24.7 కి.మీ మేలేజ్తో Mahindra XUV 3XO CNG లాంచ్- ధర, ఫీచర్లు, సేఫ్టీ వివరాలు..
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా తమ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’లో సీఎన్జీ వర్షన్‌ను రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ, టర్బో ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీలకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ కాంపాక్ట్ ఎస్యూవీ 'ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ' మోడల్లో విప్లవాత్మక మార్పులు చేసింది. ఇంధన వ్యయ భారాన్ని తగ్గించేందుకు గాను సీఎన్జీ వర్షన్‌ను ‘జెడ్ఎన్జీ’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త సీఎన్జీ ఎస్యూవీ ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) సంస్థ ఖరారు చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ- 4 వేరియంట్లలో..
మహీంద్రా ఈ సీఎన్జీ కారును ఎంఎక్స్ ఎడ్జ్, ఆర్ఈవీఎక్స్ ఎడ్జ్ (ఓ), ఏఎక్స్5 (ఏఎక్స్5), ఆర్ఈవీఎక్స్ ఏ అనే నాలుగు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది.
విభిన్న వేరియంట్ల ధరల పట్టిక:
ఎంఎక్స్ ఎడ్జ్ : రూ. 9.99 లక్షలు
ఆర్ఈవీఎక్స్ ఎడ్జ్ (ఓ): రూ. 10.79 లక్షలు
ఏఎక్స్5 : రూ. 11.19 లక్షలు
ఆర్ఈవీఎక్స్ ఏ: రూ. 12.27 లక్షలు
సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే సీఎన్జీ లైన్-అప్‌లో ధర వ్యత్యాసం దాదాపు రూ. 2.28 లక్షల వరకు ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ- బూట్ స్పేస్ సమస్యకు చెక్!
సాధారణంగా సీఎన్జీ కార్లలో ఒకే పెద్ద సిలిండర్ ఉండటం వల్ల బూట్ స్పేస్ (లగేజ్ స్థలం) పూర్తిగా నిండిపోతుంది. కానీ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ జెడ్ఎన్జీ మోడల్లో 'ట్విన్-సిలిండర్' (డ్యూయల్ సిలిండర్) అమరికను అందించారు.
బూట్ ఫ్లోర్ కింద ప్రక్కపక్కనే రెండు చిన్న సిలిండర్లను అమర్చడం వల్ల లగేజీ సర్దుకోవడానికి పైన తగినంత స్థలం దక్కుతుంది. ప్రయాణికులు తమ అవసరాన్ని బట్టి పెట్రోల్ నుంచి సీఎన్జీకి లేదా సీఎన్జీ నుంచి పెట్రోల్‌కి సులువుగా మారేందుకు వీలుగా క్యాబిన్ లోపల ప్రత్యేకమైన ఫ్యూయల్ సెలెక్టర్ స్విచ్‌ను ఏర్పాటు చేశారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ- టర్బో ఇంజిన్..
ఈ సీఎన్జీ మోడల్లో 1.2-లీటర్ ఎమ్-స్టాలియన్ జీ12 టర్బోఛార్జ్డ్ ఎంపీఎఫ్ఐ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 110 హెచ్‌పీ పవర్, 200 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1,500 నుంచి 3,500 ఆర్‌పిఎమ్ మధ్య గరిష్ట టార్క్ అందుబాటులోకి వస్తుంది.
సీఎన్జీ ఇంధనంతో నడిచేందుకు ప్రత్యేకంగా రీ-కాలిబ్రేట్ చేసిన ఇంజెక్షన్ సిస్టమ్, ఆప్టిమైజ్ చేసిన టర్బోఛార్జర్ను ఇందులో అందించారు. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ కారు కేవలం 4.9 సెకన్లలోనే 0 నుంచి 60 కి.మీ వేగాన్ని, 11.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని మహీంద్రా స్పష్టం చేసింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ- సేఫ్టీ..
ప్రయాణికుల రక్షణకు మహీంద్రా అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ వేరియంట్లో ఏకంగా 35 రకాల భద్రతా ఫీచర్లను స్టాండర్డ్‌గా జోడించింది.
అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ యాంకర్లు, అందరు ప్రయాణికులకు 3-పాయింట్ సీట్‌బెల్టులు, సీట్‌బెల్ట్ రిమైండర్లను పొందుపరిచారు. అవసరాన్ని బట్టి ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ను డియాక్టివేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అంతేకాకుండా, 350 ఎంఎం నీటి గుండా వెళ్లగల సామర్థ్యం , 23.6 డిగ్రీల అప్రోచ్ యాంగిల్‌తో ఇది గుంతలు, వరద నీరు ఉన్న రహదారులను కూడా సునాయాసంగా దాటగలదు.
ఇక ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ వేరియంట్ 24.71 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ- క్యాబిన్, ప్రీమియం ఫీచర్లు..
పరిమాణంలో ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ ఎస్యూవీ 3,990 ఎంఎం పొడవు, 1,821 ఎంఎం వెడల్పుతో 2,600 ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంది. లోపల ప్రయాణించే వారికి మెరుగైన లెగ్‌రూమ్ (ఫ్రంట్ 1,050 ఎంఎం, రియర్ 878 ఎంఎం), హిప్రూమ్ లభిస్తుంది. డ్రైవర్‌కు రోడ్డు స్పష్టంగా కనిపించేలా 1,398 ఎంఎం ఎత్తులో ఐ-పాయింట్‌ను డిజైన్ చేశారు.
ఈ ఎస్‌యూవీలో నార్మల్, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. పార్కింగ్ సమయంలో స్టీరింగ్ తేలికగా, వేగం పెరిగేకొద్దీ గ్రిప్‌ను పెంచేలా ఇది పనిచేస్తుంది. ఇంటీరియర్‌లో 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16-ఇంచుల అలాయ్ వీల్స్ వంటి అధునాతన హంగులను జోడించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


