...
...
Next Story

Electric car : మారుతీ సుజుకీ నుంచి కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ.. ధర, ఫీచర్లు ఇవే!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని ఈవీ విభాగంలోనూ కొనసాగించేందుకు మారుతీ సుజుకీ సిద్ధమైంది. 'వైఎంసీ' కోడ్ నేమ్‌తో అత్యంత తక్కువ ధరకే విశాలమైన 3-రో ఎలక్ట్రిక్ కారును 2027 నాటికి ఇండియన్ రోడ్లపైకి తెచ్చేందుకు ప్రణాళికలు వేసింది.

Published on: Sep 6, 2026, 14:01:04 IST
Advertisement

మనదేశంలో కుటుంబ కార్లకు, ముఖ్యంగా ఎక్కువ మంది కూర్చునే 3-రో వాహనాలకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 కార్లతో ఇప్పటికే ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న మారుతీ సుజుకీ.. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ అమలు చేయడానికి సిద్ధమైంది. 'YMC' అనే కోడ్ నేమ్‌తో కొత్త 3-రో ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు 2027 నాటికి భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు- ఈవీ ఆర్కిటెక్చర్, బ్యాటరీ సామర్థ్యం..

మారుతీ సుజుకీ కొత్త ఈవీ..
మారుతీ సుజుకీ కొత్త ఈవీ..

ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ కారును మారుతీ సుజుకీ తన ఈ-విటారా నిర్మించిన 'HEARTECT-e' ప్రత్యేక ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పైనే డిజైన్ చేస్తోంది. మారుతీ స్థానికంగానే ఈవీ విడిభాగాల ఉత్పత్తికి భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల దీని ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గనుంది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈ-విటారా మోడల్‌లో 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగిస్తున్నారు. ఇవి పూర్తి ఛార్జింగ్‌పై గరిష్టంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. వైఎంసీ మోడల్‌లో కూడా ఇవే బ్యాటరీ ఆప్షన్లను ఉపయోగించినప్పటికీ, కారు పరిమాణం పెద్దదిగా ఉండటం, ఎక్కువ బరువు ఉండటం వల్ల దీని డ్రైవింగ్ రేంజ్ ఈ-విటారా కంటే కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు- బాక్సీ డిజైన్, విశాలమైన కేబిన్ స్పేస్..

ఇటీవల ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్పై పిక్స్ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ కారు లుక్స్ ఎలా ఉండబోతున్నాయో ఒక అంచనాకు రావచ్చు. సాధారణ ఎస్‌యూవీల కంటే కాస్త బాక్సీ స్టైలింగ్, నిలువుగా ఉండే డిజైన్‌తో ఇది కనిపిస్తోంది. మూడొవ వరుసలో కూర్చునే ప్రయాణికులకు తగినంత స్పేస్ ఇచ్చేందుకు వీలుగా వెనుక భాగంలో పెద్ద విండ్‌స్క్రీన్, వర్టికల్ టైల్ ల్యాంప్స్ అందించారు.

మారుతీ సుజుకీ బ్రాండ్ అంటేనే సామాన్యుడికి అందుబాటులో ఉండే ధర. ఈ వైఎంసీ మోడల్‌ను కూడా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా రూ. 14 లక్షల నుంచి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు తీసుకువచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది మార్కెట్లోకి వస్తే కియా క్యారెన్స్ ఈవీతో పాటు ఇతర 5-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తుంది.

పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో బడ్జెట్ ధరలో పెద్ద ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కారును కోరుకునే వారికి ఈ మారుతీ సుజుకీ ఈవీ సరైన ప్రత్యామ్నాయంగా మారనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks