భార్యకు భరణం చెల్లించాల్సి వస్తుందని రూ. 6 కోట్ల ఉద్యోగానికి రాజీనామా
భార్య దాఖలు చేసిన భరణం కేసు విచారణలో ఉండగానే ఓ కెనడియన్ జాతీయుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయాడు. అయితే, ఉద్యోగానికి రాజీనామా చేసినంత మాత్రాన కుటుంబ పోషణ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని సింగపూర్ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది.
భార్యకు భరణం (Maintenance) చెల్లించడం నుంచి తప్పించుకునేందుకు సింగపూర్‌లో భారీ వేతనం లభించే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ కెనడియన్ వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఉద్యోగం మానేసినప్పటికీ, ఆర్థిక బాధ్యతలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసిన ఫ్యామిలీ కోర్టు.. భార్యాపిల్లల పోషణ నిమిత్తం బకాయిల కింద 6,34,000 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 4.5 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.

కేసు పూర్వాపరాలు
కోర్టు పత్రాల ప్రకారం.. కెనడాకు చెందిన ఈ దంపతులు నలుగురు పిల్లలతో కలిసి 2013 డిసెంబర్‌లో సింగపూర్‌కు వచ్చారు. సదరు వ్యక్తి ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. 2023 నాటికి అతడి వార్షిక ఆదాయం 8,60,000 సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 6 కోట్లు) పైమాటే. భార్య గృహిణి కాగా, పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదువుతున్నారు. అయితే, ఆగస్టు 2023లో భర్త వేరొక మహిళతో జీవించేందుకు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో సమస్య తలెత్తింది.
వివాదానికి దారితీసిన అంశాలు
విడిపోయిన తర్వాత, కుటుంబ ఖర్చుల నిమిత్తం మొదట నెలకు 20,000 డాలర్లు (రూ. 15.5 లక్షలు) ఇస్తానని చెప్పిన భర్త, తర్వాత ఆ మొత్తాన్ని 11,000 డాలర్లకు (రూ. 7.7 లక్షలు) తగ్గించాడు. దీంతో అక్టోబర్ 2, 2023న భార్య 'ఉమెన్స్ చార్టర్' కింద భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. తమ జీవన ప్రమాణాలకు తగ్గట్టుగా భరణం లేకపోతే పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీరవని ఆమె పేర్కొంది. ఖర్చులు తగ్గించుకునేందుకు కెనడా వెళ్దామని భర్త సూచించినా, అక్కడ ప్రైవేట్ స్కూల్ ఫీజులు సింగపూర్ తో సమానంగా ఉంటాయని భార్య ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.
ఉద్యోగానికి రాజీనామా - కోర్టు విచారణ
భార్య కోర్టులో పిటిషన్ వేసిన వారం రోజులకే (అక్టోబర్ 9, 2023) సదరు వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. జూలై 2024 వరకు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, అతను వైదొలిగి, 2024 జనవరిలో కెనడా వెళ్లిపోయాడు. తన భార్య ఆఫీసులో తన గురించి తప్పుడు ప్రచారం (Smear campaign) చేయడం వల్లే ఉద్యోగం మానేయాల్సి వచ్చిందని అతను కోర్టులో వాదించాడు.
అయితే, న్యాయమూర్తి ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. "సంస్థ అతడిని తొలగించలేదు, అతనే స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు. భరణం ఎగ్గొట్టే ఉద్దేశంతోనే మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాడు" అని భార్య తరఫున చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది.
తీర్పు ముఖ్యాంశాలు న్యాయమూర్తి ఫాంగ్ తన తీర్పులో కీలక విషయాలను ప్రస్తావించారు:
సంపాదన సామర్థ్యం: రాజీనామా చేసినంత మాత్రాన బాధ్యత తీరదు. అతను కెనడాలో కొత్త ఉద్యోగంలో చేరే వరకు (అక్టోబర్ 2024), సింగపూర్ జీతం ఆధారంగానే అతని 'ఎర్నింగ్ కెపాసిటీ'ని పరిగణనలోకి తీసుకున్నారు.
చెల్లించాల్సిన మొత్తం: అద్దె, స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులన్నీ లెక్కించి.. సెప్టెంబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2025 వరకు భరణం కింద మొత్తం 7,88,300 సింగపూర్ డాలర్లు నిర్ణయించారు. ఇందులో అతను ఇప్పటికే కొంత చెల్లించగా, మిగిలిన 6,33,916 డాలర్లను జనవరి 15, 2026 లోపు ఏకమొత్తంగా చెల్లించాలని ఆదేశించారు.
భవిష్యత్తు బాధ్యత: అక్టోబర్ 2024 నుంచి అతనికి కెనడాలో జీతం తగ్గడం వల్ల, అప్పటి నుంచి పిల్లల పోషణ ఖర్చులను భార్యాభర్తలిద్దరూ సమానంగా భరించాలని సూచించారు.
ప్రస్తుతం సదరు వ్యక్తి ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లారు. అప్పీల్ విచారణ పూర్తయ్యే వరకు ఈ భారీ మొత్తాన్ని చెల్లించడంపై కోర్టు స్టే విధించింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


