Monsoon 2026 : ఈ ఏడాది వర్షాలు.. సాధారణం కన్నా తక్కువే! వ్యవసాయానికి కష్టం?
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వర్షాకాలంపై వాతావరణ నిపుణులు ఆందోళనకరమైన అంచనాలను వెలువరించారు. మంగళవారం విడుదల చేసిన నివేదికలో స్కైమెట్ వెదర్, ఈ ఏడాది రుతుపవనాలు సగటు కంటే తక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది.
2026 వర్షాకాలంపై తన తాజా నివేదికను విడుదల చేసింది ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ ‘స్కైమెట్’. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ద్వారా అందే వర్షపాతం “సాధారణం కంటే తక్కువ”గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్పీఏ) లో ఇది 94 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా జులై నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు క్రమంగా తగ్గుతాయని, ఇది వ్యవసాయ రంగంపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది.

నైరుతి రుతుపవనాలు 2026- గత ఏడాదితో పోలిక..
గతేడాది (2025) భారత్ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని (7.9% అదనంగా) పొందింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం.. వాయువ్య భారతం గత సీజన్‌లో 747.9 ఎంఎం వర్షపాతాన్ని నమోదు చేసింది. ఇది 2001 తర్వాత అత్యధికం కాగా, 1901 తర్వాత ఆరో అత్యధిక వర్షపాతం. అయితే, తూర్పు, ఈశాన్య భారతంలో మాత్రం 1901 తర్వాత రెండో అత్యల్ప వర్షపాతం నమోదైంది.
నైరుతి రుతుపవనాలు 2026- వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
భారతదేశంలో సాగు భూమిలో 51 శాతం వర్షంపైనే ఆధారపడి ఉంది. దేశంలోని మొత్తం ఆహార ఉత్పత్తిలో 40 శాతం ఈ ప్రాంతాల నుంచే వస్తుంది. కాబట్టి వర్షపాతం తగ్గడం అనేది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, దేశ ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే అంశం.
నైరుతి రుతుపవనాలు 2026- స్కైమెట్ అంచనాలు, శాతాల వారీగా..
రుతుపవనాల నాలుగు నెలల (జూన్ నుంచి సెప్టెంబర్) సగటు వర్షపాతం (ఎల్పీఏ) 868.6 ఎంఎం. ఈ ఏడాది వర్షాల సంభావ్యతను స్కైమెట్ కింది విధంగా విభజించింది:
సాధారణం కంటే తక్కువ (90% - 95% ఎల్పీఏ): 40 శాతం అవకాశం.
కరువు (90% కంటే తక్కువ ఎల్పీఏ): 30 శాతం అవకాశం.
సాధారణం (96% - 104% ఎల్పీఏ): 20 శాతం అవకాశం.
సాధారణం కంటే ఎక్కువ (105% - 110% ఎల్పీఏ): 10 శాతం అవకాశం.
ఎల్ నినో ముప్పు..
స్కైమెట్ మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ సింగ్ మాట్లాడుతూ, గత ఏడాదిన్నరగా ఉన్న ‘లా నినా’ పరిస్థితులు ముగిసి, పసిఫిక్ మహాసముద్రం ఇప్పుడు ‘ఎల్ నినో’ వైపు మళ్లుతోందని తెలిపారు.
ఎల్ నినో పరిస్థితులు సాధారణంగా భారత్‌లో రుతుపవనాలను బలహీనపరుస్తాయి, కఠినమైన వేసవికి కారణమవుతాయి.
"రుతుపవనాల తొలి దశలో ఎల్ నినో ప్రభావం మొదలై, ఏడాది చివరి నాటికి అది మరింత బలపడుతుంది. దీనివల్ల సీజన్ రెండో సగం (ఆగస్టు, సెప్టెంబర్) అస్థిరంగా, అనిశ్చితంగా ఉండే అవకాశం ఉంది," అని ఆయన వివరించారు.
ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం..
అయితే ఎల్ నినో వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు 'ఇండియన్ ఓషన్ డైపోల్' (ఐఓడీ) తగ్గించగలదు. ఐఓడి సానుకూలంగా ఉంటే వర్షాలు మెరుగుపడతాయి. ప్రస్తుతానికి ఐఓడి తటస్థంగా లేదా స్వల్ప సానుకూలంగా ఉండే అవకాశం ఉందని, దీనివల్ల జూన్ నెలలో వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని స్కైమెట్ పేర్కొంది. అయితే, సీజన్ చివరలో వర్షపాతం దెబ్బతినే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు 2026- నెలల వారీగా వర్షపాత అంచనాలు..
స్కైమెట్ ప్రొజెక్ట్ చేసిన నెలవారీ గణాంకాలు ఇలా ఉన్నాయి:
జూన్: 101% ఎల్పీఏ (సగటు 165.3 ఎంఎం). ప్రారంభం స్థిరంగా ఉంటుంది.
జూలై: 95% ఎల్పీఏ (సగటు 280.5 ఎంఎం). వర్షాలు తగ్గడం మొదలవుతుంది.
ఆగస్టు: 92% ఎల్పీఏ (సగటు 254.9 ఎంఎం). లోటు పెరగవచ్చు.
సెప్టెంబర్: 89% ఎల్పీఏ (సగటు 167.9 ఎంఎం). అత్యంత బలహీనంగా ఉంటుంది.
భౌగోళికంగా చూస్తే, మధ్య, వాయువ్య భారతదేశం వర్షపాత లోటును ఎదుర్కొనే అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాలు 2026- ఐఎండీ ఏమంటోంది?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం, ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు ఉన్నాయి. అయితే, జూన్-జులై-ఆగస్టు కాలంలో ఎల్ నినో ఏర్పడే అవకాశం 62 శాతంగా ఉండగా, ఆగస్టు-సెప్టెంబర్-అక్టోబర్ నాటికి అది 80 శాతానికి పెరుగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది దేశవ్యాప్త వర్షాల్లో అసమానతలకు దారితీయవచ్చు.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. స్కైమెట్ అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం ఎంత ఉండవచ్చు?
స్కైమెట్ ప్రకారం, ఈ ఏడాది వర్షపాతం సగటు (ఎల్పీఏ) లో 94 శాతంగా, అంటే "సాధారణం కంటే తక్కువ"గా ఉండే అవకాశం ఉంది.
2. ఎల్ నినో అంటే ఏంటి? అది వర్షాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం. ఇది సాధారణంగా భారతదేశంలో వర్షపాతాన్ని తగ్గిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


