మహీంద్రా 'XUV 7XO'గా ఎక్స్‌యూవీ700- ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్ డేట్ ఇదే..
మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్కాబోతోంది. అయితే ఈ మోడల్ పేరును సంస్థ మార్చింది. కొత్త మహీంద్ర ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ లాంచ్ డేట్ సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
స్వదేశీ వాహన తయారీ సంస్థ మహింద్రా తమ ప్రముఖ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 పేరును ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓగా మార్చింది. ఈ విషయాన్ని కంపెనీ తమ సోషల్ మీడియా పేజీలో టీజర్ ద్వారా ఒక అధికారిక ప్రకటన చేసింది. అలాగే, కొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ మోడల్‌ను జనవరి 5వ తేదీన భారత మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్లు కూడా మహింద్రా ధృవీకరించింది.

గత నెలలోనే కంపెనీ 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ' పేరుతో ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ పేరు మార్పు ఊహాగానాలు మొదలయ్యాయి. తమ ఎస్‌యూవీ పేరును మార్చడం మహింద్రాకు ఇది రెండోసారి! ఇంతకుముందు, ఎక్స్‌యూవీ300 పేరును ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓగా మార్చింది. దీనికి తోడు కంపెనీ ఎక్స్‌యూవీ 1ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 5ఎక్స్ఓ అనే పేర్ల కోసం కూడా ట్రేడ్‌మార్క్ దరఖాస్తులను దాఖలు చేసింది. అంటే, భవిష్యత్తులో ఈ పేర్లతో కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉంది.
మహింద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓలో వచ్చే మార్పులు ఏంటి?
ఎక్స్‌టీరియర్ మార్పులు-
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎక్స్టీరియర్లో ఈ కింది మార్పులను చూడవచ్చు:
హెడ్‌లైట్ కాన్ఫిగరేషన్: హెడ్‌లైట్‌ను రీ-డిజైన్ చేశారు. ఇది స్కార్పియో ఎన్లో చూసినట్లుగా డ్యూయల్ బారెల్స్ని కలిగి ఉంటుంది. ఇవి ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లుగానే కొనసాగుతాయి. అయితే ఈసారి మహింద్రా ప్రొజెక్టర్ అమరికను ఎంచుకునే అవకాశం ఉంది.
డీఆర్‌ఎల్: డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ పాత మోడల్‌లో ఉన్నట్లుగా కిందకు విస్తరించకుండా, ఇకపై యూ- ఆకారాన్ని సంతరించుకుంటుంది.
గ్రిల్, బంపర్: డిస్కంటిన్యూ చేసిన ఎక్స్‌యూవీ500 గ్రిల్‌ను పోలి ఉండే కొత్త గ్రిల్‌ను ముందు భాగంలో ప్రవేశపెడతారు. బంపర్ కూడా కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది.
సైడ్ ప్రొఫైల్: సైడ్ల కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్ పాతవి కొనసాగుతాయి.
వెనుక భాగం: ఇటీవల లాంచ్ అయిన ఎక్స్ఈవీ 9ఎస్‌లో చూసినట్లుగా, వెనుక టెయిల్ ల్యాంప్ డిజైన్ కొత్తగా ఉంటుంది.
ఇంటీరియర్ మార్పులు-
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఇంటీరియర్ డిజైన్‌ను ఇప్పుడు ఎక్స్ఈవీ 9ఎస్ మోడల్ ప్రభావితం చేయనుంది. కాబట్టి, ఈ కింది మార్పులను ఆశించవచ్చు:
స్టీరింగ్ వీల్: ఇల్యూమినేటెడ్ మహింద్రా లోగోతో కూడిన 2 స్పోక్ స్టీరింగ్ వీల్‌ను చూడవచ్చు.
స్క్రీన్ కాన్ఫిగరేషన్: మూడు స్క్రీన్‌ల అమరిక ఇందులో ఉంటుందని భావిస్తున్నారు. అంటే, ప్రయాణికులకు కూడా ప్రత్యేక డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
ప్రీమియం ఫీచర్లు: మహింద్రా అదనంగా డాల్బీ అట్మోస్, రెండొవ వరుసకు కెప్టెన్ సీట్లు, వెంటిలేషన్ ఫీచర్, ముందు పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ పార్కింగ్ వంటి ఇతర అప్గ్రేడ్స్ని కూడా జోడించవచ్చు.
ఇంజిన్ ఆప్షన్లు-
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ700 మాదిరిగానే అదే ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది:
డీజిల్ ఇంజిన్: 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ రెండు వేర్వేరు ట్యూనింగ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.
పెట్రోల్ ఇంజిన్: 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఒకే ట్యూనింగ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది.
ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. కాబట్టి, 6-స్పీడ్ మాన్యువల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంటాయి. అదనంగా, ఆల్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రైన్ ఎంపిక కూడా కొనసాగుతుంది.
లాంచ్ నాటికి ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


