Investment Tips : ఎస్​ఐపీ వర్సెస్​ గోల్డ్​ ఇన్వెస్ట్​మెంట్- ఎందులో పెడితే అధిక లాభాలు?

SIP vs Gold investment : డబ్బులు దాచుకోవాలనుకునే వారికి ఎస్‌ఐపీ, బంగారం.. ఈ రెండూ మంచి ఆప్షన్లే. అయితే ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ లాభాలు వస్తాయి? ఎక్కడ రిస్క్ తక్కువగా ఉంటుంది? అనే పూర్తి వివరాలు, 15 ఏళ్ల పెట్టుబడి లెక్కలతో సహా ఈ కథనంలో తెలుసుకోండి..

Published on: May 16, 2026, 10:46:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొంత డబ్బు చేతికి రాగానే చాలా మందికి వచ్చే మొదటి ఆలోచన.. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని! ముఖ్యంగా ఈ రోజుల్లో ‘మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ’ లో డబ్బులు పెట్టాలా? లేక ఎప్పటికీ నమ్మకమైన ‘బంగారం’ పై ఇన్వెస్ట్ చేయాలా? అనే గందరగోళం ఎక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఈ రెండూ కూడా మీ డబ్బును పెంచడానికి ఉపయోగపడేవే అయినప్పటికీ.. మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది? మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు? అనే అంశాలపై మీ ఎంపిక ఆధారపడి ఉంటుంది.

ఎస్​ఐపీ వర్సెస్​ గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్..
ఎస్​ఐపీ వర్సెస్​ గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్..

ముందుగా ఎస్‌ఐపీ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్- సిప్) విషయానికి వస్తే.. ఇందులో మీ బడ్జెట్‌ను బట్టి ప్రతి నెలా రూ. 500 లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్​ని ఒక స్థిరమైన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ డబ్బును ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్​లో పెట్టుబడి పెడతారు. అందుకే దీర్ఘకాలంలో ఇందులో ఎక్కువ రిటర్న్స్ (లాభాలు) వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే.. నగలు, నాణేలు, డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టడం.

ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం.. రిస్క్, రిటర్న్స్ మాత్రమే.

ఎస్‌ఐపీలు నేరుగా షేర్ మార్కెట్‌తో ముడిపడి ఉంటాయి కాబట్టి, లాభాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. కొన్ని సంవత్సరాలు విపరీతమైన లాభాలు రావచ్చు, కొన్ని కాలాల్లో మార్కెట్ మందగించవచ్చు.

ఒక చిన్న ఉదాహరణతో వీటి లాభాల లెక్కలను అర్థం చేసుకుందాం:

పెట్టుబడి రూ. 4,000 చొప్పున 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే..

ఎస్‌ఐపీ లెక్కలు:

ఒకవేళ మీరు ప్రతి నెలా రూ. 4,000 చొప్పున 15 సంవత్సరాల పాటు ఎస్‌ఐపీలో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అంటే 15 ఏళ్లలో మీరు పెట్టే మొత్తం పెట్టుబడి రూ. 7,20,000 అవుతుంది. దీనిపై సగటున ఏడాదికి 12శాతం వార్షిక రిటర్న్స్ వస్తాయని అంచనా వేసినా.. 15 ఏళ్లు పూర్తయ్యేసరికి మీ డబ్బు సుమారు రూ. 19,03,726గా మారుతుంది. అంటే కేవలం లాభాల రూపంలోనే మీకు దాదాపు రూ. 12 లక్షలు అదనంగా వస్తాయి.

బంగారం లెక్కలు:

ఇదే రూ. 4,000 మొత్తాన్ని ప్రతి నెలా చొప్పున 15 సంవత్సరాల పాటు బంగారం (డిజిటల్ లేదా ఈటీఎఫ్) పై ఇన్వెస్ట్ చేశారనుకుందాము. ఇక్కడ కూడా మీ మొత్తం పెట్టుబడి రూ. రూ. 7.20 లక్షలు అవుతుంది. బంగారంపై ఏడాదికి సగటున 10% వార్షిక రిటర్న్స్ వస్తాయని అంచనా వేస్తే.. 15 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి విలువ సుమారు రూ. 16,06,485 అవుతుంది. అంటే ఇందులో మీకు వచ్చే అంచనా లాభం రూ. 8,86,485.

ఈ రెండు ఉదాహరణలను గమనిస్తే.. గోల్డ్‌తో పోలిస్తే ఎస్‌ఐపీ పెట్టుబడిపై అధిక లాభం వచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆర్థిక సంక్షోభాలు లేదా మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్న సమయంలో బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైనదిగా, స్థిరమైనదిగా పరిగణిస్తారు. కానీ ఎస్‌ఐపీలు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి కాబట్టి స్వల్పకాలంలో కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

ఇటీవలి పరిస్థితులో ఉదాహరణగా తీసుకుంటే.. 2024 సెప్టెంబర్​ నుంచి నిఫ్టీ50 రిటర్నులే ఇవ్వలేదు. అదే సమయంలో బంగారం విపరీతంగా పెరిగిపోయింది.

ఎందులో ఇన్వెస్ట్​ చేయాలి?

ఎక్కువ లాభాలు కావాలనుకుని, కాస్త రిస్క్ తీసుకోగలరు అనుకుంటే మ్యూచువల్​ ఫండ్ ఎస్‌ఐపీ వైపు మొగ్గు చూపవచ్చు. లేదు, మాకు రిస్క్ వద్దు, స్థిరమైన భద్రత కావాలి అనుకుంటే బంగారం మంచి ఆప్షన్.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More