మనసున్న మహారాజు! రోడ్డు పక్కన పేద పిల్లలకు పాఠాలు చెబుతున్న మాస్టారు..
మనసును కదిలించే దృశ్యం! దిల్లీకి చెందిన ఓ టీచర్.. నిరుపేద విద్యార్థులకు చదువు చెబుతూ కనిపించారు. అది కూడా రోడ్డు పక్కనే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దక్షిణ దిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతం.. నిత్యం వాహనాల రణగొణ ధ్వనులు, తమ పనుల్లో తాము వేగంగా దూసుకుపోయే జనం. కానీ ఆ రద్దీ మధ్య ఒక వ్యక్తి మాత్రం ఆగిపోయారు! తన కోసం కాదు, సమాజంలో వెనుకబడిన పిల్లల భవిష్యత్తు కోసం. ఎటువంటి బ్యానర్లు, కెమెరాలు, ఆడంబరాలు లేకుండా ఫుట్‌పాత్‌పై కూర్చుని నిరుపేద పిల్లలకు అక్షరాలు నేర్పిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

ఈ అద్భుతమైన దృశ్యాన్ని అన్షు కుమార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రపంచానికి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
ఆ దృశ్యం వెనుక ఉన్న అసలు కథ..
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఒక వ్యక్తి ఫుట్‌పాత్‌పై కూర్చుని ఉండగా, ఆయన చుట్టూ కొందరు పిల్లలు చేరి శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. అక్కడ బ్లాక్ బోర్డు లేదు, బెంచీలు లేవు. పిల్లలు తమ ఒళ్లోనే నోట్బుక్లు పెట్టుకుని రాసుకుంటున్నారు.
ఆ గురువు మాత్రం ఎంతో ఓపికగా, చిరునవ్వుతో వారికి పాఠాలు వివరిస్తున్నారు.
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన్ని కృషన్ కుమార్ అని గుర్తించారు. ఆయన వృత్తిరీత్యా పీజీటీ టీచర్. తన ఖాళీ సమయంలో వీధి పిల్లలకు, సరైన విద్యావకాశాలు లేని వారికి ఉచితంగా విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
ఆడంబరాలకు ఆమడదూరంలో..
ఈ రోజుల్లో చిన్న సాయం చేసినా సోషల్ మీడియాలో రీల్స్ కోసం పాకులాడే కాలంలో, కృషన్ కుమార్ ఏ ప్రచారాన్ని కోరుకోకుండా చేస్తున్న ఈ కృషి నిజంగా అభినందనీయం.
"ఈ స్వార్థపూరిత ప్రపంచం తరపున మీకు ధన్యవాదాలు సార్," అంటూ వీడియో పోస్ట్ చేసిన అన్షు కుమార్ పేర్కొన్నారు.
నెటిజన్ల ప్రశంసల వర్షం..
ఈ వీడియో చూసిన వేలాది మంది నెటిజన్లు ఆయన నిబద్ధతకు సలాం చేస్తున్నారు.
"నిజమైన విద్య అంటే ఇదే" అని ఒకరు కామెంట్ చేయగా..
"హీరోలందరూ కేప్స్ ధరించరు, కొందరు ఇలా పుస్తకాలు పట్టుకుంటారు," అని మరొకరు రాశారు.
"రీల్స్, ఫేమ్ కోసం పాకులాడే లోకంలో ఇదొక స్వచ్ఛమైన బంగారం లాంటి దృశ్యం," అంటూ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు.
“ఆయన నా 10వ తరగతి టీచర్. ఆయన్ని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. ఆయన చాలా గొప్ప టీచర్. గొప్ప మానవత్వం ఉన్న మనిషి,” అని ఇంకొకరు కామెంట్ చేశారు.
“ఆయన అన్ని విషయాల్లోనూ ధనవంతుడే,” అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
వందల కోట్లు ఖర్చు పెట్టినా దొరకని తృప్తి, ఒక నిరుపేద పిల్లాడు అక్షరం నేర్చుకున్నప్పుడు ఆ గురువు ముఖంలో కనిపిస్తోంది. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం మానవత్వం బతికే ఉంటుందని ఈ ఘటన నిరూపిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


