NEET UG : పేపర్​ లీక్​ తర్వాత ప్రక్షాళన! వచ్చే ఏడాది నుంచి ఆన్​లైన్​లోనే ‘నీట్’ పరీక్ష..

NEET UG 2026 : నీట్​ యూజీ పేపర్​ లీక్​ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది, అంటే 2027 నుంచి నీట్​ పరీక్షను ఆన్​లైన్​లో నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొంది.

Published on: May 15, 2026, 11:22:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

NEET UG CBT : నీట్​ యూజీ 2026 పేపర్​ లీక్, పరీక్ష రద్దు అనంతరం వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిపే ఈ నీట్​ (నేషనల్​ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్​ టెస్ట్​) పరీక్షను వచ్చే ఏడాది నుంచి (2027) కంప్యూటర్​ ఆధారంగా (ఆన్​లైన్) నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. (ANI)
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. (ANI)

“భవిష్యత్తులో ఇలాంటి (పేపర్​ లీక్) అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు.. 2027 విద్యాసంవత్సరం నుంచి నీట్ యూజీ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహిస్తాము,” అని ఆయన ప్రకటించారు.

“ఎన్టీఏలోని లోపాలను సరిచేయాలి. ఎన్టీఏ జవాబుదారీగా ఉండాలి. కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటిని సమగ్రంగా దర్యాప్తు చేస్తాము,” అని నీట్​ యూజీ 2026 పేపర్​ లీక్​పై ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ క్రమంలోనే పేపర్​ లీక్​కి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

ఈ పూర్తి వివాదంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. "ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కమాండ్ చైన్‌లో లోపం జరిగింది. దీనికి మేము పూర్తి బాధ్యత వహిస్తున్నాము. భవిష్యత్తులో ఇలా జరగకుండా వ్యవస్థను సరిచేస్తాము. విద్యార్థులు ఆందోళన చెందవద్దు, ఎలాంటి వదంతులను నమ్మవద్దు," అని పిలుపునిచ్చారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, సీబీఎస్‌ఈ ఛైర్‌పర్సన్ రాహుల్ సింగ్‌లతో కలిసి మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు.

నీట్​ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్​ వివరాలు..

మరోవైపు జూన్ 21న జరిగే నీట్ రాసే విద్యార్థులకు ఊరట కలిగిస్తూ అభ్యర్థులు తమకు నచ్చిన పరీక్షా కేంద్రాలను ఎంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 14న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తుందని స్పష్టం చేశారు.

విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి పరీక్షా సమయాన్ని మరో 15 నిమిషాల పాటు పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. దీని ప్రకారం జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది.

పేపర్ లీక్ కేసులో ఐదుగురి అరెస్ట్.. సీబీఐ కస్టడీకి నిందితులు

మే 3న జరిగిన నీట్ పరీక్షను, పేపర్ లీక్, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ బృందం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసింది. జైపూర్ నుంచి మాంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేష్ బివాల్.. గురుగ్రామ్ నుంచి యష్ యాదవ్, నాసిక్ నుంచి శుభమ్ ఖైర్నార్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఐదుగురు నిందితులకు దిల్లీ హైకోర్టు 7 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించిందని పీటీఐ నివేదించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More