...
...
Next Story

బంగ్లాదేశ్‌లో ఆగని హింస: వసూళ్ల ఆరోపణలతో మైనారిటీని కొట్టి చంపిన అల్లరి మూక

బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో దారుణం జరిగింది. వసూళ్ల ఆరోపణలతో అమృత్ మొండల్ అనే మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని అల్లరి మూక కొట్టి చంపింది. దేశంలో కొనసాగుతున్న అశాంతి, వరుస హత్యల నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Published on: Dec 25, 2025, 21:43:29 IST
Advertisement

బంగ్లాదేశ్‌లో అశాంతి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా రాజ్‌బరి జిల్లాలో ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి మూకదాడికి బలైపోయారు. వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిని దారుణంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు గురువారం వెలుగులోకి వచ్చాయి.

అసలేం జరిగింది?

శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన బంగ్లాదేశ్ పోలీసులు (Picture for representation/ANI )
శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన బంగ్లాదేశ్ పోలీసులు (Picture for representation/ANI )

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రాజ్‌బరి జిల్లా పాంగ్షా పరిధిలోని హోసెన్‌దంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని అమృత్ మొండల్‌గా గుర్తించారు. అదే గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తిని అమృత్ డబ్బులు డిమాండ్ చేశాడని, ఆ సమయంలో గొడవ జరిగిందని సమాచారం. అమృత్ తన గ్యాంగ్‌తో కలిసి షాహిదుల్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగడంతో, కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారు.

ఆ కేకలు విన్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జనాన్ని చూసి అమృత్ అనుచరులు అక్కడి నుంచి పరారవ్వగా, అమృత్ మాత్రం గ్రామస్థులకు చిక్కాడు. ఆగ్రహంతో ఉన్న జనం అతడిని తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన అమృత్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

పోలీసుల వివరణ.. నేర చరిత్ర

ఈ ఘటనపై పాంగ్షా సర్కిల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేబబ్రత సర్కార్ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని తెలిపారు. మృతుడు అమృత్ మొండల్‌పై గతంలోనే పాంగ్షా పోలీస్ స్టేషన్‌లో ఒక హత్య కేసుతో పాటు మరో రెండు కేసులు నమోదై ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. కేవలం రాజ్‌బరిలోనే కాకుండా, రాజధాని ఢాకాలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

బుధవారం సాయంత్రం ఢాకాలోని ఒక ఫ్లైఓవర్ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబు విసిరారు. ఈ ఘటనలో రోడ్డు పక్కన టీ తాగుతున్న 20-22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

గత వారం కూడా దీపు చంద్ర దాస్ (27) అనే యువకుడిని అల్లరి మూక కొట్టి చంపి, చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టిన దారుణ ఘటన వెలుగుచూసింది.

విద్యార్థి నిరసనల్లో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ హాదీ, డిసెంబర్ 18న కాల్పుల్లో మరణించినప్పటి నుండి బంగ్లాదేశ్‌లో ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. ఈ వరుస ఘటనలు అక్కడి మైనారిటీ వర్గాల్లో తీవ్ర భయాందోళనలను నింపుతున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న ఈ 'మాబ్ జస్టిస్' (మూక తీర్పులు) ఆ దేశ శాంతిభద్రతలపై పెను సవాలుగా మారాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe