...
...
Next Story

Mohammed Shami:ఏ ఇండియన్ బౌలర్ నాకు సాటిరాడు.. ఐదారేళ్లుగా నా రికార్డు చూడండి.. మీకు ఇంకేం కావాలి: షమీ కామెంట్స్

Mohammed Shami: టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సూచనలు కనిపిస్తున్నాయి. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నా, సెలెక్టర్లు మొండిచేయి చూపడంపై షమీ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

Published on: Apr 1, 2026, 14:49:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన మహమ్మద్ షమీ.. టీమిండియా తరపున తన చివరి మ్యాచ్ ఆడేసినట్లేనా? గత 12 ఏళ్లుగా భారత బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచిన షమీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. విరాట్ కోహ్లీ-రవిశాస్త్రి ద్వయం హయాంలో జట్టుకు వెన్నెముకగా మారిన షమీ.. మూడు వన్డే ప్రపంచకప్‌లలో భారత్ తరపున కీలక పాత్ర పోషించాడు.

Mohammed Shami:ఏ ఇండియన్ బౌలర్ నాకు సాటిరాడు.. ఐదారేళ్లుగా నా రికార్డు చూడండి.. మీకు ఇంకేం కావాలి: షమి కామెంట్స్ (AFP)
Mohammed Shami:ఏ ఇండియన్ బౌలర్ నాకు సాటిరాడు.. ఐదారేళ్లుగా నా రికార్డు చూడండి.. మీకు ఇంకేం కావాలి: షమి కామెంట్స్ (AFP)

ముఖ్యంగా 2019, 2023 ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత.. షమీ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించలేదు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ, భారత జట్టులోకి తిరిగి రావడం కోసం అతడు చేస్తున్న పోరాటం ఫలించడం లేదు.

అగార్కర్ నిర్ణయంపై అసహనం

జట్టులోకి పునరాగమనం చేయడానికి ఇంకేం చేయాలో అర్థం కావడం లేదని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. తొలుత టీ20లకు, ఆ తర్వాత వన్డేలకు, ఇప్పుడు టెస్టులకు కూడా అతన్ని దూరం పెట్టారు. 2025-26 భారత డొమెస్టిక్ సీజన్‌లో ఏకంగా 67 వికెట్లు పడగొట్టినప్పటికీ, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ మాత్రం షమీ పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత అతన్ని టీ20 సెటప్ నుంచి తొలగించారు. ఆ వెంటనే జరిగిన ఐపీఎల్‌లో పర్పుల్ క్యాప్ గెలిచినప్పటికీ, సెలెక్టర్ల మనసు మాత్రం మారలేదు.

శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో షమీ మాట్లాడుతూ తన రికార్డులను గుర్తు చేశాడు. "ఐపీఎల్ రికార్డులను ఒకసారి పరిశీలించండి. ఏ ఇతర ఇండియన్ బౌలర్ కూడా నా దరిదాపుల్లో లేడు. గత 5-6 ఏళ్లలో నేను దాదాపు 130 వికెట్లు తీశాను. నేనింకా టీ20 బౌలర్‌ను కాదా? ఇంకేం నిరూపించుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు" అని అతడు ఘాటుగా స్పందించాడు.

సంతృప్తిగానే ఉన్నాను..

టెస్టుల్లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సాధించిన చరిత్రాత్మక విజయాల్లో అతడు కూడా భాగస్వామి. వన్డేల్లో హ్యాట్రిక్, న్యూజిలాండ్‌పై 7/57 అత్యుత్తమ గణాంకాలు అతని కెరీర్ ఘనతను చాటిచెబుతాయి.

"నిజం చెప్పాలంటే, జట్టులో చోటు దక్కకపోవడం నాపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. నా డొమెస్టిక్ రికార్డులు చూడండి. మీరు నాకు బంతి ఇస్తేనే నేను ఏదైనా చేయగలను. లేదంటే కేవలం వాటర్ బాయ్‌గా మాత్రమే సేవలు అందించగలను. బంతి చేతిలో ఉంటేనే వికెట్లు తీయగలను, లేదంటే నా చేతులు కట్టేసినట్లే. కానీ నేను దీని గురించి తీవ్రంగా బాధపడటం లేదు. నేను సంతృప్తిగా ఉన్నాను. భారత్ తరపున ఆడినందుకు నాకు పేరు, ప్రఖ్యాతులు, డబ్బు అన్నీ లభించాయి. దేశం కోసం ఎన్నో ఏళ్లు కష్టపడ్డాను.. ఎన్నో ప్రపంచకప్‌లు ఆడాను" అని షమీ భావోద్వేగంతో వివరించాడు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. మహమ్మద్ షమీ చివరిసారిగా భారత్ తరపున ఏ మ్యాచ్ ఆడాడు?

షమీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

2. 2025-26 డొమెస్టిక్ సీజన్‌లో షమీ ప్రదర్శన ఎలా ఉంది?

ఆ సీజన్‌లో షమీ అద్భుతంగా రాణించి 67 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ సెలెక్టర్లు అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు.

3. ఐపీఎల్‌లో షమీ రికార్డు ఏమిటి?

గత 5-6 ఏళ్లలో ఐపీఎల్‌లో షమీ సుమారు 130 వికెట్లు తీశాడు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత జరిగిన ఐపీఎల్ సీజన్‌లో అతడు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) కూడా సాధించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe