జోక్యం చేసుకుని ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం!

దివ్యాంగుడిపై మూత్ర విసర్జన చేసిన బంధువులు
దివ్యాంగుడిపై మూత్ర విసర్జన చేసిన బంధువులు

వీడియో వైరల్‌ అయిన తరువాత ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి, నిందితులు రాజ్‌కుమార్ లోవంశీ, గోవింద్ లోవంశీ లను అరెస్టు చేశారు.

అసలు ఏం జరిగింది?

నిందితులతో పాటు బాధితుడు కలిసి వడ్లు అమ్మి తిరిగి వస్తుండగా, మార్గమధ్యలో మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అది తరువాత కొట్లాటగా మారింది. బాధితుడు కిందపడిపోగా, నిందితుల్లో ఒకరు అతనిపైకి ఎక్కి ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. మరొక వ్యక్తి అతన్ని పక్కకు లాగడానికి ప్రయత్నించాడు.

ఈ దారుణాన్ని చుట్టూ ఉన్న చాలా మంది చిత్రీకరించారు కానీ ఎవరూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు.

మరోవైపు సబ్-డివిజనల్ పోలీసు అధికారి శీలా సురానా అరెస్టులను ధృవీకరించారు.

"బాధితుడు నిందితులకు బంధువే. వడ్లు అమ్మి వచ్చిన డబ్బుతో మద్యం సేవించారు. వారి మధ్య గొడవ జరగడం ఈ సిగ్గుచేటు ఘటనకు దారితీసింది," అని ఆమె తెలిపారు.

ఈ వీడియో శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆన్‌లైన్‌లో కనిపించినట్లు సమాచారం. ఆ వెంటనే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు.

రాజకీయ దుమారం

ఈ ఘటన మధ్యప్రదేశ్​లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని ఆయన ఆరోపించారు.

"గతంలో బీజేపీ నాయకులు ప్రజలపై మూత్ర విసర్జన చేసేవారు. ఇప్పుడు అదే అలవాటును అందరిలోనూ నెలకొల్పారు," అని పట్వారీ విమర్శించారు.

"ఇక్కడ చట్టం, హోం మంత్రిత్వ శాఖ, హోం మంత్రి అనేదే లేదు. పోలీసులే హత్యకు గురవుతున్నారు. దాడికి గురవుతున్నారు, అవినీతిలో చిక్కుకుంటున్నారు. ప్రజలపై పదే పదే మూత్ర విసర్జన చేసే సంఘటనలు మధ్యప్రదేశ్‌లో మాత్రమే జరుగుతున్నాయి," అని ఆయన మండిపడ్డారు.

హోం శాఖ బాధ్యత, జవాబుదారీతనంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలే..

ఇటీవల నెలల్లో మధ్యప్రదేశ్‌లో ఇలాంటి దారుణమైన సంఘటనలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఒక దళిత డ్రైవర్‌ను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, ప్లాస్టిక్ పైపుతో కొట్టి, మద్యం తాగమని బలవంతం చేసి, ఆ తరువాత అతనిపై మూత్ర విసర్జన చేయమని బెదిరించినట్లు ఆరోపించాడు.

మరో ఘటనలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వ్యతిరేకించినందుకు ఒక దళిత వ్యక్తిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

2023లో ఒక బీజేపీ నాయకుడు గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది, రాజకీయ పరిణామాలకు దారితీసింది.

ఈ వరుస సంఘటనలు రాష్ట్రంలో పౌరుల భద్రత, సామాజిక గౌరవంపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More