Cars price hike : షాకిచ్చిన మహీంద్రా! కార్ల ధరలు భారీగా పెంపు- కస్టమర్లపై భారం ఎంతంటే..

Mahindra price hike 2026 : మహీంద్రా అండ్ మహీంద్రా వాహన ప్రియులకు షాక్ ఇచ్చింది! ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో ఎస్‌యూవీలపై 2.7 శాతం, వాణిజ్య వాహనాలపై 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు జులై 10, 2026 నుంచే అమల్లోకి రానున్నాయి. వివరాల్లోకి వెళితే..

Published on: Jul 9, 2026, 05:59:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సొంత కారు కొనుగోలు చేయాలని కలలు కంటున్న వారికి ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థలు షాక్​ ఇస్తున్నాయి. తమ పోర్ట్​ఫోలియోలోని వాహనాల ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. ఈ జాబితాలోకి దిగ్గజ మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ తాజాగా చేరింది. తన పాపులర్ ఎస్‌యూవీ మోడళ్లతో పాటు కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. జులై 10, 2026 నుంచి ఈ పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి.

మహీంద్రా కార్ల ధరలు పెంపు- ఎంతంటే..
మహీంద్రా కార్ల ధరలు పెంపు- ఎంతంటే..

కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మహీంద్రా ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోపై ధరలు సగటున 2.7 శాతం మేర పెరుగుతుండగా, కమర్షియల్ వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న కస్టమర్లపై సగటున 2 శాతం వరకు భారం పడనుంది.

వాహనాల మోడల్, వేరియంట్, స్థానిక మార్కెట్ రిజిస్ట్రేషన్ నిబంధనలను బట్టి ఈ ధరల పెంపులో మార్పులు ఉంటాయి.

వాహనాల ధరలను పెంచిన మహీంద్రా- ఎందుకీ భారం?

గత కొన్ని నెలలుగా ఆటోమొబైల్ రంగానికి అవసరమైన ఉక్కు (స్టీల్), అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి కీలక ముడిసరుకుల ధరలు అంతర్జాతీయంగా, దేశీయంగా విపరీతంగా పెరిగాయి. ఉత్పత్తి వ్యయం పెరిగినప్పటికీ, ఇప్పటివరకు ఆ భారాన్ని వినియోగదారులపై పడకుండా కంపెనీయే భరిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లను కాపాడుకోవడానికి ఈ ధరల సవరణ అనివార్యమైందని సంస్థ స్పష్టం చేసింది.

కాగా పెరిగిన ఉత్పత్తి వ్యయంలో కొంత భాగాన్ని మాత్రమే ఇప్పుడు కస్టమర్లపైకి బదిలీ చేస్తున్నామని మహీంద్రా పేర్కొంది.

ఆటోమొబైల్ మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఈ ఎస్‌యూవీల ధరల పెంపు ప్రభావం కేవలం ఎక్స్-షోరూమ్ ధరలకే పరిమితం కాదు. ఎక్స్-షోరూమ్ ధర పెరగడంతో దానికి అనుగుణంగా ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓ) వద్ద చెల్లించే రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం విలువలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాహనాల ఆన్-రోడ్ ధరలు మరింత ప్రియం కానున్నాయి.

దూసుకుపోతున్న మహీంద్రా సేల్స్..

మహీంద్రా మార్కెట్లో అత్యంత బలమైన అమ్మకాలతో దూసుకుపోతున్న తరుణంలో ఈ నిర్ణయం రావడం గమనార్హం. ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన స్కార్పియో ఎన్, ఎక్స్‌యూవీ 7ఎక్స్​ఓ, థార్ రాక్స్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటి మోడళ్లకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బుకింగ్స్ వస్తున్నాయి. వీటితో పాటు కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కూడా మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ప్రతి నెలా రెండంకెల వృద్ధిని సాధిస్తూ, దేశీయ మార్కెట్లో లీడింగ్ పొజిషన్‌లో ఉన్న మహీంద్రా.. ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ ధైర్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యావత్ భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలోనే ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే టాటా మోటార్స్, కియా ఇండియా, హ్యుందాయ్, మారుతీ సుజుకీ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ముడిసరుకుల ధరల కారణంగా తమ వాహనాల ధరలను సవరించిన సంగతి తెలిసిందే.

ఇక మహీంద్రా నుంచి రానున్న రోజుల్లో క్రేజీ లైనప్ లాంచ్​కి రెడీ అవుతోందనే చెప్పాలి. ఇప్పటికే మార్కెట్​లో దూసుకెళుతున్న స్కార్పియో ఎన్​కి సంస్థ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని తీసుకొస్తోంది. మరోవైపు విజన్ ఎస్​ పేరుతో కొత్త ఎస్​యూవీని సైతం లాంచ్​కు రెడీ చేస్తోంది. ఇది స్కార్పియో-ఎన్​కి బుడ్డి వర్షెన్​ అని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More