...
...
Next Story

Subhash Chandra loan : అప్పు రూ. 22,000 కోట్లు.. కట్టాల్సింది రూ. 6.5 కోట్లే! సుభాష్ చంద్ర కేసుపై రచ్చ

రూ.22,000 కోట్లకు పైగా ఉన్న రుణాలను కేవలం రూ.6.5 కోట్లతో సెటిల్ చేసుకునేందుకు జీ మీడియా వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు ఎన్​సీఎల్​టీ ఆమోదం తెలిపడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 99.97 శాతం మేర రుణాలను వదులుకోవడంపై బ్యాంకులు, కాంగ్రెస్ మండిపడగా.. విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Aug 28, 2026, 06:45:30 IST
Advertisement

భారతీయ కార్పొరేట్ దివాలా చరిత్రలోనే అత్యంత విస్మయపరిచే తీర్పు వెలువడింది. జీ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్​సీఎల్​టీ) భారీ ఉపశమనం అందించింది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆయన చెల్లించాల్సిన రూ.22,006.57 కోట్ల రుణాలకు గాను కేవలం రూ.6.5 కోట్లు చెల్లిస్తే సరిపోతుందంటూ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్​సీఎల్​టీ ఆమోదముద్ర వేసింది. అంటే రుణదాతలు ఏకంగా 99.97 శాతం మేర తమ బాకీలను వదులుకోవాల్సి వస్తోంది.

సుభాష్ చంద్ర..
సుభాష్ చంద్ర..

సామాన్యుడు చిన్న గృహ రుణం ఎగవేస్తే ఆస్తులను జప్తు చేసే బ్యాంకింగ్ వ్యవస్థ, వేల కోట్ల ఎగవేతపై ఇంత పెద్ద మొత్తంలో మినహాయింపు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రూ.1,300 కోట్లకు ఇచ్చింది రూ.38 లక్షలే!

ఎన్​సీఎల్​టీ (మూడో) సభ్యుడు నిలేష్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) సెక్షన్ 114 కింద ఈ ప్రణాళికకు అనుమతి ఇచ్చింది. గతంలో ఇద్దరు సభ్యుల బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కేసు మూడో సభ్యుడి వద్దకు వచ్చింది. అయితే ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి సంస్థలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. తమకు రావాల్సిన రూ.1,322.39 కోట్లకు గాను కేవలం రూ.38.09 లక్షలు (అంటే కేవలం 0.028 శాతం) మాత్రమే చెల్లిస్తామనడం చట్టవిరుద్ధమని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కోర్టులో వాదించింది.

ఎన్​సీఎల్​టీ ఏమంది? సుభాష్ చంద్ర వివరణ ఇదీ..

ఈ కేసులో 80.81 శాతం ఓటింగ్ షేర్ ఉన్న కన్సార్టియం రుణదాతలు ఈ ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. దీనితో రుణదాతల వాణిజ్య నిర్ణయాన్ని కోర్టు ధిక్కరించలేదని ఎన్​సీఎల్​టీ స్పష్టం చేసింది. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ కేవలం రూ.31.79 కోట్లు (ఇందులో రూ.25 కోట్ల విలువైన ఇల్లు ఉంది) మాత్రమేనని, ఆయనను పూర్తిగా దివాలా తీయించడం కంటే సంస్థను మళ్లీ నిలబెడితేనే అసలు రుణగ్రహీతల నుంచి సొమ్ము రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని 144 పేజీల తీర్పులో పేర్కొంది. దీనిపై సుభాష్ చంద్ర స్పందిస్తూ, "నాకు ఏ బ్యాంకుతోనూ వ్యక్తిగత అప్పులు లేవు, కేవలం గ్యారంటీలు మాత్రమే ఇచ్చాను. నా కంపెనీలు తీసుకున్న రూ.45,000 కోట్ల రుణాల్లో ఇప్పటికే రూ.43,000 కోట్లు చెల్లించాం," అని తెలిపారు.

కాంగ్రెస్ ఆగ్రహం.. మాల్యా సంచలన వ్యాఖ్యలు!

"ఇది సాధారణ హెయిర్‌కట్ (రుణాల తగ్గింపు) కాదు, బ్యాంకింగ్ వ్యవస్థకు ఉచితంగా గుండు కొట్టడమే. 2016 దివాళా కోడ్‌ను ఇది పూర్తిగా హాస్యాస్పదం చేసింది," అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తీవ్రంగా విమర్శించారు.

మరోవైపు ఈ పరిణామంపై లండన్ నుంచి విజయ్ మాల్యా ట్విట్టర్ (ఎక్స) వేదికగా స్పందించారు.

"ఇదే నిజమైతే నా మిత్రుడు సుభాష్‌కు అభినందనలు. రూ.6,203 కోట్ల బాకీకి గాను బ్యాంకులు నా వద్ద నుంచి రూ.14,100 కోట్లు గుంజాయి. కానీ ఇతరులకు మాత్రం స్వల్ప మొత్తానికే సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇదే మన దేశపు న్యాయం," అని ఎద్దేవా చేశారు.

కాగా, ఈ తీర్పు ద్వారా తమకు కేవలం 3.2 శాతం రికవరీ మాత్రమే లభిస్తుండటంతో, ఎన్​సీఎల్​టీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎన్​సీఎల్ఏటీలో అప్పీల్ చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమాయత్తమవుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe