Baleno facelift vs Tata Altroz : ఈ రెండు ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ కార్లకు ఫుల్​ డిమాండ్.. ఏది బెస్ట్?

మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ సరికొత్త ఫీచర్లు, లెవెల్-2 అడాస్ సాంకేతికతతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీనికి గట్టి పోటీ ఇస్తున్న టాటా ఆల్ట్రోజ్‌తో పోల్చితే ఫీచర్లు, ఇంజిన్, ధరల్లో ఏది బెస్ట్? అనేది ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Sep 8, 2026, 05:24:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకీ బలెనో, టాటా ఆల్ట్రోజ్ మధ్య ఎప్పుడూ ఆసక్తికరమైన పోటీ నెలకొంటుంది. 2015లో తొలిసారి భారత మార్కెట్లోకి వచ్చిన బలెనో, గడిచిన కాలంలో అనేక మార్పులు చేర్పులతో సరికొత్తగా రూపాంతరం చెందింది. ఇక ఇప్పుడు కంపెనీ అధునాతన హంగులతో ‘బలెనో ఫేస్‌లిఫ్ట్’ను విడుదల చేసింది. మరోవైపు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ధర తగ్గట్టుగా లభించే విలువైన ఫీచర్లతో టాటా ఆల్ట్రోజ్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ కారు కొనుగోలుదారులకు ఈ రెండింటిలో ఏది సరైన ఎంపికో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం.

బలెనో ఫేస్​లిఫ్ట్​ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్
బలెనో ఫేస్​లిఫ్ట్​ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్

బలెనో ఫేస్​లిఫ్ట్​ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్- ఇంజిన్, పర్ఫార్మెన్స్..

మారుతీ సుజుకీ తన కొత్త బలెనో ఫేస్‌లిఫ్ట్‌లో మెరుగైన మైలేజ్ కోసం Z12E 1.2-లీటర్ 3-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది. ఇది 81.8 బీహెచ్‌పీ పవర్, 112.4 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. సీఎన్జీ మోడ్‌లో ఇది 68.79 బీహెచ్‌పీ పవర్, 101.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది.

మరోవైపు టాటా ఆల్ట్రోజ్ ఇంజిన్ విషయంలో కొనుగోలుదారులకు ఎక్కువ ఆప్షన్లు ఇస్తోంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ (86 బీహెచ్‌పీ పవర్, 115 ఎన్ఎమ్ టార్క్)తో పాటు డీజిల్ ప్రేమికుల కోసం శక్తివంతమైన 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ (88 బీహెచ్‌పీ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్)ను కూడా అందిస్తోంది. ట్రాన్స్‌మిషన్ పరంగా 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ, అధునాతన 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీఏ) గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

బలెనో ఫేస్​లిఫ్ట్​ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్- ప్రీమియం ఫీచర్లు, సాంకేతికత..

ఫీచర్ల విషయంలో మారుతీ సుజుకీ ఈసారి బలెనోలో సంచలనాత్మక మార్పులు చేసింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వేసవి ఉష్ణోగ్రతలకు ఉపశమనం కలిగించే ‘వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు’, ఈ విభాగంలోనే తొలిసారిగా 'లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్)' భద్రతా సాంకేతికతను అందించడం గమనార్హం. వీటితో పాటు కొత్త క్లారియన్ సౌండ్ సిస్టమ్, ఫోన్ వేడెక్కకుండా ఆక్టివ్ కూలింగ్ ఉన్న వైర్‌లెస్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి లగ్జరీ ఫీచర్లను జోడించింది.

టాటా ఆల్ట్రోజ్ కూడా ఫీచర్ల పరంగా ఎక్కడా తగ్గేదేలే అంటోంది. ఇందులో ఎలక్ట్రికల్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ప్రయాణికుల కోసం రియర్ ఏసీ వెంట్స్, ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మద్దతు ఇచ్చే 10.24-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం డ్యూయల్ 65డబ్ల్యూ టైప్-సీ యూఎస్‌బీ పోర్టులు, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి సదుపాయాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి.

బలెనో ఫేస్​లిఫ్ట్​ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్- ధరల వివరాలు.

ధర విషయానికి వస్తే, మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.09 లక్షలుగా ఉండగా, అత్యుత్తమ ఫీచర్లు ఉన్న టాప్ వేరియంట్ ధర రూ. 10.09 లక్షలుగా నిర్ణయించారు.

మరోవైపు టాటా ఆల్ట్రోజ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. అన్ని హంగులు ఉన్న దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.74 లక్షల వరకు ఉంటుంది.

బలెనో ఫేస్​లిఫ్ట్​ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్- ఏది బెస్ట్?

మీకు మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, అడాస్ భద్రత, వెంటిలేటెడ్ సీట్ల వంటి ఆధునిక సౌకర్యాలు కావాలంటే మారుతీ బలెనో ఫేస్‌లిఫ్ట్ సరైన ఎంపిక. అలా కాకుండా, బలమైన బిల్ట్ క్వాలిటీ, డీజిల్ ఇంజిన్ ఆప్షన్, సన్‌రూఫ్ అనుభూతి కోరుకుంటే టాటా ఆల్ట్రోజ్‌ను పరిశీలించవచ్చు అని ఆటోమొబైల్​ నిపుణులు చెబుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More