Crime news : ఒకరితో పెళ్లి, ఇంకొకరితో ప్రేమ.. పరువు భయంతో నవజాత శిశువును చంపేసిన తల్లి!
భర్తకు దూరంగా ఉంటున్న ఒక యువతి ప్రియుడితో వివాహేతర సంబంధం కారణంగా గర్భం దాల్చింది. సమాజంలో పరువు పోతుందనే భయంతో పుట్టిన కొద్ది గంటలకే ఆ పసికందు గొంతు నులిమి గోతిలో పడేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
అభం శుభం తెలియని నవజాత శిశువును.. ప్రియుడితో కలిసి కన్నతల్లే అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో కలకలం రేపింది. భర్తకు దూరంగా ఉంటున్న 21 ఏళ్ల యువతి, తన 32 ఏళ్ల ప్రియుడితో శారీరికంగా కలవడంతో పుట్టిన ఆడశిశువును గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని గోతిలో పడేసింది.

ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బహిర్భూమికి అని వెళ్లి ప్రసవం.. ఆపై దారుణం!
గాంధీనగర్ జిల్లా దెహ్‌గామ్ సబ్-డివిజన్ పరిధిలోని అంగుతాల గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం.. కల్పన సోలంకి అనే 21 ఏళ్ల యువతి ఏడాదికి పైగా తన భర్త ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉంటోంది. భర్తను కలవకుండానే ఉంటున్న ఆమెకు, కల్జీ సోలంకి (32) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో కల్పన గర్భం దాల్చింది. నవంబర్ 14వ తేదీ రాత్రి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఇంట్లో వారికి అనుమానం రాకుండా ఉండేందుకు, బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి ఆమె సమీపంలోని పశువుల మేత ప్రాంతానికి వెళ్లింది.
అక్కడే ఆమె ఒక ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన వెంటనే ఆ పసికందును అక్కడే ఉన్న తన ప్రియుడు కల్జీ చేతికి అప్పగించింది. కల్జీ ఆ నవజాత శిశువు గొంతు నులిమి, సమీపంలోని ఒక గోతిలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
"సమాజంలో పరువు పోతుందనే భయంతోనే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు," అని దర్యాప్తు అధికారులు తెలిపారు.
పోస్టుమార్టం నివేదికతో బయటపడ్డ అసలు నిజం
మరుసటి రోజు అటుగా వెళ్లిన కొందరు స్థానికులు గోతిలో పడి ఉన్న పసికందును గమనించారు. అప్పటికి శిశువులో ప్రాణం ఉండటంతో వెంటనే వారు ఆ పాపను గాంధీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు! అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూసింది. అనుమానాస్పద మృతిగా భావించిన వైద్యులు, పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. గొంతు నులమడం వల్లే ఆ ఆడశిశువు మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టంగా తేలింది.
వెంటనే రంగంలోకి దిగిన దెహ్‌గామ్ ప్రాంత పోలీసులు గ్రామంలో లోతుగా విచారణ జరిపి కల్పన, కల్జీల కదలికలపై నిఘా పెట్టారు. పక్కా ఆధారాలు లభించడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులపై హత్య కేసుతో పాటు శిశువును నిర్లక్ష్యంగా వదిలివేయడానికి సంబంధించిన వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


