ఇరాన్ తదుపరి అత్యున్నత నేతగా మొజ్తబా ఖమేనీ? వ్యక్తిగత జీవితంపై వికీలీక్స్ సంచలన కథనం

ఇరాన్ దివంగత నేత అలీ ఖమేనీ వారసుడిగా మొజ్తబా ఖమేనీ పేరు వినిపిస్తోంది. ఈ తరుణంలో ఆయన గతంలో సంతానం కోసం లండన్‌లో చికిత్స పొందినట్లు వికీలీక్స్ పత్రాలు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

Published on: Mar 5, 2026, 09:26:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టెహ్రాన్/లండన్: అగ్రరాజ్యం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో, ఆ దేశ తదుపరి అత్యున్నత నేత ఎవరన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఖమేనీ కుమారుడు 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ ఈ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో మొజ్తబా వ్యక్తిగత జీవితం, ఆయన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలను ‘వికీలీక్స్’ బయటపెట్టింది.

మొజ్తబా ఖమేనీ (via REUTERS)
మొజ్తబా ఖమేనీ (via REUTERS)

లండన్‌లో చికిత్స.. వికీలీక్స్ వెల్లడి

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే విడుదల చేసిన పాత దౌత్య పత్రాల ప్రకారం.. మొజ్తబా ఖమేనీ గతంలో సంతానలేమి (Impotency) సమస్యతో బాధపడ్డారు. దీనికోసం ఆయన బ్రిటన్‌లోని లండన్‌లో ఉన్న వెల్లింగ్టన్, క్రామ్‌వెల్ ఆసుపత్రుల్లో పలుమార్లు చికిత్స పొందారు. 2008లో అమెరికా విదేశాంగ శాఖ లండన్‌లోని తమ ఎంబసీకి పంపిన ఒక రహస్య నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.

తమ వారసుల కోసం ఖమేనీ కుటుంబం మొజ్తబాపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందని, ఈ క్రమంలో ఆయన నాలుగు సార్లు లండన్ వెళ్లి చికిత్స పొందాల్సి వచ్చిందని ఆ నివేదిక పేర్కొంది. చివరగా రెండు నెలల పాటు అక్కడే ఉండి చికిత్స తీసుకున్న తర్వాత ఆయన భార్య గర్భం దాల్చారు. అనంతరం ఇరాన్‌లో వారికి మగబిడ్డ జన్మించగా, తన తండ్రి జ్ఞాపకార్థం ఆ బాలుడికి ‘అలీ’ అని నామకరణం చేశారు.

వ్యక్తిగత జీవితం - విషాదం

మొజ్తబా ఖమేనీ 2004లో మాజీ మజ్లిస్ స్పీకర్ హదాద్ ఆదెల్ కుమార్తె జహ్రాను వివాహం చేసుకున్నారు. అయితే, ఇటీవలే ఇరాన్‌పై జరిగిన దాడుల్లో మొజ్తబా భార్య జహ్రా, కుమారుడు అలీ ఇద్దరూ మరణించినట్లు నిఘా వర్గాల సమాచారం. ఆ భీకర దాడుల్లో మరణించిన 49 మందిలో వీరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

వారసుడి ఎంపికపై ఉత్కంఠ

ఇరాన్ అత్యున్నత నేతను ఎన్నుకునే ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ (మతగురువుల మండలి) త్వరలోనే సమావేశం కానుంది. వీలైనంత త్వరగా ఓటింగ్ నిర్వహించి కొత్త సుప్రీం లీడర్‌ను ప్రకటిస్తామని మండలి సభ్యుడు అహ్మద్ ఖతామీ వెల్లడించారు. మొజ్తబాతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఈ రేసులో ఉన్నారు:

  • అలీరెజా అరాఫీ: ప్రస్తుతం దేశాన్ని నడుపుతున్న మధ్యంతర మండలి సభ్యుడు.
  • మొహ్సెన్ అరాకీ: కఠినవాద మతగురువుగా గుర్తింపు.
  • హసన్ ఖొమేనీ: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా ఖొమేనీ మనుమడు.

యుద్ధం ముదురుతున్న తరుణంలో ఇరాన్ పగ్గాలు ఎవరు చేపడతారనేది పశ్చిమాసియా రాజకీయాల్లో కీలకంగా మారనుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):

మొజ్తబా ఖమేనీ ఎవరు?

ఈయన ఇరాన్ దివంగత అత్యున్నత నేత అలీ ఖమేనీ కుమారుడు. ప్రస్తుతం ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ అయ్యే అవకాశం ఉన్న ప్రధాన వ్యక్తి.

వికీలీక్స్ ఏం వెల్లడించింది?

మొజ్తబా గతంలో సంతానం కోసం లండన్ వెళ్లారని, అక్కడ సుమారు రెండు నెలల పాటు చికిత్స పొందిన తర్వాతే ఆయనకు కుమారుడు జన్మించాడని వికీలీక్స్ పత్రాలు చెబుతున్నాయి.

ఇరాన్ తదుపరి నేతను ఎవరు ఎన్నుకుంటారు?

ఇరాన్‌లోని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ అనే అత్యున్నత మతగురువుల మండలి ఓటింగ్ ద్వారా సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంటుంది.

ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి ఏమిటి?

అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నాయకత్వ సంక్షోభంలో ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో దేశం యుద్ధ స్థితిలో ఉంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More