...
...
Next Story

మధ్య ప్రదేశ్ సీఎం కుటుంబానికి 335 ఎకరాల భూమి.. జుడీషియల్ విచారణకు కాంగ్రెస్ డిమాండ్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబం, వారి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉజ్జయినిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశాయనే ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జుడీషియల్ విచారణ జరిపించాలని, సీఎం వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Published on: Jun 24, 2026, 07:56:36 IST
Advertisement

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో భూ కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులు, వారి ఆధీనంలోని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారనే నివేదికలు వెలువడటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇది ముమ్మాటికీ 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' (పరస్పర ప్రయోజనాల ఘర్షణ) కిందకే వస్తుందని ఆరోపిస్తూ, సీఎం మోహన్ యాదవ్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

IE నివేదికతో వెలుగులోకి..

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (@CMMadhyaPradesh)
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (@CMMadhyaPradesh)

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం ప్రకారం.. సీఎం మోహన్ యాదవ్ కుటుంబానికి, వారి కంపెనీలకు ఉజ్జయిని పరిసరాల్లో మొత్తం 335 ఎకరాల భూమి ఉంది. ఇందులో దాదాపు 168 ఎకరాల భూమిని 2024-25 కాలంలోనే కొనుగోలు చేశారు. ఈ భూములన్నీ ఉజ్జయిని జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రోడ్ల పక్కనే ఉండటం గమనార్హం. ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల (Infrastructure) ప్రాజెక్టుల కారణంగా ఈ భూముల విలువ ఒక్కసారిగా భారీగా పెరిగింది. మోహన్ యాదవ్ 2013 నుంచి ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ, సుదీర్ఘకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఆయన 2023 చివరిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

బంధువుల పేర్లతో 245 ప్లాట్లు

భోపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జితు పట్వారీ, అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉమంగ్ సింగార్ సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉజ్జయినిని అక్రమ భూ లావాదేవీలకు కేంద్రంగా మార్చారని ఆరోపించారు.

"మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీద 245 ప్లాట్లలో మొత్తం 335 ఎకరాల భూమి ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే 137 ప్లాట్లలోని 168 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు" అని జితు పట్వారీ గణాంకాలను వివరించారు.

ప్రతిపక్ష నేత ఉమంగ్ సింగార్ ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం కుటుంబం భూములు కొనుగోలు చేసిన ప్రాంతాల్లో భూ వినియోగ మార్పిడి (Land-use changes) కి సంబంధించిన అధికారిక జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జుడీషియల్ విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రాన్ని దోచుకునే ఇంజిన్‌లా వేగంగా నడుస్తోందని విమర్శించారు. వ్యాపమ్ స్కామ్ విజిల్ బ్లోయర్ డాక్టర్ ఆనంద్ రాయ్ స్పందిస్తూ, ఈ భూ లావాదేవీలపైనే కాకుండా, ఈ అంతర్గత పత్రాలను ఎవరు లీక్ చేశారనే దానిపై కూడా దర్యాప్తు జరగాలన్నారు.

ఆరోపణలను ఖండించిన బీజేపీ

ఈ ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భిన్నంగా స్పందించారు. మోహన్ యాదవ్ గతంలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని, ఆ విషయం బీజేపీకి తెలియదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులను మార్చడానికి బీజేపీ అంతర్గతంగా ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే ఈ ఆరోపణలను తెరపైకి తెచ్చి ఉంటారని వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు.

"కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి, ప్రజల్లో అయోమయం సృష్టించడానికే ఇలా చేస్తున్నారు. ఇందులో ఒక్కటి కూడా నిజం లేదు. ముఖ్యమంత్రి 2023 ఎన్నికల నామినేషన్‌లో 17 ఎకరాల భూమిని ప్రకటించారు, నేడు కూడా ఆయన వద్ద అంతే భూమి ఉంది. ఆయన భార్య పేరిట ఉన్న 12.9 ఎకరాల భూమిలోనూ ఎలాంటి మార్పు లేదు" అని హేమంత్ స్పష్టం చేశారు.

గతంలోనూ భూ వివాదాలు

మోహన్ యాదవ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉజ్జయినిలో భూముల చుట్టూ వివాదాలు వినిపించడం ఇది మొదటిసారి కాదు. 2028లో జరగబోయే సింహస్థ కుంభమేళా కోసం ఉజ్జయినిలోని క్షిప్రా నది సమీపంలో దాదాపు 1,800 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరిస్తామని 2025 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ రైతు సంఘమైన భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు తీవ్రం చేయడంతో, చివరకు సీఎం మోహన్ యాదవ్ ఆ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks