...
...
Next Story

Goa Vande Bharat : గోవా.. ఇక మరింత దగ్గర! వందే భారత్​ ఎక్స్​ప్రెస్​పై రైల్వే శాఖ బిగ్ అప్డేట్

ఐటీ రాజధాని బెంగళూరు- పర్యాటక కేంద్రమైన గోవా మధ్య ప్రయాణించే వారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం నడుస్తున్న మంగళూరు-మడ్‌గావ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరు వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ వందే భారత్ మార్గం, వేళల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 5, 2026, 06:46:03 IST
Advertisement

సిలికాన్ సిటీ బెంగళూరు నుంచి అందమైన గోవా తీరాలకు వెళ్లాలనుకునే పర్యాటకులకు, నిత్యం ప్రయాణించే వారికి భారతీయ రైల్వే తీపి కబురు అందించింది. కర్ణాటకలోని మలనాడ్, తీరప్రాంత పట్టణాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ బెంగళూరు-గోవా మధ్య సరికొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం మంగళూరు సెంట్రల్ నుంచి గోవాలోని మడ్‌గావ్ వరకు నడుస్తున్న వందే భారత్ రైలును బెంగళూరులోని యశ్వంత్‌పూర్ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు.

గోవా వందే భారత్- కొత్త రైలు నెంబర్లు, మార్గం..

వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలు..
వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలు..

ప్రస్తుతం విస్తరిస్తున్న ఈ ప్రతిపాదిత సర్వీస్ 'యశ్వంత్‌పూర్-మడ్‌గావ్-యశ్వంత్‌పూర్' (రైలు సంఖ్యలు 26655/26656) పేరుతో పట్టాలెక్కనుంది. ఈ రైలు బెంగళూరు నుంచి బయలుదేరి మంగళూరు జంక్షన్ మీదుగా గోవా వెళుతుంది.

ప్రతిపాదిత స్టేషన్ల వివరాలు..

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మార్గమధ్యంలో యశ్వంత్‌పూర్ (బెంగళూరు), శ్రవణబెళగొళ, హాసన్, సకలేశ్‌పూర్, సుబ్రమణ్య రోడ్, కబక పుత్తూరు, మంగళూరు జంక్షన్, ఉడుపి, కుందాపూర్, బైందూర్, మురుడేశ్వర్, గోకర్ణ రోడ్, కార్వార్ స్టేషన్లలో ఆగుతూ గోవాలోని మడ్‌గావ్ చేరుకుంటుంది. ఈ మార్గం వల్ల టూరిస్టులతో పాటు తీరప్రాంత వ్యాపారులకు, భక్తులకు రవాణా సదుపాయం చాలా సులువవుతుంది.

ప్రతిపాదిత సమయాలు, ప్రయాణ వేళలు..

ఈ గోవా వందే భారత్ రైలుకు సంబంధించిన అధికారిక టైమ్‌టేబుల్‌ను రైల్వే శాఖ త్వరలోనే విడుదల చేయనుంది. అయితే సేకరించిన సమాచారం ప్రకారం ప్రతిపాదిత వేళలు ఈ కింది విధంగా ఉండే అవకాశం ఉంది:

యశ్వంత్‌పూర్ - మడ్‌గావ్ వందే భారత్ (26655): ఉదయం 6:05 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 7:15 గంటలకు గోవాలోని మడ్‌గావ్ చేరుకుంటుంది.

గతంలో 2023 డిసెంబర్ 31న ప్రారంభమైన మంగళూరు సెంట్రల్ - మడ్‌గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కేవలం 5 గంటల 30 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తోంది. కాగా, ఈ రూట్ బెంగళూరుకు విస్తరిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 10న యశ్వంత్‌పూర్ - మంగళూరు జంక్షన్ మధ్య 16 కోచ్‌ల వందే భారత్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌లో యశ్వంత్‌పూర్ నుంచి మంగళూరుకు 7 గంటల 5 నిమిషాలు, తిరుగు ప్రయాణంలో 6 గంటల 49 నిమిషాల సమయం పట్టింది. మొత్తం మీద బెంగళూరు నుంచి గోవా చేరుకోవడానికి సుమారు 13 గంటల సమయం పట్టేలా ఉంది.

అయితే, ఈ ప్రయాణ సమయాన్ని 13 గంటల నుంచి కనీసం 11 గంటలకు తగ్గించాలని ప్రయాణికులు, వివిధ సంఘాల ప్రతినిధులు రైల్వే శాఖను కోరుతున్నారు. మంగళూరు నుంచి ఉదయాన్నే బెంగళూరుకు బయలుదేరి, రాత్రి వేళల్లో తిరిగి వచ్చేలా సమయాలు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

"ఉద్యోగాలు, అధికారిక పనుల నిమిత్తం బెంగళూరు వెళ్లేవారికి మంగళూరు నుంచి ఉదయాన్నే బయలుదేరే రైలు ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పగటిపూట పనులు ముగించుకుని రాత్రి రైలులో తిరిగి రావడానికి వీలుపడుతుంది. దీనివల్ల ప్రయాణికులకు ఒక రోజంతా వృథా కాదు," అని కెనరా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు పీబీ అహ్మద్ ముదస్సర్ అభిప్రాయపడ్డారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks