...
...
Next Story

స్టాక్ మార్కెట్‌లో మార్కెట్ క్యాప్ అంటే ఏమిటి? లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ రహస్యాలు

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) తెలుసుకోవడం ఎంతో కీలకం. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల విభజన, వాటిలోని అవకాశాలు, ఎదురయ్యే రిస్క్‌ల గురించి కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అందించిన విశ్లేషణ.

Published on: Sep 9, 2026, 12:36:17 IST
Advertisement

స్టాక్ మార్కెట్‌లో ఏవైనా రెండు కంపెనీలను పోల్చి చూసేటప్పుడు ఇన్వెస్టర్ల మనసులో మొదట మెదిలేది ఆ కంపెనీ పరిమాణం ఎంత అనే ప్రశ్న. ఈ కంపెనీల పరిమాణాన్ని, వాటి విలువను సులువుగా అర్థం చేసుకునేందుకు 'మార్కెట్ క్యాపిటలైజేషన్' లేదా 'మార్కెట్ క్యాప్' ఒక ప్రామాణిక కొలమానంగా ఉపయోగపడుతుంది.

మార్కెట్ క్యాప్ అంటే ఏమిటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?

కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్
కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్

మార్కెట్ క్యాప్ అనేది ఒక కంపెనీకి చెందిన మార్కెట్‌లోని మొత్తం షేర్ల విలువను సూచిస్తుంది. కంపెనీ ప్రస్తుత షేరు ధరను, మార్కెట్‌లో ఉన్న మొత్తం షేర్ల సంఖ్యతో గుణించడం ద్వారా ఈ మార్కెట్ క్యాప్‌ను లెక్కిస్తారు. ప్రతి ట్రేడింగ్ రోజున షేరు ధరల్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి, కాలక్రమేణా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా మారుతుంటుంది.

భారతదేశంలో కంపెనీలను వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్‌ల ఆధారంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రకాలుగా వర్గీకరించారు. విభిన్న పరిమాణాలు ఉన్న కంపెనీలతో ముడిపడి ఉన్న వృద్ధి అవకాశాలు, రిస్క్‌లను అర్థం చేసుకోవడానికి ఈ విభజన ఇన్వెస్టర్లకు తోడ్పడుతుంది.

లార్జ్ క్యాప్: మార్కెట్‌లో సుస్థిర దిగ్గజాలు

మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్ 100 స్థానాల్లో నిలిచే కంపెనీలను 'లార్జ్ క్యాప్' కంపెనీలుగా పరిగణిస్తారు. ఇవి మార్కెట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న సుస్థిర వ్యాపారాలు. వీటికి నిధుల సేకరణ, సమాచార లభ్యత సులువుగా ఉండటంతో పాటు, చిన్న కంపెనీలతో పోలిస్తే వీటి షేర్లలో లిక్విడిటీ (లావాదేవీల ప్రక్రియ) ఎక్కువగా ఉంటుంది.

ఇన్వెస్టర్ల ఈక్విటీ పోర్ట్‌ఫోలియోకు లార్జ్ క్యాప్ షేర్లు ఒక స్థిరమైన పునాదిని అందిస్తాయి. అయితే, లార్జ్ క్యాప్ కంపెనీలు అనగానే వాటిలో 'రిస్క్ అస్సలు ఉండదు' అని భావించకూడదు. తక్కువ లాభాలు, ఆర్థిక మాంద్యం, పరిశ్రమల్లో పరిస్థితుల మార్పులు లేదా ఎక్కువ వ్యాల్యుయేషన్ల వల్ల కూడా ఈ షేర్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

ర్యాంకింగ్స్‌లో 101 నుంచి 250వ స్థానంలో ఉండే కంపెనీలను 'మిడ్ క్యాప్' వర్గంలోకి చేరుస్తారు. నిరూపితమైన బిజినెస్ మోడల్ కలిగి ఉండి, తమ కార్యకలాపాలు, మార్కెట్ వాటా లేదా భౌగోళిక సరిహద్దులను విస్తరించుకునేందుకు అవకాశం ఉన్న కంపెనీలు ఇందులో ఉంటాయి.

ఇది కంపెనీ పరిమాణానికి, వృద్ధికి మధ్య ఒక ఆసక్తికరమైన సమతుల్యతను సృష్టిస్తుంది. ఒక విజయవంతమైన మిడ్ క్యాప్ కంపెనీ కాలక్రమేణా లార్జ్ క్యాప్ కంపెనీగా ఎదిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయాణం అనుకున్నంత సులభంగా ఉండకపోవచ్చు. మిడ్ క్యాప్ షేర్లు లార్జ్ క్యాప్‌ల కంటే ఎక్కువ హెచ్చుతగ్గులకు (వోలటైలిటీ) గురవుతాయి. ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు లేదా పరిశ్రమ సైకిల్స్‌లో వచ్చే మార్పుల ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంటుంది.

ఈ విభాగంలో పెట్టుబడులను పరిశీలించే ఇన్వెస్టర్లు కంపెనీ ఆదాయ వృద్ధి, లాభదాయకత, అప్పుల స్థాయిలు, క్యాష్ ఫ్లోలు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసే సామర్థ్యంపై దృష్టి పెట్టాలి.

స్మాల్ క్యాప్: అపరిమిత అవకాశాలు.. అధిక రిస్క్

మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో 251 నుంచి ఆపైన ఉండే కంపెనీలను 'స్మాల్ క్యాప్' కంపెనీలుగా పిలుస్తారు. కొత్తగా వస్తున్న వ్యాపారాలు, ప్రత్యేక రంగాల్లో సేవలందించే కంపెనీలు ఇందులో ఉంటాయి. ఇవి చిన్నవిగా ఉండటం వల్ల వేగంగా విస్తరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ, వీటి భవిష్యత్ ఫలితాలపై కచ్చితత్వం తక్కువగా ఉంటుంది.

స్మాల్ క్యాప్ షేర్ల ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటాయి. లిక్విడిటీ కూడా తక్కువగా లేదా స్థిరంగా ఉండకపోవచ్చు. మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ షేర్లు త్వరగా నష్టపోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో, విజయవంతంగా ఎదిగిన కంపెనీలు దీర్ఘకాలంలో మంచి రాబడులను అందించగలవు.

కాబట్టి, కేవలం భవిష్యత్తులో పెద్ద కంపెనీగా మారుతుందనే ఒకే ఒక్క ఆశతో స్మాల్ క్యాప్ షేరును ఎంచుకోకూడదు. ఆ వ్యాపార నాణ్యత, మేనేజ్‌మెంట్ సామర్థ్యం, బ్యాలెన్స్ షీట్, పోటీ స్థానం, వ్యాల్యుయేషన్లను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా కీలకం.

కేవలం కంపెనీ సైజ్ చూసి పెట్టుబడి పెట్టకండి

మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కంపెనీ ఎంత పెద్దదో మాత్రమే చెబుతుంది కానీ, ఆ షేరు ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్‌లో ఉందో లేదో తెలియజేయదు. ఒక లార్జ్ క్యాప్ కంపెనీ షేరు ధర చాలా ఖరీదైనదిగా ఉండవచ్చు. అలాగే ఒక స్మాల్ క్యాప్ కంపెనీ షేరు తక్కువ వ్యాల్యుయేషన్‌లో దొరకవచ్చు. లేదా దీనికి విరుద్ధంగానూ జరగవచ్చు.

అందుకే ఇన్వెస్టర్లు మార్కెట్ క్యాప్‌తో పాటు కంపెనీ ఆదాయ వృద్ధి, లాభదాయకత, అప్పులు, క్యాష్ జెనరేషన్, వ్యాల్యుయేషన్, రంగానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కంపెనీల మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లు మారే కొద్దీ వాటి వర్గీకరణలు కూడా మారుతాయని గుర్తుంచుకోవాలి.

ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో కేవలం ఒకే రకమైన విభాగంలో నిండిపోవాల్సిన అవసరం లేదు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో తగిన నిష్పత్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల డైవర్సిఫికేషన్ (వైవిధ్యం) లభిస్తుంది. అయితే, ఈ కేటాయింపు అనేది ఇన్వెస్టర్ ఆర్థిక లక్ష్యాలు, ఇన్వెస్ట్‌మెంట్ కాలపరిమితి, రిస్క్ భరించే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లు మంచి ప్రాథమిక సూచికలు మాత్రమే. కానీ వీటిని తక్కువ, మధ్యమ లేదా ఎక్కువ రాబడులు ఇచ్చే లేబుళ్లుగా భావించకూడదు. ప్రతి విభాగానికి దాని అవకాశాలు, సవాళ్లు ఉన్నాయి. కంపెనీ వృద్ధికి ఏ అంశాలు దోహదపడుతున్నాయో అర్థం చేసుకోవడం, దాని ఆర్థిక బలాన్ని అంచనా వేయడం, వ్యాల్యుయేషన్ సముచితంగా ఉందో లేదో పరిశీలించడమే ఇన్వెస్టర్ల ప్రధాన లక్ష్యంగా ఉండాలి.

వ్యాసకర్త:

శ్రీకాంత్ చౌహాన్,

హెడ్ – ఈక్విటీ రీసెర్చ్,

కోటక్ సెక్యూరిటీస్

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks