...
...
Next Story

Balochistan Blast : బలూచిస్థాన్​లో మారణహోమం- సైనికులు వెళుతున్న రైలుపై దాడి.. 24మంది మృతి!

పాకిస్థాన్​లోని వివాదాస్పద బలూచిస్థాన్​లో విధ్వంసం జరిగింది. సైనికులు వెళుతున్న రైలుపై దాడి జరిగింది. ఈ ఘటనలో 24మంది మృతిచెందారు. అనేకమంది గాయపడ్డారు. పేలుడుకు బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన చేసింది.

Published on: May 24, 2026, 13:22:56 IST
Advertisement

పాకిస్థాన్‌లోని అశాంతి నిండిన నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఘోర బాంబు పేలుడు సంభవించింది. సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వెళుతున్న ఒక రైలును లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. క్వెట్టాలోని చమన్ పట్టక్ సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న కారు.. రైలు బోగీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ భీకర ఆత్మాహుతి దాడిలో కనీసం 24 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్​ఏ) ప్రకటించింది.

బలూచిస్థాన్​లో పేలుడు.. (AFP)
బలూచిస్థాన్​లో పేలుడు.. (AFP)

ఈద్ (రంజాన్) పండుగ వేడుకల కోసం క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పెషావర్ వెళుతున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ తిరుగుబాటుదారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మంగళవారం నుంచి ఈద్ సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైలులో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.

దాడి జరిగిన తీరు..

రైలు క్వెట్టాలోని చమన్ పట్టక్ వద్ద సిగ్నల్ దాటుతున్న సమయంలో, భారీగా పేలుడు పదార్థాలు అమర్చిన ఒక కారు వేగంగా దూసుకొచ్చి రైలులోని ఒక బోగీని బలంగా ఢీకొట్టింది. ఈ ఆత్మాహుతి దాడి తీవ్రతకు రైలుకు చెందిన రెండు కోచ్‌లు పూర్తిగా రివర్స్ అయి పట్టాలు తప్పాయి. అనంతరం బోగీల్లో భారీగా మంటలు చెలరేగి దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది.

అత్యంత భద్రత ఉండే క్వెట్టా కంటోన్మెంట్ పరిసరాల్లోనే ఈ స్థాయి పేలుడు జరగడం పాకిస్థాన్ నిఘా వర్గాల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.

విధ్వంసకర దృశ్యాలు - భారీ ఆస్తి నష్టం!

పేలుడు ధాటికి రైలు బోగీలు తుక్కుతుక్కయ్యాయి. స్థానిక ప్రజలు, రెస్క్యూ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న క్షతగాత్రులను, రక్తసిక్తమైన మృతదేహాలను స్ట్రెచర్లపై బయటకు తీసుకువచ్చారు.

రైలు పట్టాలకు దాదాపు 25 నుంచి 30 మీటర్ల దూరంలో పార్క్ చేసి ఉన్న అనేక కార్లు ఈ పేలుడు ధాటికి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం గోడలు కూలిపోయాయి, కిటికీల అద్దాలు పగిలిపోయి భవన నిర్మాణం తీవ్రంగా దెబ్బతింది.

బాధ్యత వహించిన ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’

బలూచిస్థాన్ వివాదం నేపథ్యం : ఇరాన్, ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్ ప్రాంతం దశాబ్దాలుగా తిరుగుబాటుతో నలిగిపోతోంది. పూర్వపు సంస్థానమైన 'కలాత్' పాకిస్థాన్‌లో విలీనమైనప్పటి నుంచే ఈ బలూచ్ నిరోధక ఉద్యమం ప్రారంభమైంది. తమ ప్రాంతంలోని సహజ వనరుల్లో బలూచ్ ప్రజలకు సరైన వాటా ఇవ్వాలని, తమకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి జాతి సమూహాలు దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నాయి. బీఎల్ఏ వంటి వేర్పాటువాద సమూహాలు గత కొన్నేళ్లుగా పాక్ భద్రతా దళాలు, పౌరులు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలతో పాటు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks