Mutual funds : ఇక మ్యూచువల్ ఫండ్స్​ని బహుమతిగా ఇవ్వొచ్చు! సెబీ 'గిఫ్ట్ కార్డ్' రూల్స్ ఇవే..

Mutual fund gift cards : పెట్టుబడులు పెట్టాలని ఆశ ఉండి, ఎక్కడ ఎలా మొదలుపెట్టాలో తెలియని వారికి బహుమతిగా ఏం ఇవ్వాలి? దీనికి 'గిఫ్ట్ ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్' ద్వారా సెబీ అద్భుతమైన పరిష్కారాన్ని ప్రతిపాదించింది. అసలేంటిది? ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 29, 2026, 12:30:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పెట్టుబడులు పెట్టాలని ఉన్నా, చాలా మందికి ఎలా ప్రారంభించాలో సరిగ్గా తెలియదు. మరి వీరికి సాయం ఏలా చేయాలి? భారత మార్కెట్​ నియంత్రణ సంస్థ (సెబీ) దగ్గర ఇప్పుడు దీనికి ఒక సమాధానం ఉంది. అదే.. మ్యూచువల్​ ఫండ్​ గిఫ్ట్​ కార్డ్స్​!

ఇక మ్యూచువల్​ ఫండ్స్​ని గిఫ్ట్​గా ఇవ్వొచ్చు!
ఇక మ్యూచువల్​ ఫండ్స్​ని గిఫ్ట్​గా ఇవ్వొచ్చు!

ఇటీవల విడుదల చేసిన ఒక కన్సల్టేషన్​ పేపర్​.. సెబీ 'గిఫ్ట్ ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్' (గిఫ్ట్​ పీపీఐ) అనే విధానాన్ని ప్రతిపాదించింది. ఇవి ప్రిపెయిడ్ కార్డులు లేదా డిజిటల్ వోచర్లు. వీటిని కొని ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు! అయితే, వీటిని కేవలం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ సెబీ ఆలోచనను తొలుత ‘యాంఫీ’ ప్రతిపాదించింది.

దీనిని మనం అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డుల్లాగే భావించవచ్చు. మీరు కార్డులో డబ్బులు నింపి ఇతరులకు ఇస్తారు. కానీ, తీసుకున్న వారు మాత్రం ఆ డబ్బుతో షాపింగ్ చేయడానికి వీలుండదు, కేవలం మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి.

మ్యూచువల్​ ఫండ్ గిఫ్ట్​ కార్డ్స్​- ఇది ఎలా పనిచేస్తుంది?

మొదటిసారి పెట్టుబడి పెట్టేవారిని దృష్టిలో ఉంచుకుని, స్కీమ్ ఎంపిక కోసం సెబీ రెండు మార్గాలను ప్రతిపాదించింది.

మొదటి మార్గం: కార్డు కొనే వ్యక్తి (బహుమతి ఇచ్చే వారు) కార్డు కొనే సమయంలోనే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను సూచించవచ్చు. అయితే, ఈ సూచన కచ్చితంగా పాటించాలనే నిబంధన లేదు. సెబీ నిబంధనల ప్రకారం ఇది పెట్టుబడి సలహా లేదా సిఫార్సు కిందకు రాదని సెబీ స్పష్టం చేసింది. మ్యూచువల్​ ఫండ్ గిఫ్ట్​ కార్డ్స్​ తీసుకున్న వ్యక్తి.. ఆ సూచించిన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు లేదా తన సొంత ఛాయిస్‌ని ఎంచుకోవచ్చు. ఏదేమైనా, ఈ లావాదేవీ 'డైరెక్ట్ ప్లాన్' కింద జరుగుతుంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఉండదు, ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది.

రెండవ మార్గం: గ్రహీత తనకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సలహా తీసుకుని స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. అప్పుడు ఆ పెట్టుబడి 'రెగ్యులర్ ప్లాన్' ద్వారా జరుగుతుంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ కమిషన్ కూడా కలిసి ఉంటుంది.

ఎంపిక పూర్తిగా గ్రహీత ఇష్టానికే వదిలేశారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఎప్పుడైనా ఆ యూనిట్లను అమ్ముకుంటే, ఆ నగదు కేవలం గ్రహీత రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాలోకి మాత్రమే జమ అవుతుంది.

మ్యూచువల్​ ఫండ్ గిఫ్ట్​ కార్డ్స్​- నిబంధనలు, పరిమితులు..

ఈ ఐడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి సెబీ కొన్ని స్పష్టమైన నిబంధనలను ప్రతిపాదించింది.

గరిష్ట విలువ: ఒక్కో గిఫ్ట్ కార్డు గరిష్ట విలువ రూ. 10,000. ఇది ప్రిపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై ఉన్న ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

రీలోడ్ కుదరదు: కార్డును ఒకసారి ఇష్యూ చేశాక మళ్లీ డబ్బులు నింపలేము.

ఒకేసారి వాడాలి: కార్డులోని పూర్తి మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడిగా పెట్టాలి. పాక్షికంగా వాడుకోవడం లేదా బ్యాలెన్స్ ఉంచుకోవడం కుదరదు.

రీఫండ్: కార్డు కొన్న ఏడాదిలోపు వాడకపోతే, ఆ సొమ్ము తిరిగి కార్డు కొన్న వ్యక్తి ఖాతాలోకి రీఫండ్ అవుతుంది!

ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఇన్వెస్టర్ ఒక ఏఎంసీలో గిఫ్ట్ కార్డులు, ఈ-వాలెట్లు, నగదు ద్వారా ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆర్టీఏలు ట్రాక్ చేస్తాయి. ఒకవేళ గిఫ్ట్ కార్డు ద్వారా వచ్చే పెట్టుబడి విలువ రూ. 50,000 దాటితే, ఆ లావాదేవీని ఆర్టీఏ తిరస్కరిస్తుంది. కేవలం బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా యూపీఐ ద్వారానే ఈ కార్డులకు నిధులు సమకూర్చాలి.

మ్యూచువల్​ ఫండ్ గిఫ్ట్​ కార్డ్స్​- భద్రతా ప్రమాణాలు..

మ్యూచువల్ ఫండ్ నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ పేమెంట్స్ (వేరొకరి ఖాతా నుంచి పెట్టుబడి) నిషిద్ధం. దీనిని అధిగమించడానికి సెబీ ‘ఓనర్‌షిప్ వాలిడేషన్’ను ప్రవేశపెట్టింది.

పెట్టుబడి పెట్టడానికి ముందు, గిఫ్ట్ కార్డుపై ఉన్న పేరు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో ఉన్న పేరు ఒకటేనా అని ఆర్టీఏ తనిఖీ చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే లావాదేవీ తిరస్కరణకు గురవుతుంది. దీనివల్ల వేరొకరి తరపున ఇన్వెస్ట్ చేయడానికి గిఫ్ట్ కార్డును వాడలేరు. ఈ కార్డు జారీకి అయ్యే ఖర్చులను మ్యూచువల్ ఫండ్ కంపెనీలే భరిస్తాయి.

మ్యూచువల్​ ఫండ్ గిఫ్ట్​ కార్డ్స్​- ఇన్వెస్టర్లకు దీని అర్థం ఏంటి?

గిఫ్ట్ ట్యాక్స్ నిబంధనలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. ముంబైకి చెందిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ప్రకారం.. "బంధువులు కాని వారి నుంచి వచ్చే గిఫ్టులు ఏడాదికి రూ. 50,000 లోపు ఉంటే పన్ను ఉండదు. ఒకవేళ ఆ పరిమితి దాటితే మాత్రం గ్రహీత పన్ను కట్టాలి. భార్య, సోదరులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే గిఫ్టులకు పన్ను మినహాయింపు ఉంటుంది."

ఒక్కో కార్డు పరిమితి రూ. 10,000 కాబట్టి, ఒక స్నేహితుడు ఇచ్చే గిఫ్ట్ పన్ను పరిధిలోకి రాదు. కానీ ఇతరుల నుంచి వచ్చే మొత్తం గిఫ్టుల విలువను గ్రహీత గమనించుకోవాలి.

పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై యధావిధిగా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వర్తిస్తుంది.

భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, కొత్తవారిని (ముఖ్యంగా చిన్న పట్టణాల వారిని) ఆకర్షించడం సవాలుగా ఉంది. ఈ గిఫ్ట్ కార్డ్ ఆ ప్రక్రియను సులభతరం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. కేవైసీ పూర్తి చేయడం, ఫోలియో క్రియేట్ చేయడం వంటి పనులు ఈ కార్డు ద్వారా సులభంగా జరుగుతాయి.

ప్లాన్ రూపీ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి మాట్లాడుతూ.. "బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చినట్లుగానే, మ్యూచువల్ ఫండ్ గిఫ్ట్ కార్డ్స్​ కూడా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. కొత్త ఇన్వెస్టర్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం," అని పేర్కొన్నారు. ఇది అమల్లోకి వస్తే, ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక క్లిష్టమైన నిర్ణయం నుంచి 'బహుమతి' అంత సులభమైన విషయంగా మారిపోతుంది!

ఈ సెబీ ప్రతిపాదన ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది వేచి చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More