ఆధార్​ నుంచి ఎస్బీఐ కార్డు ఛార్జీల​ వరకు- రేపటి నుంచి ఈ రూల్స్​లో మార్పులు..

నవంబర్ 1 నుంచి మీ జేబుపై ప్రభావం చూపే కొత్త ఆర్థిక నియమాలు అమల్లోకి రానుంది. ఆధార్​ కార్డు, బ్యాంకు నామినీ నుంచి ఎస్బీఐ కార్డు ఛార్జీల పెంపు వరకు అనేక విషయాల్లో మార్పులు కనిపించబోతున్నాయి. ఆ వివరాలను, మీపై వాటి ప్రభావాన్ని ఇక్కడ తెలుసుకోండి..

Updated on: Oct 31, 2025 1:17 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నవంబర్ 2025 నెల ప్రారంభానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. రాబోయే రోజుల్లో మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆ అంశాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నవంబర్​ 1ని ఈ రూల్స్​లో మార్పులు.. (iStock Photo / File )
నవంబర్​ 1ని ఈ రూల్స్​లో మార్పులు.. (iStock Photo / File )

నవంబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చే ముఖ్యమైన మార్పులు:

కొత్త వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబ్‌లు, ఆధార్ అప్‌డేట్‌లు, బ్యాంకు నామినేషన్ ప్రక్రియ, కార్డు ఛార్జీలు, పెన్షన్ అవసరాలతో సహా మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇక్కడ ఉన్నాయి.

1. బ్యాంకు నామినేషన్ ప్రక్రియలో కీలక మార్పులు

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంకింగ్ చట్టాల సవరణ ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ద్వారా ముఖ్యంగా రెండు మార్పులు వస్తున్నాయి:

నలుగురు నామినీలు: బ్యాంకు ఖాతాదారులు ఇకపై ఒకేసారి నలుగురు నామినీలను నామినేట్ చేయవచ్చు. అంతేకాకుండా, వారు నామినీలకు చెందాల్సిన వాటా లేదా శాతాన్ని కూడా స్పష్టంగా పేర్కొనవచ్చు.

సక్సెసివ్​ నామినీ: ఖాతాదారులు సక్సెసివ్​ నామినీలను కూడా ఎంచుకోవచ్చు. దీని ప్రకారం.. పైన పేర్కొన్న నామినీ మరణించిన తర్వాత మాత్రమే, తదుపరి నామినీకి హక్కు లభిస్తుంది.

ఆర్బీఐ ఆదేశం: నామినేషన్ సదుపాయం గురించి బ్యాంకు ఖాతాదారులకు స్పష్టంగా తెలియజేయాలని, దానిని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులను ఆదేశించింది. అయితే, ఖాతాదారుడు ఎవరినీ నామినేట్ చేయకూడదని నిర్ణయించుకుంటే, ఎటువంటి ఆంక్షలు లేకుండానే ఖాతాను తెరవవచ్చు.

నామినీ మరణిస్తే: ఒకవేళ నామినీ (ఏకకాల నామినేషన్ విషయంలో) బ్యాంకు నుంచి డిపాజిట్ స్వీకరించడానికి ముందే మరణిస్తే, ఆ నామినీకి సంబంధించిన నామినేషన్ చెల్లదని ఆర్బీఐ తెలిపింది.

2. యూఐడీఏఐ ఆధార్ అప్‌డేట్‌లు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పిల్లలకు సంబంధించి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు (ఎంబీయూ) విధించే రూ. 125 ఛార్జీని మినహాయించింది. ఈ చర్య ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది.

పెద్దలకు ఛార్జీలు ఇలా ఉన్నాయి:

పేరు, పుట్టిన తేదీ, చిరునామా లేదా మొబైల్ నంబర్ అప్‌డేట్‌ల కోసం: రూ. 75

వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌ల వంటి బయోమెట్రిక్ వివరాల మార్పుల కోసం: రూ. 125

డాక్యుమెంట్ లేకుండా అప్‌డేట్: ఇకపై, మీరు మీ ఆధార్ కార్డులో చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లేదా పేరును మార్చాలనుకుంటే, సపోర్టింగ్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయకుండానే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.

3. పెన్షన్ పొందేందుకు తప్పనిసరి

పెన్షన్ అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఆ ఏడాదికి సంబంధించిన తమ ‘జీవన ధృవీకరణ పత్రాన్ని’ సమీపంలోని బ్యాంకు బ్రాంచ్‌లో నవంబర్ నెలాఖరులోపు సమర్పించాలి. అలా చేయడంలో విఫలమైతే, పెన్షన్ చెల్లింపులలో ఆలస్యం లేదా అంతరాయం ఏర్పడవచ్చు.

అలాగే, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్​పీఎస్​) నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్​) కు మారాలనుకునే ఉద్యోగులు కూడా నవంబర్ నెలాఖరులోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలి.

4. కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు అమల్లోకి

ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, నవంబర్ 1 నుంచి జీఎస్టీ ప్రస్తుత నాలుగు- శ్లాబుల వ్యవస్థ స్థానంలో రెండు శ్లాబ్‌లు + ఒక ప్రత్యేక రేటు విధానం అమలులోకి వస్తుంది.

తొలగించిన శ్లాబులు: 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను తొలగించారు.

కొత్త శ్లాబులు: కొత్త నిర్మాణంలో నిత్యావసరాలకు 5 శాతం, సాధారణ వినియోగ వస్తువులకు 18 శాతం శ్లాబులు ఉండే అవకాశం ఉంది.

కొత్త ప్రత్యేక రేటు: లగ్జరీ సిన్​ గూడ్స్​ (ఉదా: పొగాకు) 40 శాతం శ్లాబును ప్రవేశపెట్టనున్నారు.

ఈ మార్పుల వల్ల కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నా, లగ్జరీ వస్తువులు, కొన్ని ఇతర ఉత్పత్తులపై మాత్రం పన్ను భారం పెరగవచ్చు.

5. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ ఛార్జీలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా లాకర్ పరిమాణం, వర్గాన్ని బట్టి లాకర్ అద్దె ఛార్జీలను తగ్గించనున్నట్లు తమ వినియోగదారులకు తెలియజేసింది. సవరించిన రేట్లు నవంబర్‌లో బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల తర్వాత ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.

6. ఎస్బీఐ కార్డుపై కొత్త ఛార్జీలు

నవంబర్ 1 నుంచి, ఎస్బీఐ కార్డ్ వినియోగదారులు కొన్ని చెల్లింపులపై 1 శాతం రుసుమును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎడ్యుకేషన్ చెల్లింపులు: MobiKwik, CRED వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసే విద్య సంబంధిత చెల్లింపులపై 1 శాతం ఫీజు వర్తిస్తుంది.

వాలెట్ లోడింగ్: రూ. 1,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే వాలెట్ లోడ్ లావాదేవీలపై కూడా 1 శాతం రుసుము వసూలు చేస్తారు. ఈ కొత్త ఛార్జీలు క్రెడిట్ కార్డు వినియోగదారుల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపవచ్చు.