ఇండియా కోసం రెనాల్ట్​ క్రేజీ ప్లాన్​- ‘మినీ డస్టర్’​ వచ్చేస్తోంది..!

భారత మార్కెట్​లో పూర్వవైభవం కోసం రెనాల్ట్​ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే శక్తివంతమైన బాక్సీ డిజైన్‌తో కూడిన 'మినీ డస్టర్'ను కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాలు..

Published on: Jan 31, 2026, 09:10:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్​' కొత్త తరం డస్టర్‌ను ఆవిష్కరించడం ద్వారా ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో పెద్ద అలజడినే సృష్టించింది. అయితే, భారతదేశంలో తన అదృష్టాన్ని మార్చుకోవడానికి కంపెనీ కేవలం ఈ ఒక్క మోడల్​పైనే ఆధారపడాలని అనుకోవడం లేదు. ఇకపై దూకుడు పెంచి, ప్రతి ఏటా కనీసం ఒక కొత్త మోడల్‌ను భారత మార్కెట్​లో లాంచ్ చేయాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా త్వరలోనే ఒక 7-సీటర్ ఎస్‌యూవీ రాబోతోందని ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు డస్టర్​కి ‘మినీ’ వర్షెన్​ని కూడా సంస్థ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.

2026 రెనాల్ట్​ డస్టర్​..
2026 రెనాల్ట్​ డస్టర్​..

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ మినీ డస్టర్​ని ప్రవేశపెట్టే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

"మినీ డస్టర్ అనేది చాలా మంచి ఆలోచన," అని రెనాల్ట్​ బ్రాండ్ సీఈఓ, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఫాబ్రిస్ కాంబోలివ్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, ఈ మోడల్ వచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.

రెనాల్ట్ నుంచి​ మినీ డస్టర్​- ఎలా ఉంటుంది?

భారత సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెనాల్ట్​కి ఇప్పటికే ‘కైగర్’ ఉంది. 2025 మధ్యలో ఈ కారుకు భారీ మార్పులు చేసినప్పటికీ, అమ్మకాల పరంగా అది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. నెలకు సగటున 1,000 నుంచి 1,200 యూనిట్ల అమ్మకాలకే పరిమితమైంది. దీనికి ప్రధాన కారణం కైగర్​కి ఉన్న 'క్రాస్‌ఓవర్' లాంటి లుక్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారతీయ కొనుగోలుదారులు సాధారణంగా నిటారుగా, గంభీరంగా, బాక్సీ డిజైన్‌లో ఉండే ఎస్‌యూవీలనే ఎక్కువగా ఇష్టపడతారు.

సరిగ్గా ఈ లోటును భర్తీ చేయడమే 'మినీ డస్టర్' ప్రధాన ఉద్దేశం అని తెలుస్తోంది. అసలైన డస్టర్‌కు ఉన్న రగ్గడ్, పక్కా ఎస్‌యూవీ స్టాన్స్ దానికి పెద్ద అప్పీల్‌ను ఇచ్చాయి. కొత్త డస్టర్ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది. రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఇదే తరహాలో ఉండబోతోంది. కైగర్ లాంటి కూపే తరహా రూఫ్‌లైన్ కాకుండా, మినీ డస్టర్ నిటారుగా ఉండే సిల్హౌట్‌తో రానుంది. ఇందులో రగ్గడ్ బాడీ క్లాడింగ్, పెద్ద వీల్స్ వంటి పక్కా ఎస్‌యూవీ డిజైన్ ఫీచర్లను మనం ఆశించవచ్చు.

ఇక పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, కైగర్‌లో వాడుతున్న 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్నే ఇందులోనూ ఉపయోగించే అవకాశం ఉంది. దీనికి మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

అయితే, ఇంకా పేరు ఖరారు కాని ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. 7-సీటర్ డస్టర్ విడుదలైన తర్వాతే ఇది మార్కెట్​లోకి వస్తుంది. కాబట్టి, దీని లాంచ్ టైమ్‌లైన్ సుమారు 2027-28 మధ్యలో ఉండవచ్చని నిపుణులు అభిప్రాపడుతున్నారు.

రెనాల్ట్​కు రెండో కాంపాక్ట్ ఎస్‌యూవీ అవసరమా?

కాంపాక్ట్ ఎస్‌యూవీ కేటగిరీలో ఒకే బ్రాండ్ నుంచి ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులు ఉండటం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఉదాహరణకు, మారుతీ సుజుకీ 'బ్రెజ్జా', 'ఫ్రాంక్స్' రూపంలో రెండు వేర్వేరు ఉత్పత్తులతో విజయం సాధించింది. అలాగే, కియా మోటార్స్​ కూడా ‘సోనెట్’, 'సైరోస్' మోడళ్లతో వేర్వేరు కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మహీంద్రా సైతం తన రాబోయే 'ఎన్​యూ' ప్లాట్‌ఫామ్ ఆధారిత ఎస్‌యూవీలతో ఇదే బాటలో నడవనుంది.

అన్నింటికంటే ముఖ్యంగా, 2025లో జీఎస్టీ రేట్ల సవరణ తర్వాత కాంపాక్ట్ సెగ్మెంట్‌పై కార్ల తయారీ సంస్థలు, కస్టమర్లలో మళ్లీ ఆసక్తి పెరిగింది. ఈ సెగ్మెంట్‌లో ఉన్న భారీ డిమాండ్‌ను ఏ కంపెనీ కూడా వదులుకోవాలని అనుకోవడం లేదు. అయితే, ఈ పోటీలో నెగ్గాలంటే ధర చాలా కీలకం! మరి రెనాల్ట్​ తన మోడల్స్​ని ఏ ప్రైజ్​ పాయింట్​లో తీసుకొస్తుందో చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More