Antilia : ముకేశ్​ అంబానీ 2 బిలియన్​ డాలర్ల ఇల్లు ఇలా ఉంటుందా? యాంటిలియా లోపలి వీడియో వైరల్​..

ముకేశ్ అంబానీ నివాసం 'యాంటిలియా' ఇంటీరియర్​ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ షేర్ చేసిన ఈ వీడియోలో, ఈ ప్రపంచ ప్రసిద్ధ భవనంలోని విలాసం, భారతీయ సంప్రదాయ కళాకృతులు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

Published on: Feb 17, 2026 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముకేశ్​ అంబానీ.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి.. దేశంలోనే సంపన్నుడు, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధిపతి, యాంటిలియా! మరీ ముఖ్యంగా ముంబైలోని ఆకాశహర్మ్యాల్లో ఈ యాంటిలియాకు ప్రత్యేక స్థానం ఉంది. ముకేశ్​ అంబానీ నివాసం బయట నుంచి చాలాసార్లు చూసే ఉంటారు. కానీ భవనం లోపల ఎలా ఉంటుంది? అక్కడ విలాసాలు ఏ స్థాయిలో ఉంటాయి? అనే విషయాలు ఎప్పుడూ రహస్యమే. కానీ ఇప్పుడు, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ అద్భుత కట్టడం లోపలి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ముకేశ్​ అంబానీ యాంటిలియా ఇంటీరియర్​..
ముకేశ్​ అంబానీ యాంటిలియా ఇంటీరియర్​..

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల మేనల్లుడు విక్రమ్ సల్గావ్కర్ వివాహ వేడుకల సందర్భంగా ఈ వీడియో తీశారు. ఇందులో నీతా అంబానీ సంప్రదాయ ఆరెంజ్, గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోతుండగా, ఆమె వెనుక కనిపిస్తున్న యాంటిలియా ఇంటీరియర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

భారతీయ సంప్రదాయం.. ఆధునిక విలాసం!

యాంటిలియా కేవలం ఒక భవనం కాదు! అది ఆధునిక విలాసానికి, భారతీయ సంప్రదాయానికి ప్రతీక.

వీడియోలో కనిపించిన కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి:

అద్భుతమైన వ్యూ: భవనం అంతటా అమర్చిన భారీ గ్లాస్ వాల్స్ (ఫ్లోర్-టు-సీలింగ్) ద్వారా ముంబై నగరం, అరబిక్ సముద్ర అందాలు స్పష్టంగా కనిపిస్తాయి.

కళాకృతులు: గోడలపై అమర్చిన సంప్రదాయ భారతీయ చిత్రపటాలు, తళతళలాడే మార్బుల్ ఫ్లోరింగ్ భవనానికి రాజసాని తెచ్చిపెట్టాయి.

వెలుగుల జిలుగులు: గది మధ్యలో వేలాడుతున్న భారీ క్రిస్టల్ షాండ్లియర్లు ఆ గదికి ఒక ప్యాలెస్ లుక్ ఇచ్చాయి.

ప్రకృతి ఒడిలో: ఆకాశమంత ఎత్తులో ఉన్న ఈ భవనంలో పచ్చని పచ్చిక బయళ్లు, కుండీల్లో పెరిగే చెట్లు ఉండటం విశేషం. ఇవి ఇంటి లోపలి భాగాన్ని బయటి టెర్రస్‌తో అద్భుతంగా అనుసంధానిస్తున్నాయి.

యాంటిలియా గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు..

అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక కల్పిత ద్వీపం పేరు మీద దీనికి 'యాంటిలియా' అని పేరు పెట్టారు. దీని విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ. 16,000 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా.

ఎత్తు, వైశాల్యం: 27 అంతస్తులు కలిగిన ఈ రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ ఇల్లు 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. విశేషమేమిటంటే, ఇక్కడ ప్రతి అంతస్తు సాధారణ రెండంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది.

భద్రత: ఈ కట్టడం రిక్టర్ స్కేలుపై 8 తీవ్రత కలిగిన భూకంపాన్ని కూడా తట్టుకోగలదు.

అత్యాధునిక సౌకర్యాలు: భవనంలో 168 కార్లు పట్టే ఆరు అంతస్తుల పార్కింగ్, 50 సీట్ల ప్రైవేట్ థియేటర్, స్పా- మూడు హెలిప్యాడ్‌లు ఉన్నాయి.

ప్రత్యేకత: యాంటిలియాలో ఏ రెండు అంతస్తుల డిజైన్ లేదా వాడిన మెటీరియల్ ఒకేలా ఉండవు!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాల్లో ఒకటిగా పేరుగాంచిన యాంటిలియా, అంబానీ కుటుంబ వేడుకల పుణ్యమా అని మరోసారి వార్తల్లో నిలిచింది.

నెటిజన్ల స్పందన ఇలా..

ముకేశ్​ అంబానీ యాంటిలియా ఇంటీరియర్​ వీడియో చూసి చాలా మంది వావ్​ అంటున్నారు. “ముకేశ్​ అంబానీ ఇల్లు లోపలి నుంచి ఇలా ఉంటుంది అన్నమాట!” అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొందరు మాత్రం కామెంట్​ సెక్షన్​లో నెగిటివ్​గా స్పందిస్తున్నారు. “ఈ మహిళను చూసి విసుగెత్తిపోయింది,” అంటూ కామెంట్లు పెడుతున్నారు.