MakeMyTrip IPO : త్వరలోనే మేక్​మైట్రిప్ ఐపీఓ! సెబీ చేతికి కాన్ఫిడెన్షియల్​గా పేపర్లు..

ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ 'మేక్‌మైట్రిప్' భారత స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి తొలి అడుగు వేసింది. తన భారతీయ విభాగం ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్ పత్రాలను రహస్యంగా దాఖలు చేసింది. ఆ వివరాలు..

Published on: Jul 18, 2026, 16:06:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ‘మేక్‌మైట్రిప్’ దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు అధికారికంగా సన్నాహాలు మొదలుపెట్టింది. అమెరికాలోని నాస్‌డాక్ ఎక్స్​ఛేంజ్​లో లిస్ట్ అయిన ఈ మాతృ సంస్థ, ఇప్పుడు తన పూర్తి యాజమాన్యంలోని భారతీయ విభాగం 'మేక్‌మైట్రిప్ (ఇండియా) లిమిటెడ్'ను ఇక్కడి మార్కెట్లలో లిస్ట్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే, భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెబీ' వద్ద ప్రీ-ఫైల్డ్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్​హెచ్​పీ)ని కంపెనీ రహస్యంగా దాఖలు చేసింది. దీనితో పాటు బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్​లలో కూడా ఈ ఐపీఓ దరఖాస్తు ప్రతిని సమర్పించింది.

మేక్​మైట్రిప్ ఐపీఓ అప్డేట్స్..
మేక్​మైట్రిప్ ఐపీఓ అప్డేట్స్..

అయితే, ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎంత మొత్తం నిధులు సేకరించనున్నారు అనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్​ఛేంజ్ కమిషన్​కు జులై 17న సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మేక్‌మైట్రిప్ ఈ కీలక విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2011 నుంచి అమెరికా మార్కెట్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సంస్థకు, భారత మార్కెట్లో ఐపీఓకు రావడం అనేది ఒక చారిత్రాత్మక మైలురాయి కానుంది.

కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్ అంటే ఏంటి?

మేక్‌మైట్రిప్ ఐపీఓ ప్రక్రియ కోసం సెబీ తీసుకొచ్చిన 'కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్' విధానాన్ని సంస్థ ఎంచుకుంది. ఈ విధానం ప్రకారం.. ఐపీఓ పరిమాణం, కంపెనీ విలువ, షేర్ల ధరల శ్రేణి వంటి అత్యంత కీలకమైన వివరాలను ప్రాథమిక దశలో బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉంచే వెసులుబాటు కంపెనీలకు లభిస్తుంది. లిస్టింగ్ ప్రక్రియ చివరి దశకు వచ్చే వరకు ఈ వివరాలు బయటకు రావు. ఐపీఓ ప్రారంభ దశల్లో పబ్లిక్ డిస్‌క్లోజర్స్ వల్ల వచ్చే మార్కెట్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మరింత వెసులుబాటును పొందడానికి పెద్ద పెద్ద కంపెనీలు ప్రస్తుతం ఈ మార్గాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నాయి.

మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ‘ఆఫర్ ఫర్ సేల్’ రూపంలో వచ్చే అవకాశం ఉంది. అంటే, ప్రస్తుతమున్న వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయిస్తారు. ఈ పద్ధతిలో షేర్ల అమ్మకం ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా ఆయా ఇన్వెస్టర్లకే వెళ్తాయి తప్ప కంపెనీ ఖాతాలోకి రావు. ఈ ప్రతిష్టాత్మక ఐపీఓ ప్రక్రియను నిర్వహించడానికి కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, జేపీమోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియా సంస్థలను బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా మేక్‌మైట్రిప్ నియమించుకుంది.

ఈ ఐపీఓ వల్ల మేక్‌మైట్రిప్‌కు వచ్చే లాభం ఏంటి?

అమెరికా ఎస్‌ఈసీ ఫైలింగ్ ప్రకారం.. మేక్‌మైట్రిప్ లిమిటెడ్, అలాగే సింగపూర్‌కు చెందిన దాని పూర్తి అనుబంధ సంస్థ ‘ఐబిబో గ్రూప్ హోల్డింగ్స్’ కలిసి తమ వద్ద ఉన్న మేక్‌మైట్రిక్ ఇండియా ఈక్విటీ షేర్లను ఈ ఐపీఓ ద్వారా విక్రయించనున్నాయి. షేర్ల అమ్మకం తర్వాత కూడా, మేక్‌మైట్రిప్ ఇండియా కంపెనీ నాస్‌డాక్‌లో ఉన్న మాతృ సంస్థ అనుబంధ విభాగంగానే కొనసాగుతుంది. దాని ఆర్థిక నివేదికలన్నీ మాతృ సంస్థతోనే కలిసి ఉంటాయి.

"భారతదేశంలో లిస్టింగ్ కావడం వల్ల స్థానిక మార్కెట్లో మా బ్రాండ్ విలువ మరింత పెరుగుతుంది. అంతేకాకుండా, ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో.. అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడానికి, వారిని సంస్థలో నిలుపుకోవడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది," అని మేక్‌మైట్రిప్ తన ఫైలింగ్‌లో పేర్కొంది.

నిధుల వినియోగం ఎందుకోసం?

ఈ షేర్ల విక్రయం ద్వారా మేక్‌మైట్రిప్, ఐబిబో గ్రూప్‌లకు లభించే నిధులు గ్రూప్ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. ఈ నిధులను వ్యాపార దీర్ఘకాలిక విస్తరణకు, వ్యూహాత్మక కొనుగోళ్లకు, అలాగే మేక్‌మైట్రిప్‌కు చెందిన కన్వర్టిబుల్ సెక్యూరిటీలతో కూడిన వివిధ రకాల బాండ్లను తిరిగి కొనుగోలు చేయడానికి ఉపయోగించనున్నారు. మధ్య కాలిక ప్రణాళికల్లో భాగంగా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి మరికొన్ని వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

అంతేకాకుండా, భవిష్యత్తులో పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు మేక్‌మైట్రిప్ ఒక సరికొత్త యోచన చేస్తోంది. భారత్- అమెరికా క్యాపిటల్ మార్కెట్లు రెండింటిలోనూ సులభంగా ట్రేడ్ చేసుకునేలా షేర్ల నిర్మాణాన్ని రూపొందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీనికి గనుక నియంత్రణ సంస్థల ఆమోదం లభిస్తే, ఇన్వెస్టర్లకు అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడం మరింత సులువవుతుంది.

ఇక ఈ మేక్‌మైట్రిప్ ఐపీఓకి సంబంధించిన పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More