Mahindra Thar : షాకిచ్చిన మహీంద్రా! బెస్ట్ సెల్లింగ్ థార్ ధర పెంపు- 7 నెలల్లో 3వసారి..
Mahindra Thar price hike : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ 'థార్' ధరలను మరోసారి పెంచింది. జులై 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ తాజా ధరల పెంపుతో థార్ ఏకంగా రూ. 37,000 వరకు ప్రియమైంది.
తెలుగు రాష్ట్రాల్లోని యువతను, ఆఫ్-రోడ్ రైడింగ్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే మహీంద్రా థార్ ధరలు మరింత పెరిగాయి. ఈ ఏడాదిలోనే (2026) థార్ ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం! జులై 10 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు మహీంద్రా సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ తాజా సవరణతో దేశవ్యాప్తంగా థార్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 10.32 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 17.99 లక్షల వరకు చేరింది.

వాహన తయారీకి అవసరమయ్యే ముడిసరుకుల వ్యయం, ఉత్పత్తి ఖర్చులు పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. కేవలం థార్ మాత్రమే కాకుండా తన పోర్ట్‌ఫోలియోలోని ఇతర ఎస్‌యూవీల ధరలను కూడా మహీంద్రా సవరించింది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు పన్నులు), రిజిస్ట్రేషన్ ఫీజులు వేర్వేరుగా ఉండటంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఆన్-రోడ్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
కాబట్టి కొత్తగా థార్ కొనుగోలు చేయాలనుకునే వారు బుకింగ్ చేసుకునే ముందే స్థానిక డీలర్లను సంప్రదించి ఫైనల్ కోట్ తెలుసుకోవడం మంచిది.
మహీంద్రా థార్- ఏ వేరియంట్‌పై ఎంత పెరిగింది?
ఈ తాజా ధరల పెంపు మహీంద్రా థార్‌కు చెందిన కేవలం కొన్ని వేరియంట్లకు మాత్రమే పరిమితం కాలేదు, శ్రేణిలోని దాదాపు అన్ని మోడళ్ల ధరలూ పెరిగాయి. కొనుగోలుదారులు ఎంచుకునే ఇంజన్, గేర్‌బాక్స్, డ్రైవ్‌ట్రైన్ ఆధారంగా ఈ పెంపు మారుతుంది.
టాప్ మోడల్ అయిన 'LXT 4WD 2.2 డీజిల్ ఆటోమేటిక్' వేరియంట్‌పై అత్యధికంగా రూ. 37,000 పెరిగింది.
'LXT 4WD పెట్రోల్ ఆటోమేటిక్' మోడల్ ధర రూ. 36,000 పెరిగింది.
'LXT 4WD 2.2 డీజిల్ మాన్యువల్' వేరియంట్ ధర రూ. 34,000 పెరిగింది.
'LXT 4WD పెట్రోల్ మాన్యువల్' వేరియంట్‌పై రూ. 33,000 అదనపు భారం పడనుంది.
బేస్ మోడల్ అయిన 'AXT 2WD డీజిల్ 1.5 మాన్యువల్' ధర కూడా రూ. 32,500 పెరిగింది.
వీటితో పాటు 'LXT 2WD డీజిల్ మాన్యువల్' పై రూ. 29,500, 'LXT 2WD పెట్రోల్ ఆటోమేటిక్' వేరియంట్‌పై రూ. 27,000 మేర ధరలు పెరిగాయి.
ఏడు నెలల్లో మూడుసార్లు..
ఈ ఏడాది (2026) ప్రారంభం నుంచి ఇప్పటివరకు థార్ ధరలు పెరగడం ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో కంపెనీ మొదటగా రూ. 20,000 పెంచింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో రెండోసారి అత్యధికంగా రూ. 43,000 వరకు పెంచింది. ఇప్పుడు జులైలో మరోసారి ధరలు సవరించడంతో కేవలం ఏడు నెలల వ్యవధిలోనే థార్ కొనుగోలుదారులపై వేలల్లో అదనపు భారం పడింది.
థార్‌కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో పాటు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ధరల పెంపు తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


